ఎన్ఆర్ఐలు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే ముందు...

విదేశాల్లో ఉండి అన్ని లావాదేవీలను నిర్వ‌హించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఇలాంట‌ప్పుడే నమ్మిన వారిని ప్రతినిధిగా నియమించుకోవడాన్ని పవర్ అఫ్ అటార్నీ అంటారు.

ఎన్ఆర్ఐలు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే ముందు...

ప్ర‌వాస భార‌తీయులెవ‌రైనా స‌రే మన భార‌త దేశంలో బ్యాంకు ఖాతాల‌ను తెరిచి దాన్నినిర్వ‌హించుకునే వెసులుబాటు ఉంది. ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఓ ఖాతాను కొత్త‌గా తెర‌వ‌చ్చు లేదా ప్ర‌స్తుతం కొన‌సాగిస్తున్న బ్యాంకు ఖాతానే ఎన్ఆర్ఓ ఖాతాగా నిర్దేశించుకోవ‌చ్చు. ఇదే కాకుండా ఎన్ఆర్ఇ ఖాతాను తెరిచి లావాదేవీలు జ‌ర‌పుకోవ‌చ్చు. అంతేకాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు అనువుగా ఎఫ్‌సీఎన్ఆర్‌ అకౌంట్‌ ను ఏదేని బ్యాంకు ద్వారా తెర‌వవ‌చ్చు. ఫెమా చ‌ట్టాల‌ను అనుస‌రించి ఇలా విభిన్న ర‌కాల ఖాతాలు తెరిచేందుకు ఎన్ఆర్ఐకు అవ‌కాశం ఉంది.

పవ‌ర్ ఆఫ్ అటార్నీ నియామ‌కం

బ్యాంకు ఖాతాలు తెర‌వ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా… విదేశాల నుంచి వీటిని నిర్వ‌హించేందుకు క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. ఇందుకోసం ఎన్ఆర్ఐ భార‌త్‌లో నివ‌సించే ఎవ‌రినైనా త‌న ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ(పీఓఏ)గా నియ‌మించుకునే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో పీఓఏ పాత్ర కీల‌క‌మైన‌ది.

నియ‌మించే విధానం

ప్ర‌స్తుతం ఎన్ఆర్ఐల‌కు వ‌ర్తించే చ‌ట్టాల ప్ర‌కారం భార‌త్‌లో నివాస‌ముండే ఎవ‌రినైనా ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీగా నియ‌మించి బ్యాంకు ఖాతాల‌ను నిర్వ‌హించే వీలుంది. ఇందుకు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ నోట‌రీ వ‌ద్ద రిజిస్ట‌రీ చేసుకోవాల్సి ఉంటుంది. పీఓఏగా నియ‌మించాల‌నుకునే వ్య‌క్తిని ఎన్ఆర్ఐ ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను సాక్షిగా ఉంచి నోట‌రీ చేయించి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో రిజిస్ర్టేష‌న్ చేయించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ భార‌త్‌లో ఉన్న‌ప్పుడే ఈ ప‌నిచేస్తే బాగుంటుంది. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే పీఓఏకున్న అధికారాల‌ను స్ప‌ష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. త‌ద్వారా భ‌విష్య‌త్‌లో ఎటువంటి గంద‌ర‌గోళానికి గురి కాకుండా ఉంటుంది.

బ్యాంకుల‌ మ్యాండేట్

చాలా బ్యాంకులు పీఓఏ నియామ‌కానికి ప్ర‌త్యేక‌మైన మ్యాండేట్‌ను రూపొందిస్తాయి. బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడే ఈ విష‌యాన్ని ఎన్ఆర్ఐల‌ను అడుగుతారు. పీఓఏని నియ‌మించేందుకు లాయ‌ర్ స‌హ‌కారం తీసుకోవ‌డం మంచిది. భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు లాయ‌ర్ల స‌హాయం అవ‌స‌ర‌మ‌వుతుంది.

పరిమితులుంటాయి

ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ విధులు ప్ర‌త్యేకంగా ఉంటాయి. కొన్ని ర‌కాల ప‌నుల‌కే ప‌రిమిత‌మై ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఏదైనా లావాదేవీకి సంబంధించి ప‌రిమితి మేర‌కే చేయాల్సి ఉంటుంది. ఒక బ్యాంకు ఖాతాకు సంబంధించి ప‌రిమితి మేర‌కే లావాదేవీ చేసేందుకు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీకి అధికార‌ముంటుంది.

ప్ర‌తి బ్యాంకు వ‌ద్ద రిజిస్ట‌రైతే మేలు

ఒక వేళ ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీకి ఎన్ఆర్ఐ అన్ని అధికారాలు ఇచ్చినా… ఆర్‌బీఐ సూచించిన మేర‌కు ప‌రిమితుల‌ను పాటించ‌క త‌ప్ప‌దు. ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతా క‌లిగి ఉన్న బ్యాంకు వ‌ద్ద పీఓఏ రిజిస్ట‌ర్ అయి ఉండాలి. సాధార‌ణంగా పీఓఏ అని గుర్తింపు ఉండేలా ఓ స‌ర్టిఫైడ్ కాపీ ఉంటే స‌రిపోతుంది. దీని ద్వారా బ్యాంకులో లావాదేవీలు చేసే వీలుక‌ల్పిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు ఈ స‌ర్టిఫికెట్‌ను నిరాక‌రించవ‌చ్చు. అలాంటప్పుడు ప్ర‌తి బ్యాంకు వ‌ద్ద పీఓఏని రిజిస్ట‌ర్ చేయిస్తే భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.

అధికారాలివే!

  • ఎన్ఆర్ఓ ఖాతాకు వ‌చ్చేస‌రికి స్థానికంగా ఉండే చెక్కుల‌ను భార‌తీయ క‌రెన్సీలో చెల్లింపులు చేసేందుకు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీకి అధికార‌ముంటుంది.
  • పీఓఏ త‌న అధికారాన్ని ఉప‌యోగించి ఎన్ఆర్ఇ ఖాతాకు సొమ్మును బ‌దిలీ చేయ‌వ‌చ్చు లేదా విదేశాల‌కు త‌ర‌లించే వీలుంటుంది.
  • ఇలా బ‌దిలీ చేసే అధికారం కేవ‌లం ఆ ఎన్ఆర్ఐకి సంబంధించిన మ‌రో ఎన్ఆర్ఓ ఖాతాకో, లేదా ఎన్ఆర్ఇ ఖాతాకే ఉంటుంద‌న్న విష‌యాన్ని పీఓఏ గుర్తించాలి.
  • ఒక్కో ఖాతాలో సాధార‌ణంగా ఉండే ప‌రిమితుల మేర‌కే ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ న‌గ‌దును బ‌దిలీచేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఏడాదికి అంతే…

  • ఎన్ఆర్ఓ ఖాతా నుంచి రీపాట్రియేష‌న్ ద్వారా విదేశాల‌కు బ‌దిలీ చేయ‌గ‌ల సొమ్ము ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం ఒక మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు మాత్ర‌మే.
  • ఇదే ప‌రిమితి ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీకి వ‌ర్తిస్తుంది.

దాదాపు ఒకేలా ఉంటాయి

  • ఎన్ఆర్ఇ, ఎఫ్ సీఎన్ఆర్ ఖాతాల‌కు ఎన్ఆర్ఓ ఖాతాల‌కు వ‌ర్తించే నిబంధన‌లు ప్ర‌వాస భార‌తీయుడికి, ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీకి దాదాపు ఒకేలా ఉంటాయి.
  • ఎన్ఆర్ఓ ఖాతాకు మ‌ల్లే వీటిలోనూ నిబంధ‌న‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే ఎన్ఆర్ఇ, ఎఫ్‌సీఎన్ఆర్‌ల‌లో విదేశాల‌కు రీపాట్రియేట్ చేయ‌గ‌లిగే సొమ్ముపై ప‌రిమితులు ఉండ‌వు. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి ప‌రిమితి మేర‌కు ఎంత సొమ్మైనా స‌రే బ‌దిలీ చేసేందుకు అధికారం ఉంది.
  • ఎన్ఆర్ఇ, ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల నుంచి న‌గ‌దును ఎన్ఆర్ఓ ఖాతాకు బ‌దిలీచేసుకునే అధికార‌మూ ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీకి ఉంటుంది.
  • ఇలాంటి ఖాతాలను చూపించుకొని ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ సొంతంగా రుణాలు పొందేందుకు మాత్రం అవ‌కాశం లేదు.

ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీకున్న అధికారాలు, ప‌రిమితులు తెలుసుకున్నారు క‌దా! ఎన్ఆర్ఐగా విదేశాల‌కు వెళ్లేవారు త‌గిన ప్ర‌మాణాల‌తో ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీని నియ‌మించుకొని బ్యాంకింగ్ లావాదేవీలను స‌వ్యంగా జ‌ర‌పుకుంటార‌ని ఆశిస్తున్నాం.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly