పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌

సురక్షితమైన పెట్టుబడి, నెల నెలా స్థిర రాబడి ఇచ్చే పోస్ట్ ఆఫీస్ పధకం.

పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌

పెట్టుబడిపై కచ్చితమైన రాబడి, సురక్షితమైన పెట్టుబడి మార్గంతో నెలనెలా ఆదాయం కోరుకునేవారు ఈ పథకం అనుకూలమైనది. విశ్రాంత ఉద్యోగులకు, సీనియర్‌ సిటిజన్స్‌కు సరిపోయే పథకం ఇది.

కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు:

 • క‌నీసం రూ.1500 పెట్టుబ‌డితో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌వ‌చ్చు.
 • ఏకవ్యక్తి ఖాతా (సింగిల్‌ అకౌంట్‌) అయితే గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకూ… ఉమ్మడి ఖాతా (జాయింట్‌ అకౌంట్‌) అయితే గరిష్ఠంగా రూ.9 లక్షల వరకూ పెట్టుబ‌డి పెట్టేందుకు అనుమ‌తిస్తారు.

రాబడి:

ప్రస్తుతం 7.3 శాతం వార్షిక వడ్డీ వర్తింపుతో నెలనెలా ఖాతాలో జ‌మ‌చేస్తారు.

కాలపరిమితి:

ఈ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం కాల‌ప‌రిమితి 5ఏళ్లు.

నామినేషన్‌:

 • ఖాతా ప్రారంభ సమయంలో లేదా తర్వాత ఎప్పుడైనా నామినీని ప్రతిపాదించవచ్చు.
 • నామినీగా ఎవరినైనా ఎప్పుడైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది.

ఖాతా ప్రారంభించే పద్ధతి:

 • పూర్తి వివరాలతో నింపిన ఎంఐఎస్‌ ఫారంతో పాటు సంబంధిత చిరునామా, గుర్తింపు పత్రాలు, రెండు ఫొటోలు ఏదైనా పోస్టాఫీస్‌లో సమర్పించాలి.
 • ఖాతాను నగదు/చెక్కు ద్వారా చెల్లించి ప్రారంభించవచ్చు.
 • ముందే ఖాతా కలిగిన వ్యక్తి పరిచయ సంతకం అవ‌స‌ర‌మ‌వుతుంది.
 • ఓ ఖాతాదారు ఎన్ని ఎంఐఎస్‌ ఖాతాలైన తెరిచే అవకాశం ఉంది. అయితే అన్ని ఖాతాల మొత్తం రూ.4.5లక్షలకు మించరాదు.
 • నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం ఖాతాకు పాస్‌బుక్‌ అందజేస్తారు.

ఖాతా బదిలీ:

 • ఓ పోస్టాఫీసు నుంచి మ‌రో పోస్టాఫీసుకు ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.

గడువుకు ముందే ఖాతా మూసివేయడం:

 • డిపాజిట్‌ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
 • ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్‌ మొత్తం సొమ్ము నుంచి 2శాతం కోత విధిస్తారు.
 • మూడేళ్లు నిండి ఐదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్‌పై 1శాతం కోత విధిస్తారు.

వడ్డీ వివరాలు:

 • పెట్టుబడి పెట్టిన రోజు నుంచి ఖాతాదారుకు నెలనెలా వడ్డీ వస్తుంది.
 • ఈ వడ్డీ పోస్టాఫీసు నుంచి నేరుగా తీసుకోవచ్చు లేదా మన పొదుపు ఖాతాలో లేదా బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకోవ‌చ్చు.
 • వడ్డీ సొమ్ము విత్‌డ్రా చేసుకోకపోతే దానిపై అదనంగా వడ్డీ జమ అవ్వదు.

మెచ్యూరిటీ:

 • మెచ్యూరిటీ తేదీన అంటే అయిదేళ్ల కాలపరిమితి ముగిశాక ఖాతాదారుకు మొత్తం సొమ్మును తిరిగి చెల్లిస్తారు.
 • ఇందుకు పూర్తి వివరాలతో నింపిన ఫారంతోపాటు ఎంఐఎస్‌ పాస్‌బుక్‌ను పోస్టాఫీస్‌లో సమర్పించాలి.

పన్ను వివరాలు:

 • ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి లేదా దానిపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయానికి ఎలాంటి పన్ను మినహాయంపులు ఉండ‌వు.

ఇతర విషయాలు:

 • ఎంఐఎస్‌ల ద్వారా మంచి లాభాలను పొందాలనుకునేవారు … ఖాతాను ఓ ఆర్‌డీకి జతచేసుకుంటే శ్రేష్ఠం.
 • ఎంఐఎస్‌ ద్వారా వచ్చే ఆదాయం ఆర్‌డీలో మళ్లిస్తే మరింత రాబడి తీసుకువస్తుంది.
 • ఎంఐఎస్‌ పథకం నెలవారీ అవసరాల కోసం పెద్దలకు(సీనియర్‌ సిటిజన్స్‌), విశ్రాంత ఉద్యోగులకు చాలా సురక్షితమైన, సులభమైన పెట్టుబడి మార్గాల్లో ఒకటి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly