ఉచిత విద్యుత్‌.... పేద‌ల 'సౌభాగ్యం'

ప్ర‌ధాన‌మంత్రి స‌హ‌జ్ బిజిలీ హ‌ర్ ఘ‌ర్ యోజ‌న‌(సౌభాగ్య) గురించి వివ‌రాలు

ఉచిత విద్యుత్‌.... పేద‌ల 'సౌభాగ్యం'

ప్ర‌ధాన‌మంత్రి స‌హ‌జ్ బిజిలీ హ‌ర్ ఘ‌ర్ యోజ‌న‌(సౌభాగ్య) ప‌థ‌కాన్ని రూ.16,320కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్రారంభించారు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు క‌లిపి 4కోట్ల కుటుంబాల‌కు విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను డిసెంబ‌రు 2018 లోగా ఇవ్వాల‌నే సంక‌ల్పంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అంద‌రికీ విద్యుత్ అనే దృఢ‌నిశ్చ‌యంతో మోదీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది.

ప‌థ‌కం ఉద్దేశ‌మేంటి?

ప్ర‌తి ఇల్లు విద్యుత్ వెలుగుల‌తో విలసిల్లాల‌నే ఉద్దేశంతోనే ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చారు. డిసెంబ‌ర్ 2018 నాటికి ల‌క్ష్యాన్ని చేరుకునేలా ప్ర‌ణాళిక ర‌చించారు.

కొత్త‌గా ఈ ప‌థ‌కం ఎందుకు?

జులై 2015లో ప్రారంభించిన దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన గ్రామీణ విద్యుద్దీక‌ర‌ణ కార్య‌క్ర‌మం విస్తృత స్థాయిలో చేస్తున్నా…18వేల గ్రామాల్లో కేవ‌లం 78శాత‌మే పూర్తిగా విద్యుద్దీక‌ర‌ణ చేశారు.

దీన్ ద‌యాళ్ ప‌థ‌కంలో భాగంగా కేవ‌లం 10శాతం గృహాల‌కు విద్యుత్ వ‌స‌తి క‌ల్పిస్తే ఆ గ్రామాన్ని విద్యుద్దీక‌ర‌ణ చెందిన‌ట్టుగా ప్ర‌క‌టిస్తారు. ఇందులో ప్ర‌భుత్వ స్థ‌లాలైన పాఠ‌శాల‌లు, పంచాయ‌తీ కార్యాల‌యాలు, ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్స‌రీలు, క‌మ్యూనిటీ సెంట‌ర్లు వ‌చ్చేవి. చాలా గృహాలకు విద్యుత్ అందుబాటులోనికి రాక‌పోవ‌డంతో ప‌థ‌కం అస‌లు ఉద్దేశం నీరుగారిపోయింది.

డిస్కంల విముఖ‌త

గ్రామాల‌కు విద్యుద్దీక‌ర‌ణ అందుబాటులోనికి వ‌చ్చినా స‌రే గృహాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసేందుకు డిస్కంలు సుముఖ‌త చూపేవి కావు. అంద‌రికీ విద్యుత్ వస‌తి ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ప్రీపెయిడ్ మీట‌ర్లు, స్మార్ట్ మీట‌ర్లు ఏర్పాటు చేయాల్సి వ‌చ్చేది. విద్యుత్ పంపిణీకి కూడా డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దీంతో ఎక్కువ విద్యుత్ గ్రామీణ ప్రాంతాల‌కు వెచ్చించాల్సి వ‌చ్చేది.

నెల‌కు రూ.50ల‌తో…

సాంఘిక ఆర్థిక కుల జనాభా లెక్క(ఎస్‌ఈసీసీ-2011)ల్లో పేర్కొన్న విద్యుత్తు సౌకర్యం లేని కుటుంబాలను గుర్తిస్తారు. ఈ లెక్కల్లో లేని కుటుంబాలకు విద్యుత్తుసౌకర్యం లేకుంటే వాటికి ఈపథకాన్ని వర్తింపజేస్తారు. ఆ కుటుంబాలు రూ.500ను 10 వాయిదాల్లో కేవ‌లం నెల‌కు రూ.50 ల‌తో డిస్కంలకు బిల్లులతో పాటు చెల్లించాలి.

ఇత‌ర ప్ర‌యోజ‌నాలు

అమెరికా, చైనాల త‌ర్వాత భార‌త్ ప్ర‌పంచ మూడో ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతోంది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణలోనూ ఇది స‌హ‌క‌రిస్తుంది. విద్యుత్ సౌక‌ర్యం లేనివారు ప్ర‌త్యామ్నాయంగా కిరోసిన్ వాడుతున్నారు. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణంలో కాలుష్యం పెరిగిపోతుంది. ఇళ్ల‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉంటే విద్య‌, ఆరోగ్యం మెరుగుప‌డతాయి. క‌నెక్టివిటీ కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధిత ప‌నులు కూడా క్రియాశీల‌కంగా మారి ఉద్యోగాల సృష్టి జ‌రుగుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly