పీ-నోట్ల నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం

మార్కెట్ల‌లోకి న‌ల్ల‌ధ‌నం ప్ర‌వేశించ‌కుండా అడ్డుకునేందుకు సెబీ పీ-నోట్ల నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది.

పీ-నోట్ల నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం

దేశీయ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు పార్టిసీపేటరీ నోట్ల (పీ-నోట్లు) కంటే విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు సెబీ ఎక్కువ‌గా ప్రాధాన్య‌త‌నిస్తుంది. పీ-నోట్ల ద్వారా మార్కెట్ల‌లోకి న‌ల్ల‌ధ‌నం వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున దాన్ని అడ్డుకునేందుకు పీ-నోట్ల నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేయాల‌ని నిర్ణ‌యించింది. మ‌రోవైపు విదేశీ పెట్టుబ‌డుదారులు స్టాక్ మార్కెట్ల‌లో నేరుగా పెట్టుబ‌డులు పెట్టేందుకు నిబంధ‌న‌ల‌ను సుల‌భ‌త‌రం చేయ‌నుంది.

కొత్త‌గా దేశీయ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారికి పీ-నోట్లు ఉప‌యోగ‌క‌ర‌మే అని సెబీ చైర్మెన్ అజ‌య్ త్యాగి అన్నారు. విదేశీ మ‌దుప‌ర్లు మార్కెట్‌పై అవ‌గాహ‌న కొర‌కు పీ-నోట్లను ఉప‌యోగిస్తున్నందున, వీటిపై పూర్తిగా నిషేధం విధించబోమ‌ని ఆయ‌న‌ వెల్లడించారు. అయితే పీ-నోట్లపై నియంత్ర‌ణ చార్జీల‌ను విధిస్తే వినియోగం త‌గ్గుతుంద‌ని సెబీ బోర్డు నిర్ణ‌యించింద‌ని పేర్కొన్నారు.

సెబీ గ‌తంలో ప్రారంభించిన చ‌ర్య‌ల‌తో పీ-నోట్ల పెట్టుబ‌డులు నాలుగు నెల‌ల క‌నిష్టానికి త‌గ్గి రూ.1.68 ల‌క్ష‌ల కోట్లుగా న‌మోద‌య్యాయి. అదేవిధంగా బ్యాంకుల నిర‌ర్థ‌క ఆస్తుల ప‌రిష్కారానికి రిజ‌ర్వు బ్యాంకు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు సెబీ స‌హ‌కారం అందిస్తుంద‌ని వివ‌రించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly