పింఛ‌నుదారుల‌కు శుభ‌వార్త‌, ప్రామాణిక త‌గ్గింపు వారికీ వ‌ర్తిస్తుంది

పింఛ‌నుదారులకూ ప్రామాణిక త‌గ్గింపు వ‌ర్తించేలా సీబీడీటీ నేడు స్ప‌ష్ట‌మైన ఉత్త‌ర్వులు ఇచ్చింది

పింఛ‌నుదారుల‌కు శుభ‌వార్త‌, ప్రామాణిక త‌గ్గింపు వారికీ వ‌ర్తిస్తుంది

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి వేత‌న జీవుల‌కు ర‌వాణా, వైద్య ఖ‌ర్చుల‌ మిన‌హాయింపుల‌కు బ‌దులుగా రూ.40 వేల వ‌ర‌కు ప్రామాణిక త‌గ్గింపు(స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌) అమ‌లు కానున్న విష‌యం తెలిసిందే. అయితే పింఛ‌న్‌దారుల‌కు కూడా ఈ మిన‌హాయింపులు క్లెయిం చేసుకోవ‌చ్చ‌న్న విష‌యం కొంత మందికి తెలియ‌దు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(సీబీడీటీ) స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ప‌న్ను చెల్లిస్తున్న పింఛ‌నుదారులు తాము పింఛ‌ను అందుకుంటున్న యాజామాన్యం నుంచి రూ.40 వేలు లేదా అందుకుంటున్న పింఛ‌ను ఏది త‌క్కువైతే దానిని క్లెయిం చేసుకోవ‌చ్చు. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్‌-16 ప్ర‌కారం ఈ మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చ‌ని సీబీడీటీ తెలిపింది. వేత‌నం రూపంలో ఆదాయం ఆర్జించే ప‌న్ను చెల్లింపుదారులు రూ.40 వేల ప్రామాణిక త‌గ్గింపు పొందేలా ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్‌-16 కి ఈ ఏడాది స‌వ‌ర‌ణ‌లు చేశారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం వారు రూ.40 వేలు లేదా వారు అందుకునే వేత‌న మొత్తం ఏది త‌క్కువైతే దానిని క్లెయిం చేసుకోవ‌చ్చు. అలాగే ప‌న్ను చెల్లిస్తున్న పింఛ‌నుదారులు సైతం రూ.40 వేలు లేదా పింఛ‌ను మొత్తం ఏది త‌క్కువైతే దానిని క్లెయిం చేసుకోవ‌చ్చు.

పింఛ‌నుదారుల కుటుంబ స‌భ్యులు కూడా ఈ త‌గ్గింపును పొందవ‌చ్చా?

నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం ప‌న్ను చెల్లిస్తున్న పింఛ‌నుదారులు ఎవ‌రైతే ఈ ప్రామాణిక త‌గ్గింపును పొందుతున్నారో, వారి త‌ద‌నంత‌రం వారి చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సులు కూడా పింఛ‌ను పొందిన‌ట్ల‌యితే ఈ మిన‌హాయింపుల‌కు వారు అన‌ర్హులు.

ఉద్యోగుల‌కు ఊర‌ట క‌లిగించేందుకు ర‌వాణా, వైద్య ఖ‌ర్చుల మిన‌హాయింపుల‌కు బ‌దులు రూ.40 వేల స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు 2018-19 బ‌డ్జెట్లో కేంద్రం ప్ర‌తిపాదించింది. ఈ కొత్త నిబంధ‌న‌లు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. అంతకుముందు పింఛ‌నుదారులు ఈ మిన‌హాయింపులు పొంద‌డానికి అవ‌కాశం లేకుండేది. అయితే చ‌ట్ట స‌వ‌ర‌ణ ద్వారా వారు కూడా ఈ ప్రయోజ‌నాల‌ను పొందే అవ‌కాశం ల‌భించింది.

ఒక వేళ ఉద్యోగి మ‌ర‌ణిస్తే, త‌ద‌నంతరం అత‌ని పై ఆధార‌ప‌డ్డ కుటుంబ స‌భ్యులు పింఛ‌ను పొందుతున్న సంద‌ర్భాల‌లో ఆ ఆదాయాన్ని ఇత‌ర వ‌న‌రుల ద్వారా వ‌చ్చిన ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 57(iia) ప్ర‌కారం రూ.15 వేలు లేదా అందుకుంటున్న పింఛ‌నులో మూడో వంతు మొత్తం ఏది త‌క్కువైతే ఆ సొమ్ముకు మిన‌హాయింపులు ల‌భిస్తాయి. పింఛ‌ను అందుకుంటున్న వారిలో జీవిత భాగ‌స్వామి, 25 ఏళ్ల లోపు వ‌య‌సు గ‌ల పిల్లలు, త‌ల్లిదండ్రుల‌పై ఆధార ప‌డ్డ కుటుంబ స‌భ్యులుగా ప‌రిగణిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక కుటుంబం రూ.50 వేల పింఛ‌ను పొందుతుంటే అందులో మూడో వంతు మొత్తం రూ.16,667 లేదా రూ.15 వేలు ఏది త‌క్కువైతే దానికి మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంది. అంటే రూ.50,000 లో నుంచి రూ.15,000 తీసి వేయ‌గా వ‌చ్చే రూ.35,000 ల‌కు మాత్రం ప‌న్ను ప‌డుతుంది. అయితే ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 57(iia) కి ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ‌లు చేయ‌లేదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly