ఏటీఎమ్‌..డెబిట్‌కార్డు..నెఫ్ట్..ఇత‌ర లావాదేవీలలో మారిన నియ‌మాలు

పొదుపు ఖాతాదారుల‌కు జ‌న‌వ‌రి 1నుంచి ఆన్‌లైన్ నెఫ్ట్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆర్‌బీఐ, బ్యాంకుల‌ను ఆదేశించింది

ఏటీఎమ్‌..డెబిట్‌కార్డు..నెఫ్ట్..ఇత‌ర లావాదేవీలలో మారిన నియ‌మాలు

నేడు జ‌న‌వ‌రి 1, కొత్త సంవత్స‌రం ఆరంభం మాత్ర‌మే కాదు. ఈ సంవ‌త్స‌రం ఆర్థికంగా వ‌చ్చిన అనేక మార్పులు కూడా నేటి నుంచి అమలులోకి వ‌చ్చాయి. డెబిట్‌కార్డు, నెఫ్ట్ లావాదేవీల‌ల‌తో పాటు నూత‌న సంవ‌త్స‌రంలో మారిన కొన్ని నియ‌మాలు ఇప్పుడు చూద్దాం.

డెబిట్‌, ఏటీఎమ్ కార్డులు:
జ‌న‌వ‌రి 1వ తేది నుంచి మాగ్నిటిక్ స్ట్రిప్‌తో కూడిన అన్ని ఏటీఎమ్ లేదా డెబిట్ కార్డులు ప‌నిచేయ‌వు. వీటి స్థానంలో కొత్త ఈఎమ్‌వీ చిప్‌తో కూడిన డెబిట్ కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు వీటిని ఉచితంగా జారీ చేస్తాయి. ఎలాంటి రుస‌ములు చెల్లించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం అన్ని బ్యాంకులు వారి వినియోగ‌దారుల నుంచి పాత మాగ్న‌టిక్ డెబిట్ కార్డుల‌ను సేక‌రించి వాటి స్థానంలో ఈఎమ్‌వీ ఆధారిత కార్డుల‌ను జారీ చేయాలి. మీరు ఇప్ప‌టికీ పాత డెబిట్ కార్డుల‌నే వినియోగిస్తుంటే, ఆర్‌బీఐ సూచ‌న‌ల ప్ర‌కారం బ్యాంకులు మీ కార్డును బ్లాక్ చేస్తాయి. అందువ‌ల్ల మీది ఈఎమ్‌వీ చిప్ కార్డు అవునా…కాదా… అనేది బ్యాంకును సంప్ర‌దించి నిర్థారించుకోవాల‌ని ఎస్‌బీఐ తెలిపింది.

డెబిట్ లేదా ఏటీఎమ్ కార్డుపై చిప్ క‌నిసిస్తుంటే మీరు ఇప్ప‌టికే ఈఎమ్‌వీ కార్డును ఉప‌యోగిస్తున్నార‌ని అర్ధం. ఒక‌వేళ లేక‌పోతే కొత్త కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఈఎమ్‌వీ కార్డుల‌పై మైక్రోచిప్ ఉంటుంది. ఇది మోస‌పూరిత లావాదేవీల నుంచి కొనుగోలు దారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. లావాదేవీలు నిర్వ‌హించిన ప్ర‌తీసారి ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తుంది. అందువ‌ల్ల ఈ కార్డును క్లోనింగ్ చేయ‌డం అసాధ్యం.

నెఫ్ట్ చార్జీల ర‌ద్దు:
డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వీలుగా నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) లావాదేవీల్ని 24 గంటలూ కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. డిసెంబ‌రు 16 నుంచి ఈ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం పొదుపు ఖాతాదారుల‌కు జ‌న‌వ‌రి 1వ తేది నుంచి ఆన్‌లైన్ నెఫ్ట్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను ర‌ద్దు చేయాల‌ని బ్యాంకుల‌ను ఆదేశించింది. కొన్ని బ్యాంకులు ఇప్ప‌టికే నెఫ్ట్ లావాదేవీల‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అయితే బ్యాంకు బ్రాంచిల వ‌ద్ద చేసే లావాదేవీల‌పై మాత్రం చార్జీలు కొన‌సాగ‌వ‌చ్చు.

రూపే, యూపీఐ ఛార్జీలు:
రూపే, యూపీఎమ్ వేదిక‌ల ద్వారా చేసే లావాదేవీల‌పై మ‌ర్చెంట్ డిస్కౌంట్ రేట్‌(ఎమ్‌డీఆర్‌) ర‌ద్దు చేశారు. రూ.50 కోట్లు లేదా అంత‌కంటే ఎక్కువ ట‌ర్నోవ‌ర్ ఉన్న వ్యాపార సంస్థ‌లు రూపే కార్డు, యూపీఐ క్యూర్ఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసే స‌దుపాయాన్ని వినియోగ‌దారుల‌కు త‌ప్ప‌నిస‌రిగా అందుబాటులో ఉంచాల‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. ఈ సేవ‌లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఎస్‌బీఐ ఏటీఎమ్ విత్‌డ్రాలు:
ఇక‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎమ్ కార్డు ద్వారా చేసే న‌గ‌దు విత్‌డ్రాల‌కు ఓటీపీ(ఒన్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌) అవ‌స‌రం. జ‌న‌వ‌రి 1 వ‌తేది మొద‌లు రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు చేసే రూ.10వేల‌కు మించిన న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు ఎస్‌బీఐ ఒటీపీని ప్ర‌వేశ‌పెట్టింది. అయితే మీరు ఇత‌ర బ్యాంక్ ఏటీఎమ్ వ‌ద్ద‌ న‌గ‌దు విత్‌డ్రా చేస్తే ఓటీపీ అవ‌స‌రం ఉండదు.

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు(ఐటీఆర్‌) ఫైల్లింగ్‌:
ఆదాయపు పన్ను రిట‌ర్నులు(ఐటీఆర్‌) దాఖలు చేసేందుకు ఆగస్టు 31 చివ‌రి తేది. అయితే ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు తేది వ‌ర‌కు ఐటీఆర్‌ను ఫైల్ చేయ‌వ‌చ్చు. ఆల‌స్యంగా రిట‌ర్నుల దాఖ‌లు చేసిన వారికి జ‌న‌వ‌రి 1 వ‌తేది నుంచి రూ. 10వేల జరిమానా విధిస్తారు.

పాన్ కార్డ్‌:
పాన్ నెంబ‌రును ఆధార్‌తో అనుసంధానించ‌క‌పోతే జ‌న‌వ‌రి 1 నుంచి పాన్ కార్డు ప‌నిచేయ‌ద‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ గ‌తంలో తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ గ‌డువు తేదిని డిసెంబ‌రు 31 నుంచి మార్చి 31 వ‌ర‌కు పొడిగించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly