కొత్త సంవ‌త్స‌రం.. రిసొల్యూషన్స్ ఏంటి?

ఇప్ప‌టికే రుణాలు ఉంటే వాటిని చెల్లించ‌డ‌మే ఒక రిసొల్యూష‌న్‌గా పెట్టుకోండి

కొత్త సంవ‌త్స‌రం.. రిసొల్యూషన్స్ ఏంటి?

కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేసింది. ఈ ఏడాదిలో ఏం చేయాలో ఏం చేయ‌కూడ‌ద‌నే అంద‌రూ కొన్ని తీర్మానాలు (రిసొల్యూష‌న్స్) తీసుకుంటారు. క్ర‌మంగా వ్యాయామం చేయాలి, కుటుంబంతో స‌మ‌యం గ‌డ‌పాలి వంటివి ఇందులో కొన్ని. దీంతో పాటు ఆర్థిక ప‌రంగా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నారు. చాలామంది ఆర్థిక విష‌యాల గురించి ఆలోచించ‌రు ఎందుకంటే వారికి వ‌చ్చే డ‌బ్బు పొదుపు చేసుకునేంత‌గా లేద‌ని అనుకుంటారు. త‌క్కువ ఆదాయం పొందుతున్న‌ప్పుడు త‌క్కువ మొత్తంలో సిప్ ద్వారా మ‌దుపు చేస్తే సరిపోతుంది. ఆదాయానికి త‌గిన‌ట్లుగా ఈ కొత్త ఏడాదిలో కొత్త నిర్ణ‌యాలు తీసుకోండి.

అత్య‌వ‌స‌ర నిధి
దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గించింది. వ‌చ్చే మూడు త్రైమాసికాల వ‌ర‌కు లేదా 2021 ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి అర్థ భాగంలో పెద్ద‌గా మార్పు ఏమి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ఆర్థిక‌వేత్త‌లు భావిస్తున్నారు. చాలా రంగాల్లో ఉద్యోగ కోత‌లు కొన‌సాగ‌వ‌చ్చు. వ్యాపారాలు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌ర నిధి అనేది చాలా అవ‌స‌రం.

అత్య‌వ‌స‌ర నిధి మీ ఆరు నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌ర‌ప‌డేంత ఉండాలి. దీనికోసం పొదుపు ప్రారంభించేముందు అవ‌స‌రాలు అంటే ఈఎమ్ఐ, అద్దె, పిల్ల‌ల స్కూలు ఫీజులు, గ్రాస‌రీ బిల్లు, వినియోగ బిల్లులు వంటివి లెక్కించుకోవాలి. మీరు ప‌నిచేసే రంగం, ఉద్యోగాన్ని బ‌ట్టి12 నెల‌ల ఖ‌ర్చుల‌కు సరిప‌డా కూడా పొదుపు చేసుకోవాలి.

అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు క‌త్తెర‌
అత్య‌వ‌స‌ర నిధి ఏర్ప‌రుచుకునేందుకు కొత్త‌గా డ‌బ్బు ఎక్క‌డ్నుంచి వ‌స్తుంద‌ని అనుకుంటున్నారా, అయితే మీ అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకోండి. జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోండి. అప్పుడు పొదుపు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లు, హోట‌ళ్ల‌లో బోజ‌నం, విదేశీ ప‌ర్య‌ట‌న‌లు, సినిమాలు, విందు, వినోదాలు వంటివి అవ‌స‌ర‌మైన మేర‌కు త‌గ్గించుకుంటే అత్య‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కేవ‌లం అవ‌స‌ర‌మైన మేర‌కు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టి, అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకుంటే మంచిద‌ని విశ్లేష‌కులు భావ‌న‌. ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయిని లెక్కించుకోవాలి. అవ‌స‌రమైన‌, అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌ను జాబితా వేసుకోవాలి. చిన్న చిన్న ఖ‌ర్చులు త‌గ్గించుకుంటే ఎంత ఆదా అవుతుందో తెలుసుకంటే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు.

అప్పుల జోలికి పోవ‌ద్దు
ఆర్థిక జీవ‌నానికి అప్పులు అంత మంచివి కావు. కానీ వ్య‌క్తులు వారి ఇష్టాల‌ను , ఆస‌క్తుల‌ను నెరవేర్చుకోవ‌డానికి అప్పులు చేయ‌డం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. జీరో వ‌డ్డీ రేట్లు, క్రెడిట్ కార్డులు పెర‌గ‌డంతో సుల‌భంగా అప్పు తీసుకొని నెల‌వారిగా చెల్లిస్తున్నారు. ఒక్కోసారి ఇవి న‌ష్టాల‌కు దారితీయ‌వ‌చ్చు. ఈ కొత్త సంవ‌త్స‌రంలో రుణాలు తీసుకోవ‌ద్ద‌ని తీర్మానించుకోండి.
అయితే ఇప్ప‌టికే ఉన్న రుణాల‌కు ఈఎమ్ఐ చెల్లిస్తుంటే వాటిని పూర్తి చేయ‌డ‌మే ఒక తీర్మానంగా పెట్టుకోండి. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఆరోగ్య చికిత్స లేదా ఇంటి కోసం రుణం వంటి కార‌ణాల‌తో రుణాలు తీసుకుంటే ఫ‌ర్వాలేదు. కానీ ల‌గ్జ‌రీల కోసం రుణం తీసుకోవ‌ద్ద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉన్న రుణాల‌ను ముందుగా చెల్లించండి. క్రెడిట్ కార్డు రుణాల‌పై వార్షికంగా 48 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ప‌డుతుంది. వ్య‌క్తిగ‌త రుణాల‌పై 18-24 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఈ రుణాలు ఉంటే వీలైనంత త్వ‌ర‌గా చెల్లించాలి.

క్రెడిట్ కార్డు లేదా వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఈఎమ్ఐ రూపంలో చెల్లిస్తూ డ‌బ్బును పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగించ‌డం అంత తెలివైన ఆలోచ‌న కాదు. ఎందుకంటే పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే మొత్తం పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డి కంటే ఎక్కువ‌గా ఉంటుంది. క్రెడిట్ కార్డుల‌పై చెల్లించాల్సిన మొత్తం మీ ఒక నెల ఆదాయం కంటే ఎక్కువ‌గా ఉంటే మీ పెట్టుబ‌డుల నుంచి కొంత ఉప‌సంహ‌రించుకొని చెల్లించ‌డం మంచిది.

ఆర్థిక భ‌ద్ర‌త‌కు బీమా
చివ‌ర‌గా త‌ప్ప‌నిస‌రిగా చెప్పాల్సింది బీమా గురించి. జీవితంలో అనుకోని సంఘ‌ట‌ల‌ను ఎప్పుడైనా ఎదురుకావొచ్చు. చాలామందికి బీమా గురించి అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ…స‌రిప‌డే బీమా పాల‌సీల‌ను మాత్రం ఎంచుకోవ‌ట్లేదు. ఇక్క‌డ నియ‌మం ఏంటంటే మీ వార్షిక ఆదాయానికి 10 రెట్లు హామీ ఉన్న జీవిత బీమా పాల‌సీని తీసుకోవాలి.

బీమా కంపెనీల వెబ్‌సైట్‌ల‌లో ఉండే క్యాలిక్చులేట‌ర్ల సాయంతో మీ ఆదాయానికి త‌గిన పాల‌సీని ఎంచుకోవాలి. అదేవిధంగా యులిప్స్, ఎండోమెంట్ వంటి పాల‌సీల‌ను తీసుకోక‌పోవ‌డం మంచిది. పెట్టుబ‌డుల‌తో క‌లిపి ఉన్న పాల‌సీల‌ను దూరం పెట్టాలి.

దీంతో పాటు ఆరోగ్య బీమా పాల‌సీ కూడా అవ‌స‌రం. మీ సంస్థ ఇచ్చే పాల‌సీతో పాటు అద‌నంగా మ‌రో పాల‌సీ కూడా ఉండాలి. రూ.10-15 ల‌క్ష‌ల హామీతో కూడిన వ్య‌క్తిగ‌త లేదా మీపై ఆధార‌ప‌డిన వారి కోసం ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని కొనుగోలు చేయాలి. ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగే కొద్ది వైద్య ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. వాటిని త‌గ్గించుకోడానికి ఎప్ప‌టిక‌ప్పుడు టాప్‌-అప్ ప్లాన్‌ల‌ను కొనుగోలు చేయాలి. ఈ ఏడాది నుంచి ఈ కొత్త తీర్మానాల‌తో మీ జీవితాన్ని ఆనందంగా మ‌లుచుకోండి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly