ఉద్యోగం రీత్యా విదేశాల‌కు వెళ్ళేట‌ప్పుడు పీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రా?

ఒకవేళ మీరు విదేశాల్లో స్థిరపడినట్లయితే, ఏ వయస్సులోనైనా పీఎఫ్ ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

ఉద్యోగం రీత్యా విదేశాల‌కు వెళ్ళేట‌ప్పుడు పీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రా?

అంత‌ర్జాతీయంగా ఉద్యోగావ‌కాశాలు పెర‌గిన నేప‌థ్యంలో, దాదాపు అన్ని మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలు ఉద్యోగుల‌ను అంత‌ర్జాతీయ కార్య‌కాలాపాల‌కు నియ‌మిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న సంస్థ ద్వారా గానీ, వేరే సంస్థ‌లోఉద్యోగ అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల గానీ విదేశాల‌కు వెళ్ళే వారి సంఖ్య గ‌త ద‌శాబ్ధ కాలంగా పెరుగుతూ వ‌స్తుంది. అయితే వ‌ర్తించే ప‌న్ను, నియంత్ర‌ణ‌, ఇత‌ర చ‌ట్టాల‌లో మ‌న దేశానికి, విదేశాల‌కు వ్య‌త్యాసం ఉంటుంది.

సోష‌ల్ సెక్యూరిటీ ఫ్రేమ్ వ‌ర్క్‌:

భార‌త‌దేశంలో సాంఘిక భద్రతా వ్యవస్థ ప్రధానంగా వ్యవస్థీకృత రంగంపై ఆధార‌ప‌డుతుంది. ఉద్యోగులు తాము ప‌నిచేసే సంస్థ‌లో య‌జ‌మాని -ఉద్యోగి సంబంధాన్ని క‌లిగి ఉంటారు. ప్రావిడెండ్ ఫండ్‌, పెన్ష‌న్‌, డిపాజిట్ లింకెడ్ బీమా ప‌థ‌కాల‌ను, ఉద్యోగి ప్రావిడెండ్ ఫండ్ అండ్ మిస్లీనియ‌స్ చ‌ట్టం 1952 ప్ర‌ధానంగా నియంత్రిస్తుంది. క‌నీసం 20 మంది లేదా అంత‌కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్న సంస్థ‌ల‌కు ఈపీఎఫ్ వ‌ర్తిస్తుంది. ఈపీఎఫ్ చట్టం కింద, ఒక ఉద్యోగి తన జీతంలో 12 శాతాన్ని ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అదే మొత్తాన్ని యజమాని కూడాతన వాటా కింద చెల్లిస్తారు. పీఎఫ్ ఉపసంహరణ సమయంలో మీరు సేకరించిన మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ ను వడ్డీతో సహా పొందవచ్చు. అయితే, ఒకవేళ మీరు విదేశాల్లో స్థిరపడినట్లయితే, ఏ వయస్సులోనైనా పీఎఫ్ ఉపసంహరణ కోసం మీరు దరఖాస్తు చేసుకోవడంతో పాటు వెంటనే పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

ఈపీఎఫ్ మొత్తాన్ని ఎప్పుడు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు:

1.58 సంవత్సరాల వయస్సు కలిగి ఉండడంతో పాటు, ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఉన్న‌ప్పుడు,
2.రెండు నెల‌లు అంత‌కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
3.ప‌ద‌వీ విర‌మ‌ణ కంటే ముందుగా ఉద్యోగి మ‌ర‌ణిస్తే ఈపీఎఫ్ మొత్తాన్ని నామినీకి అంద‌జేస్తారు.

పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌లు ఎప్పుడు అనుమ‌తిస్తారు:

1.గృహ రుణం తిరిగి చెల్లింపుల‌కు
2.గృహం కొనుగోలు చేసిన‌ప్పుడు లేదా నిర్మించిన‌ప్పుడు
3.వివాహ ఖ‌ర్చులు
4.వైద్య ఖ‌ర్చుల‌కు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఒకవేళ భారత దేశంలో పనిచేస్తున్న ఉద్యోగి, ఉపాధి కోసం విదేశాలకు వెళితే వారి చెల్లింపులు కొనసాగించాలా లేదా అనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

1.వేతనం స్వదేశీ సంస్థలోనే కొనసాగితే

ఒక ఉద్యోగి నియమిత పని కోసం స్వల్ప కాలానికి గాని, ఒక వ్యక్తికి ప్రత్యామ్నాయంగా గాని విదేశాలకు వెళితే ప్రస్తుతం ఆ ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీతో సంబంధాలు కొనసాగుతాయి. ఈ సందర్భంలో ఉద్యోగి విదేశాలలో పనిచేస్తున్నప్పటికీ తన మాతృ దేశం (ఇండియా) లోనే శాలరీ పొందుతుంటే, భారత దేశంలోని సోషల్ సెక్యూరిటీ పథకాలలో కాంట్రిబ్యూట్ చేయడాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అదేవిదంగా విదేశాల్లోని సోషల్ సెక్యూరిటీ పథకంలోనూ కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తే, అప్పుడు ఒక ఉద్యోగి రెండు సార్లు కాంట్రిబ్యూట్ చేసినట్లు అవుతుంది.

ఈ విధంగా రెండు సార్లు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా, భారత ప్రభుత్వం ద్వైపాక్షిక సామాజిక భద్రతా ఒప్పందం (ఎస్ఎస్ఏ )ను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, కొరియాలతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, నెథర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశాలతో కలిపి మొత్తం 18 దేశాలు ఈ ఒప్పదం లో భాగంగా ఉన్నాయి. దేశీయ సంస్థలో ఉద్యోగం చేస్తూ, ఒక ఉద్యోగికి ప్రత్యామ్నాయంగా గాని, ఏదైనా అసైన్మెంట్ కోసం స్వల్ప కాలానికి ఎస్ఎస్ఏ దేశాలకు వెళ్ళినట్లైతే, మీరు ఈపీఎఫ్ఓ ​​జారీ చేసే కవరేజ్ సర్టిఫికేట్(సీఓసీ ) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది స్థానిక సోషల్ సెక్యూరిటీ పథకానికి కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు మినహాయింపును అందిస్తుంది. అయితే, ఇది పని చేయడానికి, మీరు భారతీయ కంపెనీలో ఉద్యోగాన్ని కలిగి ఉండడంతో పాటు, మీరు విదేశాల్లో ఉన్నంత కాలం మీరు పనిచేస్తున్న సంస్థ మీ తరపున ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ను జమ చేయాల్సి ఉంటుంది.

2.వేతనం విదేశీ సంస్థకు బదిలీ అయితే

భారత దేశంలోని సోషల్ సెక్యూరిటీ పథకంలో కాంట్రిబ్యూట్ చేసేందుకు కావాల్సిన కవరేజ్ సర్టిఫికేట్(సీఓసీ ), స్వదేశంలో వేతనం పొందే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగి వేతనం స్వదేశీ గ్రూప్ సంస్థ విదేశంలో చెల్లిస్తుంటే, ఈపీఎఫ్ చట్టం పరిధిలోని ఉద్యోగిగా పరిగణించరు, భారతదేశంలోని సోషల్ సెక్యూరిటీ పథకంలో మీ చెల్లింపులు నిలిపివేస్తారు. అదేవిధంగా ఒక కొత్త ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్న వారి సోషల్ సెక్యూరిటీ పథకంలో కాంట్రిబ్యూషన్లు కూడా నిలిపివేస్తారు.
ఈ సందర్భంలో విదేశాలకు వెళ్తున్న ఉద్యోగి, భారత దేశంలో ఉద్యోగం వదిలివేసిన 2 నెలల తరువాత పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకునేందుకు ఇష్టపడని వారు ఈ నిధిని పెట్టుబడి పెట్టడానికి ఈపీఎఫ్ వీలు కల్పించింది.

పన్ను ఏ విధంగా వర్తిస్తుందో చూద్దాం:

1.నిరంతర సర్వీస్ కాలం 5సంవత్సరాల లోపు అయితే:
సేకరించిన మొత్తం లో సంస్థ చెల్లింపులు, వడ్డీ మొత్తంపై పన్ను వర్తిస్తుంది. ప్రారంభ సంవత్సరాల్లో క్లెయిమ్ చేసివుంటే, ఉద్యోగిచెల్లింపులపై మినహాయింపు మేరకు పన్ను వర్తిసుంది. ఉద్యోగి చెల్లింపులపై వచ్చిన వడ్డీని ఇతర ఆదాయాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు. ఈపీఎఫ్ అధికారులు 10శాతం ఫ్లాట్ రేటు చొప్పున పన్ను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ఉద్యోగికి చెల్లిస్తారు.

2.నిరంతర సర్వీస్ కాలం 5సంవత్సరాల కంటే ఎక్కువ అయితే:
భారత దేశపు పన్ను నిమయాల ప్రకారం సంస్థ, ఉద్యోగి మొత్తం చెల్లింపులు, దానిపై వచ్చిన వడ్డీతో కలిపి, సేకరించిన మొత్తంపై పన్ను మినహాయింపు వర్తిసుంది.

3.సేకరించిన మొత్తం పెట్టుబడిగా:
స్వదేశంలో ఉద్యోగం వదిలి విదేశాలకు వెళ్లేవారు ఈపీఎఫ్ మొత్తాన్ని పెట్టుబడిగా కొనసాగించవచ్చు. ఈ విధంగా చేస్తే అధికారులు ఖాతాను నిర్వహించినంత కాలం ప్రతీ ఏడాది వడ్డీ మొత్తాన్ని కార్పస్ కి కలుపుతారు. ఉద్యోగి 5సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిరంతరంగా పనిచేసి వుంటే , స్వదేశీ సంస్థలో కాంట్రిబ్యూట్ చేసినంత కాలం, సేకరించిన మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఇటీవల సవరించిన పన్ను నియమాల ప్రకారం స్వదేశీ ఉద్యోగాన్ని వదిలి వేసిన రోజు నుంచి వచ్చిన వడ్డీ ఫై, విత్డ్రా చేసుకున్న సంవత్సరంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది.
­

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly