రెపో రేటు మ‌రో పావు శాతం త‌గ్గింపు

ఆర్‌బీఐ రెండు నెల‌ల్లో రెండో సారి వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించింది. దీంతో రెపోరేటు 6 శాతానికి చేరింది. దీంతోపాటు తటస్థ ద్రవ్య విధానాన్ని కొనసాగించాలని క‌మిటీ నిర్ణ‌యించింది

రెపో రేటు మ‌రో పావు శాతం త‌గ్గింపు

ఊహించ‌న‌ట్లుగానే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మావేశంలో కీల‌వ వ‌డ్డీ రేట్ల‌లో మ‌రో పావు శాతం కోత విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు త‌గ్గించి 6 శాతంగా ప్ర‌క‌టించింది. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా శ‌క్తికాంత‌దాస్ నియామ‌కం త‌ర్వాత రెండో సారి వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌డం విశేషం. ఫిబ్ర‌వ‌రిలో కూడా వ‌డ్డీ రేట్ల‌ను పావు శాతం త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌గ్గించి వ‌డ్డీ రేట్ల‌ను బ్యాంకులు వినియోగ‌దారుల‌కు ప‌రిమితంగానే బ‌దిలీ చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల‌ను త‌గ్గిస్తే బ్యాంకులు 5-10 బేసిస్ పాయింట్లు మాత్ర‌మే రుణ రేట్ల‌ను త‌గ్గించాయి. ప్ర‌స్తుతం ఆహార వ‌స్తువుల విభాగంలో దేశీయ‌, అంతర్జాతీయ గిరాకీ-సరఫరా సమతుల్యత ఉంటుంద‌ని, దీంతో స్వ‌ల్ప‌కాల‌కంగా ఆహ‌ర ద్ర‌వ్యోల్బ‌ణం నియంత్ర‌ణంలో ఉంటుంద‌ని వెల్ల‌డించింది. అయితే గ‌త నివేదిక‌ల్లో ఈ ఏడాది ఎల్‌నినో ప్ర‌భావం ఉంటుంద‌ని కూడా చెప్పాయి. దీంతో పాటు వేస‌వి కాలంలో కూర‌గాయ‌ల ధ‌ర‌లు కూడా ఆక‌స్మికంగా పెరిగే అవ‌కాశం ఉండొచ్చ‌ని అంచ‌నా వేసింది. ముడి చమురు ధరలు గత పాలసీ నుంచి 10 శాతం పెరిగాయని కేంద్ర బ్యాంకు పేర్కొంది. ఈ ర‌క‌మైన అనిశ్చితులు ద్ర‌వ్యోల్బ‌ణంపై ప్ర‌భావం చూపిస్తాయ‌ని వెల్ల‌డించింది.

డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 6.6 శాతానికి క్షీణించింది. గ‌త అయిదు త్రైమాసికాల్లో ఇదే క‌నిష్ఠం. వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో కేవలం 2.57% మాత్రమే న‌మోదు కావ‌డం మంచి ప‌రిణామం. అయితే వ‌ర్ష‌పాతం త‌క్కువ‌గా ఉంటే లేదా ప్రపంచ చమురు ధరలు పెరిగినట్లయితే ఇది వెంట‌నే ప్ర‌తికూలంగా మారిపోయే అవ‌కాశం లేక‌పోలేద‌ని ఆర్‌బీఐ హెచ్చ‌రించింది.

ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ సంస్థ స్కైమెట్ ఈ ఏడాది వ‌ర్ష‌పాతం సాధార‌ణం కంటే త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని తాజాగా అంచ‌నా వేసింది. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు కూడా అయిదు నెల‌ల గ‌రిష్ఠానికి చేరాయి. బ్యారెల్ ధ‌ర 70 డాల‌ర్ల‌కు చేరువ‌లో ఉంది.

2019-20 సంవ‌త్స‌రానికి జీడీపీ వృద్ధి అంచ‌నాను కూడా ఆర్‌బీఐ త‌గ్గించింది. ఫిబ్ర‌వ‌రిలో 7.4 శాతంగా అంచ‌నా వేయ‌గా ఇప్పుడు 7.2 శాతానికి ప‌రిమితం చేసింది. ఈ ఏడాది మొదటి ఆర్థ‌భాగంలో ద్ర‌వ్యోల్బ‌ణం 2.9-3 శాతం వ‌ర‌కు ఉండొచ్చ‌ని పేర్కొంది. అదేవిధంగా రెండో భాగంలో 3.5-3.8 శాతానికి చేర‌వ‌చ్చ‌ని తెలిపింది. అయితే ఆహార‌, ముడిచ‌మురు ధ‌ర‌లు, ఆర్థిక ద్ర‌వ్య‌లోటు వంటివి పెరిగితే ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం చూపుతాయ‌ని హెచ్చ‌రించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly