పోస్టాఫీస్‌ పొదుపు ఖాతా

బ్యాంకు సేవలు విస్తరించని గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సైతం పొదుపు మార్గంగా ఉండేది పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా.

పోస్టాఫీస్‌ పొదుపు ఖాతా

పోస్టాఫీస్‌ పొదుపు ఖాతా బ్యాంకు పొదుపు ఖాతా మాదిరే ఉంటుంది. అత్యంత సురక్షితమైన ఈ ఖాతా నుంచి మనకవసరమైనప్పుడు నగదును పాక్షికంగా లేదా పూర్తిగా తీసుకునే వీలుంది. బ్యాంకు సేవలు విస్తరించని గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ పోస్టాఫీసు పొదుపు ఖాతాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అర్హత:

 • స్థానికంగా నివసించే భారతీయులు మాత్ర‌మే ఈ ఖాతా తెరిచేందుకు వీలుంటుంది.
 • ఒక‌రి పేరు మీద లేదా ఉమ్మ‌డిగానూ పొదుపు ఖాతాను పొందవచ్చు.
 • పదేళ్లు పై బడిన మైన‌ర్ల‌యితే సంరక్షకుని సమక్షంలో ఖాతా తెరవవచ్చు.

కనిష్ఠ− గరిష్ట పరిమితి:

 • చెక్కు స‌దుపాయం లేని ఖాతాకు క‌నీసం రూ.50 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
 • చెక్కుతో కూడుకొన్న పొదుపు ఖాతాకు క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
 • ఖాతాలో గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది.

రాబడి:

పెట్టుబడి పై 4 శాతం వార్షిక వ‌డ్డీ అందుతుంది.
ఏటా ఏప్రిల్‌ 1న వడ్డీ మొత్తం పొదుపు ఖాతాకు జమ అవుతుంది.

నామినీ సదుపాయం:

పొదుపు ఖాతా తెరిచే సమయంలో లేదా ఎప్పుడైనా నామినీని పేర్కోవచ్చు.

పొదుపు ఖాతా తెరిచే విధానం:

 • ఏదైనా పోస్టాఫీసులో పొదుపు ఖాతా తెరవవచ్చు.
 • పూర్తి వివరాలతో నింపిన పొదుపు ఖాతా ఫారంతో పాటు గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, రెండు ఫొటోలు జతచేయాలి.
 • నేరుగా న‌గ‌దు రూపంలో లేదా చెక్కు ద్వారా ఖాతాలో సొమ్ము జ‌మ‌చేయ‌వ‌చ్చు
 • కొత్త ఖాతాదారుడిని పరిచయం చేస్తూ ముందే పొదుపు ఖాతా కలిగి ఉన్న ఖాతాదారుడి సంతకం అవ‌స‌ర‌మ‌వుతుంది.
 • ఓ పోస్టాఫీసు నుంచి ఒక ఖాతా మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉంటుంది.

డిపాజిట్లు− విత్‌డ్రాయల్స్‌ :

 • ఖాతా నుంచి ఓ రోజుకు ఒక‌సారికి మాత్ర‌మే నగదు తీసుకునే అవకాశం ఉంటుంది.
 • చెక్కు ద్వారా నగదు డిపాజిట్‌ చేసినట్టయితే చెక్‌ ఎన్‌క్యాష్‌ అయిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు.
 • క‌నీస మొత్తం న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ రూ. 5(చెక్కు స‌దుపాయంలేని ఖాతాకు), లేదా రూ.20(చెక్కుతో కూడిన ఖాతా) చేయాల్సి ఉంటుంది.
 • పొదుపు ఖాతా నుంచి మొత్తం సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం లేదు. చెక్కు లేని ఖాతాకైతే కనీసం రూ.50, చెక్కుతో కూడిన ఖాతాకు కనీసం రూ.500 నిల్వ ఉంచాల‌నే నిబంధ‌న ఉంది.

ఏటీఎమ్‌ :

పోస్టాఫీసు పొదుపు ఖాతాదారుల‌కి కొత్త‌గా ఏటీఎమ్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు.
ఖాతా ఉన్న‌చోట సూచించిన విధంగా ద‌ర‌ఖాస్తు ఫారాన్ని స‌మ‌ర్పించి ఏటీఎమ్‌ను పొంద‌వ‌చ్చు.
ప్రస్తుతం ఏటీఎమ్ ద్వారా న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్‌, న‌గ‌దు విచార‌ణ‌, మినీ స్టేట్‌మెంట్‌, ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్, పిన్ మార్చుకోవ‌డం వంటి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.
ఒక‌రోజులో గ‌రిష్టంగా రూ. 25,000 వ‌ర‌కూ, ఒక్కసారి గ‌రిష్టంగా రూ. 10,000 వ‌ర‌కూ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

పొదుపు ఖాతా బదిలీ:

ఖాతాదారుడు తన పొదుపు ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరోదానికి ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునే వీలుంది. ఇందుకోసం పొదుపు ఖాతా బదిలీ దరఖాస్తు ఫారం స‌మ‌ర్పించాలి.

మరొకరి పేరు మీద బదిలీ:

 • ఒకరి పేరుపైనే ఉన్న ఖాతాను ఉమ్మడి ఖాతాగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.
 • ఇద్దరు వ్యక్తుల పేర్లపై ఉన్న ఉమ్మడి ఖాతాను ఒకే వ్యక్తికి బదిలీచేయవచ్చు.
 • ముగ్గురు వ్యక్తులతో ఉన్న ఉమ్మడి ఖాతాను ఇద్దరు వ్యక్తుల ఉమ్మడి ఖాతాగానూ మార్చుకోవచ్చు.

ఖాతాదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే :

అనుకోకుండా ఏదైనా జరిగి ఖాతాదారు చనిపోతే ఆ వ్య‌క్తి ఖాతాలోని సొమ్మును నామినీలకు లేదా వారసులకు అందజేస్తారు.

నగదు ఉపసంహరణకు కావల్సిన పత్రాలు

 • పొదుపు ఖాతా పాస్‌బుక్‌
 • ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం

నామినీని పేర్కొన‌ని పక్షంలో :

నామినీని పేర్కొన‌ని ప‌క్షంలో ఖాతాదారుడి ఖాతా నుంచి సొమ్మును ల‌బ్ధిదారులు ఉప‌సంహ‌రించుకోవాలంటే కావ‌ల‌సిన ప‌త్రాలు

 • చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సులుగా ధ్రువీక‌రించే వార‌స‌త్వ ప‌త్రం
 • అందుబాటులో ఉంటే ఖాతాదారుడు రాసిన వీలునామా ప‌త్రం
 • పొదుపు ఖాతాను ఎవ‌రి పేరిట బ‌ద‌లాయించాలో పేర్కొంటూ ఇద్దరు వ్య‌క్తులు సాక్షి సంత‌కాలతో కూడిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

ఖాతా శాశ్వతంగా మూసివేసే సమయంలో :

ఖాతాదారుడు ఖాతాను శాశ్వతంగా మూసివేసే సమయంలో అందులోని
పూర్తి నగదును తీసుకోవచ్చు. ఖాతా మూసివేసేందుకు తగిన ఫారాన్ని, పాస్‌బుక్‌ సమర్పించాలి.

పన్ను మినహాయింపులు :

 • ఐటీ చట్టం ప్రకారం ఏకవ్యక్తి ఖాతా లేదా ఉమ్మడి ఖాతాపై వచ్చే వడ్డీకి ఏడాదికి రూ.పదివేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. అంత‌కంటే ఎక్కువ వ‌డ్డీ జ‌మ అయిన‌ట్ల‌యితే ఆయా వ్య‌క్తుల శ్లాబుల‌ను అనుస‌రించి ప‌న్ను వ‌ర్తిస్తుంది.
 • రూ.50వేలు ఆ పైన పెట్టుబడులు పెట్టేవారు ఆదాయపు పన్ను చట్టాన్ని అనుసరించి తప్పనిసరిగా పాన్ కార్డు సంఖ్యను పేర్కొనాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly