డిజిట‌ల్ పేమెంట్స్‌పై ఫిర్యాదుల‌కు.. అంబుడ్స్‌మెన్‌ స్కీం

వినియోగదారులకున్న విశ్వాసాన్ని మరింత పెంచేందుకు అంబుడ్స్‌మెన్‌ స్కీంను అమలు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది

డిజిట‌ల్ పేమెంట్స్‌పై ఫిర్యాదుల‌కు.. అంబుడ్స్‌మెన్‌ స్కీం

ప్ర‌స్తుత‌ కాలంలో డిజిటల్‌ లావాదేవీలు చాలా వేగంగా విస్తరించాయి. షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినా… విద్యుత్‌, నీటి బిల్లులు చెల్లించాలన్నా క్రెడిట్‌/డెబిట్‌ కార్డులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే వీటి వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. ఒక్కోసారి ఖాతా నుంచి డబ్బు కట్‌ అయినా ట్రాన్సాక్షన్‌ విఫలమవడం, లేదా ఒకరికి పంపాల్సిన మొత్తం మరొకరికి వెళ్లడం లాంటివి జరుగుతున్నాయి. అలాంటప్పుడు రీఫండ్‌ కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. అంబుడ్స్‌మెన్‌ పద్ధతి ద్వారా వీటిని పరిష్కరించేందుకు నిర్ణయించింది.

దేశంలో డిజిటల్‌ లావాదేవీలు విస్తృతమయ్యాయి. అయితే ఈ వ్యవస్థపై వినియోగదారులకున్న విశ్వాసాన్ని మరింత పెంచేందుకు ఓ గ్రీవెన్స్‌ మెకానిజం అవసమ‌ని, అందువల్ల డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ కోసం అంబుడ్స్‌మెన్‌ స్కీంను అమలు చేయాలని నిర్ణయించిన‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా ఆర్‌బీఐ నియంత్రణ వ్యవస్థ కింద ఉన్న అన్ని సేవలను దీన్ని ద్వారా అందిస్తున్న‌ట్లు తెలిపింది

డిజిట‌ల్ లావాదేవీల జ‌రిపిన‌ప్పుడు త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌ను గురించి ఫిర్యాదు చేసేందుకు అంబుడ్స్‌మెన్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. విఫ‌లమైన లావాదేవీలు, వినియోగ‌దారుని ఖాతా నుంచి న‌గ‌దు డెబిట్ అయ్యి వ్యాపారి ఖాతాకు జ‌మకాక‌పోవ‌డం వంటి అన్ని ర‌కాల డిజిట‌ల్ స‌మ‌స్య‌లను అంబుడ్స్‌మెన్ స్కీం క‌వ‌ర్ చేస్తుంది. అన‌ధికారిక ఎల‌క్ట్రానిక్ లావాదేవీల‌ను కూడా ఈ స్కీం కింద క‌వ‌ర‌వుతాయి.

స‌ర్వీసు ప్రొవ‌డైర్లు డిజిట‌ల్ లావాదేవీల‌కు సంబంధించి వారి ఫీజులు, ఛార్జీలు వంటి వివ‌రాల‌ను ఖ‌చ్చితంగా వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చాల‌ని, అంబుడ్స్‌మెన్ స్కీం గురించిన వివ‌రాలను వెబ్‌సైట్ త‌ప్ప‌నిస‌రిగా ఉంచాల‌ని ఆర్‌బీఐ సూచ‌న‌లు చేసింది.

అంబుడ్స్‌మెన్‌కు ఏవిధంగా ఫిర్యాదు చేయాలి?

స‌ర్వీస్ ప్రొవ‌డైర్ మీరు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించ‌క‌పోయినా, వారి స‌మాధానం స‌రిగ్గా లేక‌పోయినా ఈ కింది విధంగా మీరు అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ముందు మీ పేరు, చిరునామా, స‌ర్వీస్ ప్రావైడ‌ర్, లావాదేవీల విలువ‌, మీరు కోరుకునే న‌ష్ట‌ప‌రిహారం వంటి వివ‌రాల‌తో అంబుడ్స్‌మెన్ ఫిర్యాదు చేయాలి. దానికి సంబంధించిన‌ ఆధారాలు కూడా జ‌త‌ప‌ర‌చాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ ఇప్ప‌టిదాకా బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌కి సంబంధించిన 21 కార్యాల‌యాల‌కు సంబంధించిన‌ చిరునామాల జాబితాను విడుద‌ల చేసింది. ఈ కార్యాల‌యాల‌లో మీ ఫిర్యాదుల‌ను ఫైల్ చేయ‌వ‌చ్చు. లేదా ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదును పంపవచ్చు.

మీరు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ముందుగా స‌ర్వీసు ప్రొవ‌డైర్‌ను పిలిచి ప‌ర‌స్ప‌ర ఒప్పందం(మ్యూచువ‌ల్ అగ్రిమెంట్) ద్వారా స‌మ‌స్య‌ను సానుకూలంగా ప‌రిష్క‌రించేందుకు అంబుడ్స్‌మెన్ కార్యాల‌యం వారు ప్ర‌య‌త్నిస్తారు. అయితే ఈ విధానంలో మీరు ఫిర్యాదు చేసిన రోజు నుంచి ఒక నెల లోపంగా వివాదం ప‌రిష్కారం కాక‌పోతే, నిర్ధిష్ట కేసుకు సంబంధించి కంప్లెట్ ఇచ్చిన వారి వాద‌న‌లు, అదేవిధంగా స‌ర్వీస్ ప్రొవ‌డ‌ర్ వాద‌న‌లు విన్న త‌రువాత ఒక అవార్డును పాస్ చేస్తారు

ఒక ఫిర్యాదు సంబంధించి న‌ష్ట‌ప‌రిహారం రూ. 20 ల‌క్ష‌ల‌కు మించితే అవార్డ్‌ను పాస్ చేసే అధికారం అంబుడ్స్‌మెన్‌కు లేదు. ఫిర్యాదు చేసిన వారు కోల్పోయిన విలువ కంటే ఎక్కువ న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌కూడ‌దు. అయితే కంప్లెంట్ ఇచ్చిన వారు న‌ష్ట‌పోయిన స‌మ‌యం, అయిన ఖ‌ర్చులు, మాన‌సిక‌ అందోళ‌న‌ వంటి వాటికి కోల్పోయిన దానికంటే రూ. 1 ల‌క్ష ఎక్కువ‌గా న‌ష్ట‌ప‌రిహారాన్ని ఇవ్వ‌వ‌చ్చు.

అంబుడ్స్‌మెన్ కార్యాల‌యం వారు అవార్డు కాపీని ఫిర్యాదు చేసిన వారికి, స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ఉభ‌యుల‌కు ఉచితంగా పంపిస్తారు. ఫిర్యాదు చేసిన వారు, సెటిల్‌మెంటును ఆమోదించిన‌ట్లు అవార్డు కాపీని పంపిన 30 రోజుల‌లో అంబుడ్స్‌మెన్‌కి తెలియ‌జేయాలి. 30 రోజుల లోపు తెలియ ప‌ర‌చ‌క‌పోతే అది ర‌ద్దువుతుంది. ఈ 30 రోజుల కాల‌వ్య‌వ‌ధిలో స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ కూడా పున‌ర్విచార‌ణ కోసం పై అధికారుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం కింద పై అధికారిగా ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌రిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly