కారు కొన‌కుండా.. ఆ డ‌బ్బు మ‌దుపు చేస్తే ఇంత జ‌మ‌వుతుందా?

కారు కొనుగోలు అనేది హోదా నుంచి అవ‌స‌రంగా మారిపోయిన రోజులివి. ఓలా, ఉబ‌ర్ లాంటి క్యాబ్ స‌ర్వీసులు చేరువ‌లో ఉండ‌గా.. కారు కొనుగోలు కై వెచ్చించే సొమ్మును మ‌దుపు చేస్తే కొన్నాళ్ల‌కు ఎంత నిధి జ‌మ‌వుతుందో తెలుసుకుందామా?

కారు కొన‌కుండా.. ఆ డ‌బ్బు మ‌దుపు చేస్తే ఇంత జ‌మ‌వుతుందా?

కొత్త కారు కొనుగోలు అనేది చాలా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిచ్చే విష‌యం. బ్రాండ్ లుక్‌నిచ్చే కారు సొంతం చేసుకొని ర‌య్యి ర‌య్యిన దూసుకెళ్లాల‌ని ఎవ‌రికుండ‌దు చెప్పండి. కుటుంబంతో క‌లిసి షాపింగ్‌కు వెళ్లాల‌న్నా… స్నేహితుల‌తో క‌లిసి జాయ్ ట్రిప్ కు వెళ్లాల‌న్నా లేదా భాగ‌స్వామితో క‌లిసి స‌ర‌దాగా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాల‌న్నా సొంత కారు అంటూ ఉంటే ఆ మ‌జాయే వేరు. కారు ఉంటే ఆ సౌల‌భ్యం, ఆ హోదాయే వేరు. సంపాద‌న మొద‌లుపెట్టిన త‌ర్వాత కొన్నాళ్ల‌కో లేదా కుటుంబంలో స‌భ్యుల సంఖ్య పెరుగుతుంటే కారు కొనుగోలు అవ‌స‌రంగా మారుతుంది.

భారీ ఆఫ‌ర్ల‌తో ఊరిస్తుంటాయి! పండుగల స‌మ‌యాల్లో షో రూముల్లో భారీ డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు వినియోగ‌దారుల‌ను ఊరిస్తుంటాయి. మొన్న‌మొన్న‌టి వ‌ర‌కు ద‌స‌రా, దీపావ‌ళి అంటూ వాహ‌న విక్ర‌యాలు జోరందుకున్నాయి. ఇక అప్పుడు కొన‌లేనివారు ఇప్పుడు కూడా ఏవైనా అలాంటి ఆఫ‌ర్లు ఉంటాయేమోన‌ని చూస్తుంటారు. వాహ‌న త‌యారీదారుల మ‌ధ్య పోటీ నెల‌కొన‌డంతో కొత్త కొత్త మోడ‌ళ్లు మార్కెట్లోనికి రంగ‌ప్ర‌వేశం చేస్తూనే ఉన్నాయి. వినియోగ‌దారుల అభిరుచి మేర‌కు వివిధ మోడ‌ళ్ల‌లో హై ఎండ్‌లో కార్ల డిజైనింగ్ చేప‌డుతున్నారు. ట్రాఫిక్, పార్కింగ్ స‌మ‌స్య‌లుంటాయి…రాజేశ్ ఎప్ప‌టినుంచో మంచి మోడ‌ల్ కారు ఒక‌టి కొనాల‌నుకుంటున్నాడు. అయితే అప్పుడ‌ప్పుడు న‌గ‌రంలోని ట్రాఫిక్ స‌మ‌స్య గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా కారు కొనుగోలు అంత అవ‌స‌ర‌మా అనే భావ‌న‌లో ఉండిపోతాడు. పార్కింగ్ స్థ‌లంలో కారు పెడితే దాన్ని తీయ‌డానికి గంట ప‌డుతుంటుంది. ఇక ట్రాఫిక్లో కారు చిక్కుకొని త‌న స్నేహితులు ప‌డిన‌ బాధ‌లు తాను విన్నాడు. న‌గ‌రంలో కారులో తిర‌గ‌డం వ‌ల్ల ఒక్కోసారి స‌మ‌యం బాగా వృథా అవుతుంది. దీనికి ప‌రిష్కార‌మే లేదా అని రాజేశ్ ఆలోచ‌న చేశాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా కారు కొనేందుకు, కొన్న త‌ర్వాత‌ ఎంత ఖ‌ర్చ‌వుతుంది అనే విష‌యాల‌ను లెక్క వేశాడు. కారు కొన‌కుండా ఆ డ‌బ్బును పెట్టుబ‌డిగా పెడితే ఎంత లాభ‌మో కూడా లెక్క వేశాడు. రాజేశ్ లాంటి ప‌రిస్థితే న‌గ‌రంలోని స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తిది. కారు కొనుగోలు ఎంత మేర‌కు లాభ‌దాయ‌కమో ఇప్పుడు చూద్దాం. ఓ సాధార‌ణ కొత్త కారు ధ‌ర ఆన్ రోడ్ కి వ‌చ్చేసరికి రూ.4.5ల‌క్ష‌లు అవుతుంద‌నుకుందాం. 5ఏళ్ల త‌ర్వాత త‌రుగుద‌ల విలువ‌ను తీసివేయ‌గా దాని అస‌లు విలువ రూ.1లక్ష‌కు ప‌డిపోతుంది. ఇక వాయిదాలోనే కారు కొన్నార‌నుకుందాం. సంవ‌త్స‌రానికి 10శాతం వ‌డ్డీతో 5ఏళ్ల దాకా నెల‌కు రూ.8వేల చొప్పున వాయిదా చెల్లిస్తూనే ఉండాలి. వాయిదాలు ఆలస్యం అయినా, కొన్ని నెలలు చేయకపోయినా క్రెడిట్ స్కోరు మీద తీవ్ర ప్రభావం పడవచ్చు. ఈ కింది ప‌ట్టిక గ‌మ‌నిస్తే కారు కోసం వెచ్చించే మొత్తం సొమ్ము రూ.8వేలు + రూ.5వేలు= రూ.13వేలు అవుతుంది.

CAR-EXPENSE.png

కారు న‌డిచే స‌మ‌యంతో పోలిస్తే ఎక్కువగా ఖాళీగానే ఉంటుంది. ఈ రూ.13వేల‌ను కారుపై వెచ్చించే కంటే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెడితే ఎలా ఉంటుందోన‌ని రాజేశ్ ఆలోచించాడు. రూ.7వేల‌ను సిప్ ద్వారా నెల నెలా 5ఏళ్ల పాటు పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్నాడు. మిగ‌తా రూ.6వేలు త‌న ప్ర‌యాణ ఖ‌ర్చుల‌కు, అద్దె కార్ల‌లో తిరిగేందుకు విన‌యోగించాల‌నుకున్నాడు. చాలా క్యాబ్ స‌ర్వీసులు ఇప్పుడు షేరింగ్ ఆప్ష‌న్‌ను ఇస్తున్నాయి. ఇత‌రుల‌తో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం వ‌ల్ల క్యాబ్‌లో ప్ర‌యాణించేందుకు అయ్యే ఖ‌ర్చు సగానికి సగం త‌గ్గిపోతుంది.

5ఏళ్ల త‌ర్వాత‌…అయిదేళ్ల చివ‌ర‌లో తను పెట్టిన పెట్టుబ‌డి విలువ ఎంత అవుతుందో లెక్క వేశాడు…
8శాతం రాబ‌డి అంచనాతో రూ.5.14లక్ష‌లు అవుతుంద‌ని లెక్క క‌ట్టాడు. 10శాతం రాబ‌డి అంచానాతో రూ.5.42ల‌క్ష‌లు చేతికొస్తుంది. 12శాతం రాబ‌డి అంచ‌నాతో రూ.5.72ల‌క్ష‌లు జ‌మ‌వుతుంది.

ఇలా కారు కొనకుండా అదే డ‌బ్బును పెట్టుబ‌డిగా పెడితే ఎంత లాభ‌మో చూశారు క‌దా! పైగా మిగిలిన రూ.6వేల‌తో ప్ర‌యాణ ఖ‌ర్చుల‌కు స‌రిపోయాయి.

గ‌మ‌నికః
పైన తెలిపిన ఉదాహ‌ర‌ణ కేవ‌లం అవ‌గాహ‌న‌కు మాత్ర‌మే. పాఠ‌కులు త‌మ అభిరుచితో పాటు అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని కారు కొనుగోలు చేయ‌డ‌మా లేదా వాయిదా వేయ‌డ‌మా అనే విష‌యాన్ని స్వ‌యంగా నిర్ణ‌యించుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly