పీపీఎఫ్‌లో మ‌దుపు చేద్దామా..

ప్రభుత్వం పూర్తి పన్ను రాయితీతో అందిస్తున్న పధకం ప్రజా భవిష్య నిధి

పీపీఎఫ్‌లో మ‌దుపు చేద్దామా..

భారత ప్రభుత్వం ప్రజా భవిష్య నిధి పథకాన్ని పీపీఎఫ్‌ చట్టం 1968 ద్వారా అమల్లోకి తీసుకువచ్చింది. స్వయం ఉపాధి, ప్రైవేటు రంగాల ఉద్యోగులకు రిటైర్మెంటు తర్వాత ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ముఖ్యోద్దేశం

అర్హత:

 • 18ఏళ్లు నిండిన భారతీయులు పీపీఎఫ్‌ ఖాతా తెరిచేందుకు అర్హులు.
 • సంరక్షకుడి పర్యవేక్షణలో మైనర్లు పీపీఎఫ్‌ ఖాతా తెరవవచ్చు.
 • ఉమ్మడి ఖాతాకు అనుమతి లేదు.

గరిష్ఠ, కనిష్ఠ పెట్టుబడి:

 • క‌నీసం రూ.500 పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది.
 • ఓ ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.

కాలపరిమితి:

 • పథకం కాలపరిమితి 15ఏళ్లు.
 • ఆ త‌ర్వాత కొన‌సాగించాలంటే ఖాతాను అయిదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.

రాబడి:

 • పీపీఎఫ్‌ పై ప్రస్తుత వార్షిక వడ్డీ 8 శాతం. వడ్డీకి చక్రవడ్డీ జ‌మ‌చేసి ఖాతాలో చేరుస్తారు.
 • ఓ నెల‌లో 5వ తేదీ నుంచి చివ‌రి తేదీ మ‌ధ్య‌లో ఖాతాలో ఉన్న‌ త‌క్కువ మొత్తంపై వ‌డ్డీ లెక్కిస్తారు.

నామినీ సదుపాయం:

 • ఖాతా ప్రారంభ సమయంలో లేదా తర్వాత ఎప్పుడైనా నామినీని ప్రతిపాదించవచ్చు.
 • నామినీగా ఎవరినైనా ఎప్పుడైనా మార్చుకునే సౌలభ్యం.

ఖాతా తెరిచే విధానం:

 • పెట్టుబడిదారు ఏదైనా పోస్టాఫీసు లేదా గుర్తింపు పొందిన బ్యాంకు ద్వారా ఖాతా ప్రారంభించవచ్చు.
 • పూర్తి వివరాలతో నింపిన ఫారం−ఏ, వయసు ధ్రువీకరణ పత్రం, గుర్తింపు, చిరునామా పత్రాలు, రెండు ఫొటోలు జతచేసి పోస్టాఫీసు కార్యాల‌యంలో స‌మ‌ర్పించాలి.
 • ఖాతా ప్రారంభించేందుకు కనీసం రూ.100 జమ చేయాలి.

డిపాజిట్లు:

 • ఖాతాను కొన‌సాగేందుకు ఆర్థిక సంవ‌త్స‌రంలో కనీసం రూ.500 జమచేయాల్సి ఉంటుంది.
 • డిపాజిట్‌ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లించవచ్చు. ఒక ఏడాదికి 12 వాయిదాలు మించరాదు. ఒక నెలలో రెండు వాయిదాలను మించరాదు. మొత్తం డిపాజిట్‌ సొమ్ము రూ. 1.5ల‌క్ష‌లు మించ‌కూడ‌దు.
 • మైనర్ల ఖాతాలో సొమ్ము… వారి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల ఖాతాలోని సొమ్ము రెండూ కలిపి రూ.1.5 ల‌క్ష‌లు మించకూడదు.
 • ఏడాది వరకూ ఖాతాలో ఎలాంటి డిపాజిట్లు చేయకపోతే దాన్ని నిలిపివేస్తారు.

నిలిపివేసిన ఖాతా పునరుద్ధరణ:

 • నిలిపివేసిన ఖాతాను కనీసం రూ.500పాటు నిలిపివేసిన తేదీ నుంచి ప్రతి ఏడాదికి రూ.50 చొప్పున జరిమానా చెల్లించి ఖాతా పునరుద్ధరించుకోవచ్చు.

ఖాతా బదిలీ:

పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు లేదా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు… ఒక బ్యాంకు లేదా పోస్టాఫీసు నుంచి మరో బ్యాంకు లేదా పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు.

పీపీఎఫ్‌ సొమ్ముపై రుణం:

 • ఖాతా ఖాతా ప్రారంభించాక మూడేళ్ల త‌ర్వాత పీపీఎఫ్‌లోని సొమ్ముపై రుణం తీసుకునే సదుపాయం ఉంది.
  ఉదాహరణకు మీరు పీపీఎఫ్‌ ఖాతాను అక్టోబర్‌ 2013లో తెరిచారనుకుందాం. ఖాతా తెరిచే సమయం 2013−14 ఆర్థిక సంవత్సరంలో ఉంది. ఒక ఆర్థిక సంవత్సరం తర్వాత… మూడేళ్ల వరకు రుణం తీసుకోవచ్చు. అంటే మార్చి 2015 , ఏప్రిల్‌ 2018 మధ్యకాలంలో ఎప్పుడైనా రుణం పొందే వీలుంది.
 • గడిచిన ఆర్థిక సంవత్సరం కంటే ముందు సంవత్సరంలో ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం పీపీఎఫ్‌ సొమ్ము నుంచి 25శాతం వరకూ రుణం పొందవచ్చు.
 • రుణంపై 2శాతం వడ్డీ విధిస్తారు.
 • రుణాన్ని 36నెలల లోపు చెల్లించాలి.
 • ఒకవేళ 36నెలల లోపు చెల్లించకపోతే, 36వ నెల నుంచి రుణంపై 6 శాతం వడ్డీ విధిస్తారు.
 • రెండో సారి రుణం తీసుకోవాలంటే మొదటి రుణాన్ని తీర్చాలి. ఖాతా ప్రారంభమై 3 నుంచి 6 ఏళ్ల మధ్య ఉంటే రెండో సారి రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
 • కొన‌సాగించ‌కుండా ఉంచిన ఖాతాపై ఎలాంటి రుణసౌకర్యం ఉండదు.

పీపీఎఫ్‌ ఖాతా నుంచి విత్‌డ్రాయల్‌:

 • ఖాతా ప్రారంమైన ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు.
 • నాలుగేళ్ల ముందు ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ముపై 50శాతం లేదా గ‌డిచిన ఏడాది ఖాతాలో ఉన్న సొమ్ములో 50శాతం … వీటిలో ఏది త‌క్కువ‌గా ఉంటే ఆ మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు.

పీపీఎఫ్‌ ఖాతాకు అధిక రాబడి వచ్చేందుకు :

 • ఏటా ఏప్రిల్‌ 5 లేదా అంతకుముందు డిపాజిట్లు చేస్తే మొత్తం ఆర్థిక సంవత్సరానికి వడ్డీ వస్తుంది.
 • నెల నెలా డిపాజిట్‌ చేయదల్చుకుంటే ఆ నెల 5వ తేదీ లోపు చెల్లింపులు జరిగేలా చూసుకోవ‌డం మంచిది.

మెచ్యూరిటీ సమయంలో…

 • 15 ఏళ్ల కాలపరిమితి తర్వాత మెచ్యూరిటీ తేదీ నాడు సొమ్మును విత్‌డ్రా చేసుకొని ఖాతా మూసివేయవచ్చు.(లేదా)
 • ఖాతాను అయిదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. (లేదా)
 • ఖాతాను అలాగే వదిలేయవచ్చు. దీనికి వార్షిక వడ్డీ జమ అవుతుంది.

ఖాతాదారు చనిపోతే…

ఖాతాదారు చనిపోతే నామినీ ఖాతాను కొనసాగించలేరు. ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది.

పన్ను మినహాయింపు:

 • పన్ను మినహాయింపునకు పీపీఎఫ్‌ చక్కటి వేదిక.
 • రూ.1.5ల‌క్ష‌ల వరకూ పెట్టే పెట్టుబడిపై ఆదాయ‌పు ప‌న్ను చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.
 • వడ్డీపై పన్ను వర్తించదు.
 • రూ.50వేల పైనా జ‌రిపే లావాదేవీల‌కు పాన్ సంఖ్య‌ను పేర్కొన‌డం త‌ప్ప‌నిస‌రి.
 • మెచ్యూరిటీ సొమ్ముపైనా ఎలాంటి పన్ను విధించరు. ఈ అంశం పీపీఎఫ్‌ను పెట్టుబడి మార్గాల్లో విశిష్టంగా ఉంచుతుంది.

కోర్టు ఆర్డర్‌కు అనుకూలంగా బకాయిదారుల నుంచి బకాయి వసూలు చేసేటప్పుడు ఆస్తుల జప్తు సమయంలో పీపీఎఫ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ జప్తు చేసే అవకాశం లేదు. ఇది ఉన్నత శ్రేణి న్యాయస్థానం నిర్ణయం. ఆర్థికంగా సర్వం కోల్పోయినా ఆదుకునేందుకు ఏకైక మార్గంలా, మంచి మిత్రుడిలా పీపీఎఫ్‌ ఉంటుంది. అందుకే పీపీఎఫ్‌లో సొమ్ము ఆపద సమయంలో ప్రాణదాతలా రక్షిస్తుంది.

పీపీఎఫ్‌ ఖాతా ఎలా పనిచేస్తుందో చూద్దాం:

1 ఏప్రిల్‌ 2013న సంజయ్‌ పీపీఎఫ్‌ ఖాతాను ప్రారంభించాడు. ఏటా రూ.50వేలు జమచేయాలని నిర్ణయించుకున్నాడు. సగటు వార్షిక రాబడి 8.0 శాతం అయితే, పీపీఎఫ్‌ కాలపరిమితి మోత్తానికి అతడి పెట్టుబడులు, రాబడి కింద సూచించిన టేబుల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

TABLE.jpg

పీపీఎఫ్‌ ఖాతా 31 మార్చి 2029 నాటికి మెచ్యూర్‌ అవుతుంది. అప్పటికి రూ. 14,66,214 ఖాతాకు జమ అవుతుంది.

 • ఏడాదికి రూ.50వేలు పెట్టుబ‌డి పెడితే అందుకు చెల్లించాల్సిన ప‌న్ను ఆదా అవుతుంది.
 • మొత్తం జమ అయిన వడ్డీ రూ.7,16,214 పై పన్ను మినహాయింపు ఉంటుంది.
 • పెట్టుబడి కాలపరిమితిలో రుణసౌకర్యం పొందే వీలుంది. ఇతర మార్గాల కంటే చాలా తక్కువ వడ్డీతో రుణం పొందొచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly