సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ల్లో ప‌న్ను మిన‌హాయింపు

ఈఎల్ఎస్ఎస్ త‌ర‌హాలో సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా మ‌దుప‌ర్లు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు

సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ల్లో ప‌న్ను మిన‌హాయింపు

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) లో పెట్టుబడులు పెట్టే మ‌దుప‌ర్లు, ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)లో పెట్టుబడి పెట్టినట్లే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. సీపీఎస్ఈ ఈటిఎఫ్‌ను పన్ను ప్ర‌యోజ‌నం చేకూరేలా ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2019 ప్రసంగంలో ప్రకటించారు. రిటైల్ పెట్టుబడిదారులకు ఈటీఎఫ్‌లు ఒక ముఖ్యమైన పెట్టుబడి మార్గంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉపసంహరణ కార్యక్రమానికి కూడా మంచి సాధనంగా మారింది. దీన్ని మరింత విస్తరించడానికి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) తరహాలో ప్రభుత్వం ఈటీఎఫ్ల‌లో పెట్టుబడి ఎంపికను అందిస్తుంది. ఇది సీపీఎస్ఈలో దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను కలిగి ఉన్న సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను 2014 లో ప్రభుత్వం ప్రారంభించింది. అనంత‌రం మ‌రికొన్ని విడ‌త‌లు ప్రారంభించింది. ప్రభుత్వం ఎంచుకున్న ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలో తన వాటాను ఉప‌సంహ‌రిచుకోవ‌డానికి ప్రారంభించింది. ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్‌లలో తక్కువ ఖర్చుతో పెట్టుబడులు పెట్టాలని, దీర్ఘకాలికంగా సంపదను సృష్టించాలని చూస్తున్న పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే తక్కువ వ్యయ నిష్పత్తి త‌క్కువ‌.

భారత్ -22 ఈటీఎఫ్ 22 కంపెనీలను - 19 ప్రభుత్వ రంగ సంస్థలు, ప్ర‌భుత్వం స్వ‌ల్ప‌ వాటాను కలిగి ఉన్న‌మూడు ప్రైవేటు రంగ సంస్థ‌ల్లో పెట్టుబ‌డి పెట్టింది. ఇది ఆరు రంగాలకు (బేసిక్ మెట‌ల్స్,ఎన‌ర్జీ, ఫైనాన్స్, ఎఫ్ఎమ్‌సీజీ, పరిశ్రమలు, యుటిలిటీస్) చెందిన ప్ర‌భుత్వ రంగ కంపెనీల్లో పెట్టుబ‌డి చేస్తూ విభిన్నంగా ఉంటుంది. దీనిని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తుంది. ఒక్కో కంపెనీ స్టాక్ వెయిటేజ్ 15%, సెక్టార్ వెయిటేజీలో 20% కి పరిమితికి లోబ‌డి ఉండాలి. అదేవిధంగా, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను నిర్వహిస్తోంది, ఇందులో ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, కోల్ ఇండియా, ఐఓసి, ఆర్‌ఇసి, పిఎఫ్‌సి, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్‌బిసిసి, ఎన్‌ఎల్‌సి ఇండియా, ఎస్‌జెవిఎన్ 11 బ్లూచిప్ పిఎస్‌యుల స్టాక్‌లు ఉన్నాయి.

ఈఎల్ఎస్ఎస్ లో లాక్ ఇన్ పిరియ‌డ్ మూడేళ్లు ఉంటుంది. ఇత‌ర ప‌న్ను ఆదా ప‌థ‌కాలు యూలిప్ లు, పీపీఎఫ్ కంటే త‌క్కువ లాక్ ఇన్ కాల‌ప‌రిమితి ఉంటుంది. భారతీయ ఆదాయ‌ పన్నుచట్టం, 1961 సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మూడేళ్ల కాల‌ప‌రిమితి ఉండ‌టం వ‌ల్ల ఫండ్ మేనేజ‌ర్లు దానికి అనుగుణంగా పెట్టుబ‌డి ప్ర‌ణాళిక వేసేందుకు మంచి అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా ఇవి మంచి రాబ‌డిని అందించే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly