బ‌డ్జెట్‌లో అంకురాల‌కు ప్రోత్సాహం

ఏంజెల్‌ ట్యాక్స్‌ కేసుల విషయంలో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది

బ‌డ్జెట్‌లో అంకురాల‌కు ప్రోత్సాహం

అంకుర సంస్థ‌ల‌ కోసం ప్రత్యేకంగా ఓ టీవీ ఛానల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అంకురాల సమస్యలు, నిధుల అవసరాలు, పన్నుల ప్రణాళిక లాంటి అంశాలను చర్చించేందుకు ఈ ఛానల్ ఓ వేదికగా ఉపయోగపడుతుందని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఛానల్‌ రూపకల్పన దగ్గర నుంచి నిర్వహణ వరకు అంకురాలే స్వయంగా నిర్వహిస్తాయని అన్నారు. దూరదర్శన్‌ ఛానళ్లలో భాగంగానే ఇది ఉండ‌నుంది. ప్రత్యేకంగా ఛానల్‌ ఉండటం వల్ల అంకురాల ఏర్పాటు, అభివృద్ధికి ఉన్న అవకాశాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న తరహా వ్యాపారులు ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో కొత్తగా వ్యాపారాలు ఆరంభించే వారిని ప్రోత్సహించేందుకు ఛానల్‌ ఉపయోగపడుతుందని అన్నారు.

ఏంజెల్‌ ట్యాక్స్‌ కష్టాలు దూరం

ఏంజెల్‌ ట్యాక్స్‌ కేసుల విషయంలో అంకుర సంస్థలు (స్టార్టప్‌) ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. డిక్లరేషన్‌ దాఖలు చేయడంతో పాటు రిటర్న్‌ల్లో పూర్తి సమాచారాన్ని అందించిన వారికి ఎలాంటి నిశిత పరిశీలన (స్క్రూట్నీ) ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవే కాకుండా పలు ప్రోత్సాహకాలనూ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో అంకుర వ్యవస్థ బలంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వృద్ధి ఇలాగే కొనసాగాలంటే అంకురాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బడ్జెట్‌ ప్రసంగంలో సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. ఏంజెల్‌ ట్యాక్స్‌కు సంబంధించి పెట్టుబడులు పెట్టిన సంస్థ/ వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి నిధులు సమీకరించారో తెలుసుకోవడానికి ఇ-వెరిఫికేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీని వల్ల నిధులు సమీకరించిన అంకుర సంస్థలకు ఆదాయపు పన్ను విభాగం నుంచి ఏ తరహా ప‌రిశీల‌న‌ ఎదుర్కోనవసరం లేదు.

అంకుర సంస్థలకు సంబంధించి పెండింగ్‌ అసెస్‌మెంట్‌ కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ తరహా కేసుల్లో ఉన్నవారిని పర్యవేక్షణ అధికారి అనుమతులు లేకుండా పన్ను అధికారులు ఎలాంటి తనిఖీలు చేయరని భరోసా ఇచ్చారు. అలాగే అంకురాల్లో పెట్టుబడులు పెట్టే ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) కేటగిరి- 2కి ఏంజెల్‌ ట్యాక్స్‌ నుంచి పూర్తి మినహాయింపును ఇచ్చారు.

ఒక అంకుర సంస్థ పోటీ విపణుల్లో అడుగుపెట్టే సమయంలో పెట్టుబడులు పెట్టే సంస్థను ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ అంటారు. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్‌ 56(2)(7బీ) ప్రకారం… సాధారణ మార్కెట్‌ విలువకు మించి నిధులు సమీకరించినప్పుడు… ఆ నిధులను ఇతర వనరుల నుంచి లభించిన ఆదాయంగా పరిగణించి 30 శాతం పన్ను విధిస్తారు. దీనినే ఏంజెల్‌ ట్యాక్స్‌గా నిర్వచిస్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly