విహార యాత్రలకోసం పీపీఎఫ్ ఖాతా తెరుద్దామా?

ఈ డబ్బు ఏర్పాటుకు ముందు ఖర్చులను అంచనా వేయాలి. రవాణా చార్జీలు, ఉండటానికి వసతి , భోజనానికి, అక్క‌డ ప్ర‌త్యేక ప్ర‌దేశాల‌ను చూడ‌టానికి ఎంత‌వుతుందో లెక్కించుకోవాలి

విహార యాత్రలకోసం పీపీఎఫ్ ఖాతా తెరుద్దామా?

సెలవులకు దగ్గర బంధువులైన అమ్మమ్మ, పిన్ని, మామయ్య, బాబాయ్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాళ్ళం. సంక్రాతి, వేసవి , దసరా సెలవులు 10-15 రోజులు పైన ఉంటాయి కాబట్టి, కుటుంబంతో సహా హాయిగా గడిపే వాళ్ళం. పెద్ద కుటుంబాల వలన ప్రతి ఇంట్లో 5-6 సభ్యులు ఉండటం వలన చాలా కోలాహలంగా ఉంటుంది. మధ్యలో పండగలకు చేసే పిండి వంటలు, ఆటపాటలు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎన్నో మధుర స్మృతులు. ఇవి రాబోయే రోజులకు మంచి టానిక్ లా పని చేస్తాయి.

కానీ మారుతున్న జీవన విధానంలో కుటుంబంలోని సభ్యుల సంఖ్య తగ్గడం , రాకపోకలు కూడా తగ్గడం, ఉన్న సమయం పని ఒత్తిడితో వివిధ ప్రదేశాలలో , వివిధ సమయాలలో పనిచేయాల్సి రావడం వంటి కారణాల వలన అన్ని కుటుంబాలు ఓకేసారి కలవడం కష్టమైపోతోంది. అదీగాక, చాలా విషయాలు ముందే తెలిసిపోవడం వలన ప్రత్యేకించి కలిసి మాట్లడుకోవడానికి ఏమి ఉండటంలేదు. ఏదైనా శుభకార్యాలప్పుడు కలిసి మాట్లాడుకోవడంతో సరిపోతోంది.
అయితే పని వత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మరొక మార్గం - విహార యాత్రలు.

విహార యాత్రలకు ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. హాయిగా కుటుంబ సభ్యులతో కొన్ని రోజులు పాటు కొత్త ప్రదేశాలను చూసి , అక్కడి వంటలను రుచి చూడడంలో ఎంతో ఆనందం ఉంటుంది. పని ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆ మధుర జ్ఞాపకాలను నెమరువేస్తూ, బంధుమిత్రులకు చెప్పడం అదొక ఆనందం. అక్కడ కొన్న వస్తువులను కొన్ని సంవత్సరాలపాటు దాచి ఉంచుకోవటం , వచ్చినవారికి వాటి విశేషాలను చెప్పడం అదొక ఆనందం.

ఇటువంటి సందర్భాలలో ఖర్చులు అదుపు తప్పుతాయి. ఎంత బడ్జెట్ వేసుకున్నా, తీరా అక్కడి అవసరాలు , కోరికలు ఖర్చుకు వెనకాడనీవు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అటువంటి అవకాశం రాకపోవచ్చు. అటువంటి సందర్భం కూడా కలగక పోవచ్చు. ఒక్కక్కసారి విమానయాన కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు ఎంతో ఊరిస్తుంటాయి. వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది.

అయితే , ఇన్ని సాధించాలంటే కావలసినది డబ్బు. ఒక పధ్ధతి ప్రకారం మదుపు చేస్తే ఈ కోరికలను తీర్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఒక ప్రదేశాన్ని ఎంచుకుని , ఒక పధకం ప్రకారం వెళ్ళినట్లైతే చక్కని అనుభూతిని పొందవచ్చు. ఈ డబ్బు ఏర్పాటుకు ముందు ఖర్చులను అంచనా వేయాలి. రవాణా చార్జీలు, ఉండటానికి వసతి , భోజనానికి, లోకల్ గా తిరగటానికి ఎంత‌వుతుందో లెక్కించుకోవాలి.

ప్రతి సంవత్సరం కోసం ముందునుంచే నెలనెలా మదుపు చేయాలి. రెండు నుంచి మూడు ఏళ్ల లోపు వెళ్లాలనుకొన్నప్పుడు రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఎంచుకోవచ్చు. అయితే దీనిని వేరే స్వల్పకాలిక లక్ష్యాలకు వినియోగించే అవకాశం ఉంది. ఒకవేళ ఐదు సంవత్సరాల తరువాత ప్రతి సంవత్సరం వెళ్లదలచుకుంటే పీపీఎఫ్ ఖాతాను ఎంచుకోవచ్చు. ఎందుకంటే, పీపీఎఫ్ ఖాతా తెరిచిన ఏడవ సంవత్సరం నుండి 50 శాతం వరకు సొమ్ము తీసుకునే అవకాశం ఉంది కనుక, దాని ప్రకారం విహార యాత్రలకు పధకం వేసుకోవచ్చు.
ఈ కింది పట్టిక ద్వారా ఎప్పుడు ఎంత మొత్తం వాడుకోవచ్చో చూద్దాం .

ppf.jpg
ముగింపు:
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు జమ చేసే మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి ఈ మొత్తాన్ని పెంచుతుందని అంచనా వేయడమైనది. ఏడవ ఆర్ధిక సంవత్సరం నుంచి అర్హత గల 50 శాతం సొమ్మును ఖాతా నుంచి ఎంత ఉపసంహరించుకువచ్చో చూపడమైనది. అవసరం మేరకు మాత్రమే సొమ్మును విహారయాత్రలకు వినియోగించుకోవచ్చు. మిగిలిన సొమ్ము ఖాతాలో ఉంచితే వడ్డీ లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో సొమ్ము జమ చేసేప్పుడు, జమ అయ్యే వడ్డీపై, ఉపసంహరణలపై పన్ను మినహాయింపులు ఉంటాయి .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly