కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త ఆర్థిక నిర్ణ‌యాలు

ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలో పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియోను మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా రీబ్యాలెన్స్ చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త ఆర్థిక నిర్ణ‌యాలు

మంచి ప‌ని చేసేందుకు స‌రైన‌ స‌మ‌యం అవ‌స‌రం లేద‌ని అంటుంటారు. ఆర్థిక విష‌యాల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది. డ‌బ్బును పొదుపు చేసేందుకు, పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు, పోర్ట్ఫోలియోను స‌మీక్షించుకోవ‌డం వంటి వాటికి స‌రైన స‌మ‌యం కోసం వేచి చూడాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు ఆర్థిక స‌ల‌హాదారులు. ఒక‌వేళ స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్న‌వారైతే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మైంది. ఇంత‌కంటే మంచి స‌మ‌యం ఇంకేముంటుంది. ఇప్పుడే పెట్టుబ‌డులు ప్రారంభించండి. ఈ 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంల పాటించాల్సిన‌ కొన్ని ఆర్థిక విష‌యాల‌ను తెలుసుకుందాం

ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాల‌ను ఎంచుకోండి:

ఆర్థిక ప్ర‌ణాళిక అనేది ప‌న్ను ఆదా చేసేవిధంగా ఉండాలి. కొంత‌మంది ఆర్థిక సంవ‌త్స‌రం ముగుస్తున్న స‌మ‌యంలో హ‌డావిడిగా ప‌న్ను ఆదా చేసేందుకు పెట్టుబ‌డుల‌కు సిద్ధ‌ప‌డ‌తారు. దీంతో త‌గిన స‌మ‌యం లేక‌పోవ‌డంతో ల‌క్ష్యాల‌కు త‌గిన ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. అందుకే ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన వెంట‌నే ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాలేంటో. మీకు ఏది స‌రిపోతుందో తెలుసుకొని పెట్టుబ‌డులు ప్రారంభించాలి. మొద‌టినుంచి ప్రారంభిస్తే డ‌బ్బు ఒక్క‌సారిగా పెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఎందులో పెట్టుబ‌డులు పెట్టాలో ఆలోచించేందుకు త‌గిన స‌మ‌యం ఉంటుది.

బీమా అవ‌స‌రాన్ని గుర్తించండి:

ప్ర‌తీ ఒక్క‌రికీ బీమా అనేది చాలా అవ‌స‌రం. రిస్క్ క‌వ‌రేజ్ అనేది స్థిరంగా ఉండ‌కూడ‌దు. సంద‌ర్భాన్ని బట్టి మారుతుండాలి. పెళ్లి చేసుకున్నాక‌, పిల్ల‌లు పుట్టాక అవ‌స‌రాలు మారుతుంటాయి. ఆస్తులు కొనుగోలు చేసిన‌ప్పుడు, వ‌య‌సు పెరుగుతున్న‌ప్పుడు బీమా క‌వ‌రేజ్ పెరుగుతుండాలి.

జీవిత బీమా, ఆరోగ్య బీమా క‌వ‌రేజ్ ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకోవ‌డం చాలా ముఖ్యం. అవ‌స‌రాన్ని బ‌ట్టి బీమా ప్రాముఖ్య‌త‌ను పెంచుకోవాలి. బీమాను పెట్టుబ‌డులుగా చూడ‌కూడ‌దు. ఎన్ని పాల‌సీలు ఉన్నాయ‌న్న‌ది కాదు ఎంత రిస్క్ క‌వ‌రేజ్ ఉంద అనేది ముఖ్యం. ట‌ర్మ్ ప్లాన్ ఉంటే కుటుంబానికి ఆర్థిక భ‌రోసాను ఇచ్చిన‌వార‌వుతారు.

న‌గ‌దు నిర్వ‌హ‌ణ‌:

న‌గ‌దు నిర్వ‌హ‌ణ అనేది ఆర్థిక జీవ‌నంలో చాలా ముఖ్య‌మైన అంశం. మీ ఆదాయాన్ని , ఖ‌ర్చుల‌ను లెక్కించుకొని ఎంత‌మేర‌కు పెట్టుబ‌డులకు కేటాయించ‌గ‌లుగుతారో నిర్ణ‌యించుకోవాలి. చాలామందికి ఎంత పొదుపు చేయాలో అవ‌గాహ‌న ఉండ‌దు. ఎందుకంటే, ఒక నెల‌కు లేదా సంవ‌త్స‌రానికి ఎంత ఖ‌ర్చువుతుందో క‌చ్చితంగా లెలియ‌క‌పోవ‌చ్చు. మీ ఖ‌ర్చుల‌ను లెక్కిస్తేనే అవ‌స‌ర‌మైన‌వి ఎంత అన‌వ‌స‌రంగా ఎంత ఖ‌ర్చు చేస్తున్నార‌నేది తెలుస్తుంది. అప్పుడు ఎంత పొదుపు చేయ‌గ‌ల‌రో నిర్ణ‌యించుకునే అవ‌కాశం ఉంటుంది.

పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకోండి:

ఆర్థిక ప్ర‌ణాళిక అనేది ఒకేసారి చేసుకునేది కాదు. స‌మ‌యానుసారం దానిని స‌మీక్షించుకుంటూ అవ‌స‌ర‌మైన మార్పులు చేస్తుండాలి. ఆర్థిక ల‌క్ష్యాలు మారినా కొద్ది పెట్టుబ‌డుల పోర్ట్ఫోలియో మారుతుండాలి. అవ‌స‌రాల‌ను బ‌ట్టి పెట్టుబ‌డులు బ్యాలెన్స్ చేసుకోవ‌డం స‌రైన ప‌ద్ధ‌తి. ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలో పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. గ‌తేడాది ఈక్విటీ, డెట్ మార్కెట్ల‌లో చాలా అనిశ్చితి ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో కేటాయింపుల్లొ మార్పులు చేసి ఉండొచ్చు. తిరిగి ఇప్పుడు రీబ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవ‌స‌రం రావొచ్చు, లేక‌పోతే రిస్క్‌లో ప‌డిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఆర్థ‌క సంవత్స‌రం ప్రారంభంలో ప‌న్ను ఆదా చేసుకునే విధంగా పెట్టుబ‌డుల‌ను కేటాయించాలి.

అవాస్త‌వాల‌ను న‌మ్మి మోస‌పోవద్దు:

కొన్ని ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే ఎక్కువ రాబ‌డి వ‌స్తుందని ప్ర‌చారాల‌తో స్వ‌ల్పకాలిక లాభం కోసం పెట్టుబ‌డులు పెట్ట‌వద్దు. ఇవి రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. స్నేహితులు, బందువుల స‌ల‌హాతో ఎటువంటి అవ‌గాహ‌న లేకుండా లాభం వ‌స్తుంద‌నే ప్ర‌చారంతో గుడ్డిగా పెట్టుబ‌డులు పెట్ట‌వద్దు దీంతో న‌ష్ట‌పోయే అవ‌కాశాలు ఎక్కువ. మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు తగిన‌ట్లుగా పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. దీంతో క‌చ్చితంగా రాబ‌డి పొందుతారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly