ఈ లావాదేవీల‌కు పాన్ కార్డ్ త‌ప్ప‌నిస‌రి

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి మాత్రమే కాదు, అనేక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు తప్పనిసరి

ఈ లావాదేవీల‌కు పాన్ కార్డ్ త‌ప్ప‌నిస‌రి

యుటిఐ లేదా ఎన్‌ఎస్‌డిఎల్ ద్వారా ఆదాయపు పన్ను విభాగం పాన్‌ జారీ చేస్తుంది. మీరు మీ చిరునామాను మార్చినప్పటికీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు జీవితకాలానికి చెల్లుతుంది. పన్ను ఎగవేత, నల్లధనాన్ని నియంత్రించేందుకు, అనేక ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డ్ నంబర్‌ను కోట్ చేయడం ప‌న్ను చెల్లింపుదారుల‌కు తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు పాన్ కార్డును కలిగి ఉండకపోతే, ఫారం 60 డిక్లరేషన్‌పై సంతకం చేసి ఇవ్వొచ్చు.

ఈ సంద‌ర్భాల్లో పాన్ త‌ప్ప‌నిస‌రి…

 1. వాహ‌నం అమ్మ‌కం లేదా కొనుగోలు స‌మ‌యంలో
 2. బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు
 3. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు
 4. డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు
 5. రూ.50 వేల కంటే ఎక్కువ న‌గ‌దు రూపంలో ఒకేసారి చెల్లించేందుకు
 6. రూ. 50,000 కంటే ఎక్కువ‌ విదేశీ ప్రయాణానికి సంబంధించి లేదా ఏ సమయంలోనైనా విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడానికి
 7. మ్యూచువ‌ల్ ఫండ్లు, డిబెంచ‌ర్లు, బాండ్లు వంటివి రూ.50 వేల కంటే ఎక్కువ‌తో కొనుగోలు చేసిన‌ప్పుడు
 8. బ్యాంకులో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన‌ప్పుడు
 9. బ్యాంక్ ఓవ‌ర్‌డ్రాఫ్ట్, బ్యాంకింగ్ కంపెనీ లేదా సహకార బ్యాంకు నుంచి ఆర్డర్లు లేదా బ్యాంకర్ చెక్కులను కొనుగోలు చేయడానికి ఒక్క రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపు చేసిన‌ప్పుడు
 10. ఒకేసారి రూ.50 వేల కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన‌ప్పుడు లేదా ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన‌ప్పుడు
 11. ప్రీ-పెయిడ్ పేమెంట్స్‌కి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.50 వేల‌కు మించి చెల్లించిన‌ప్పుడు
 12. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.50 వేల‌కు మించి బీమా ప్రీమియం చెల్లించిన‌ప్పుడు
 13. షేర్లు కాకుండా సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మ‌కానికి లావాదేవీలు ల‌క్ష రూపాయ‌లు మించితే
 14. స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లేని కంపెనీ షేర్ల‌ను కొనుగోలు చేసేందుకు ల‌క్ష రూపాయ‌ల‌కు మించి లావాదేవీలు చేస్తే
 15. రూ.10 ల‌క్ష‌ల‌కు మించి స్థిరాస్తిని కొనుగోలు లేదా అమ్మ‌కం చేసిన‌ప్పుడు లేదా స్టాంప్ వాల్యుయేష‌న్ అథారిటీ సెక్ష‌న్ 50సీ ప్ర‌కారం రూ.10 ల‌క్ష‌ల‌కు మించిన లావాదేవీల‌ను
 16. వ‌స్తువులు లేదా సేవ‌లను రూ.2 ల‌క్ష‌ల‌కు మించి కొనుగోళ్లు లేదా అమ్మ‌కాలు జ‌రిపితే

పాన్ లేక‌పోయినా…

 1. మీకు పాన్ లేకపోతే, ఫారం 60 లో డిక్లరేషన్‌పై సంతకం చేసిన తరువాత పైన పేర్కొన్న ఏదైనా లావాదేవీలను నిర్వహించడానికి ఆదాయపు పన్ను శాఖ నియమాలు మిమ్మల్ని అనుమతిస్తాయి, ఇది మీరు పాన్ కార్డును కలిగి లేర‌ని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువగా ఉందని తెలుపుతుంది
  2.మైనర్లకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పాన్ కార్డు సంఖ్యను తెలిపేందుకు అనుమతి ఉంది.
 2. కొన్ని సంద‌ర్భాల్లో ఎన్ఆర్ఐల‌కు పాన్ మిన‌హాయింపు ఉంటుంది
 3. 114బీ రూల్ ప్ర‌కారం, కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ర్ట ప్ర‌భుత్వం, కాన్సులార్ కార్యాల‌యాలు పాన్ నంబ‌ర్ పేర్కొనాల్సిన అవ‌స‌రం లేదు

పాన్‌కు బ‌దులుగా ఆధార్‌
పాన్ లేనివారికి ఆదాయ ప‌న్ను శాఖ ఆధార్‌తో ప్ర‌త్యామ్న‌యాన్ని చూపింది. పాన్ అవ‌స‌ర‌మైన చోట ఆధార్ నంబ‌ర్ ఇవ్వొచ్చు. సెప్టెంబ‌ర్ 1 నుంచి ఆదాయ ప‌న్ను శాఖ‌, ప‌న్ను రిట‌ర్నుల‌కు పాన్ లేక‌పోతే ఆధార్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని తెలిపింది. పైన తెలిపిన లావాదేవీల‌న్నింటికి కూడా పాన్ లేక‌పోతే ఆధార్ ఉంటే స‌రిపోతుంది. అయితే పాన్-ఆధార్ అనుసంధానం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly