ఏడాదిలోగా జాతీయ ఇ కామర్స్‌ విధానం

ఏడాదిలోగా జాతీయ ఇ కామర్స్‌ విధానం అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్ గోయ‌ల్ వెల్ల‌డించారు

ఏడాదిలోగా జాతీయ ఇ కామర్స్‌ విధానం

ఇ-కామర్స్‌ రంగ వృద్ధి కోసం జాతీయ ఇ కామర్స్‌ విధానాన్ని ఏడాదిలోగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సంస్థాగత వ్యవస్థను నెలకొల్పుతామని, ఇ కామర్స్‌ కంపెనీలతో పాటు, ఈ రంగ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. డేటా, ఇ కామర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ సమాజంతో కలిసి సాగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అయితే ఆయా దేశాలు కూడా ఇదేవిధంగా వ్యవహరించాలన్నది తమ ఆకాంక్షగా తెలిపారు.

ఇ కామర్స్‌ ముసాయిదా విధానాన్ని ప్రభుత్వం గత ఫిబ్రవరిలో విడుదల చేసిన సంగతి విదితమే. దేశీయ వినియోగదారుల డేటా విదేశాలకు తరలిపోకుండా సాంకేతిక, చట్టపరమైన నిబంధనలు రూపొందించాలని అందులో ప్రతిపాదించారు. వాణిజ్యసంస్థలు దేశీయంగా సేకరించే, ప్రాసెసింగ్‌ చేసే సమాచారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికీ షరతులు తలపెట్టారు. డేటా నిబంధనలపై పలు ఇ కామర్స్‌ సంస్థలు అభ్యంతరాలు తెలిపాయి. ఇ కామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు సంబంధించి ముసాయిదా నిబంధనలపై నెలకొన్న ఆందోళనలకు పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య (డీపీఐఐటీ) విభాగం కింద ఏర్పాటయ్యే మంత్రివర్గ సంఘం పరిష్కారం చూపుతుందని తెలిపారు. ప్రస్తుత ఎఫ్‌డీఐ చట్టానికి ఎటువంటి మార్పులు చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న కంపెనీలు కూడా ఈ విషయాన్ని అంగీకరించాయన్నారు. రిటైల్‌, ఇ కామర్స్‌ సంస్థలతో మరోసారి సమావేశమై, ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని మంత్రి నిర్ణయించారు.

వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్నాప్‌డీల్‌, పేటీఎం, ఇబే, మేక్‌మైట్రిప్‌, స్విగ్గీ సహా ఇతర సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), రాయితీలకు సంబంధించి తమ ఆందోళనలను ఇ కామర్స్‌ సంస్థలు తెలియ చేశాయి. ఇ కామర్స్‌తో పాటు డిజిటలీకరణను మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వ యత్నాలున్నాయని ఫ్లిప్‌కార్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి కల్యాణ్‌ కృష్ణమూర్తి ప్రశంసించారు. ఆయా అంశాలపై పారదర్శక సంప్రదింపులకు మంత్రి అవకాశం కల్పిస్తున్నారని వాల్‌మార్ట్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly