అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా జియోమార్ట్

జియో వినియోగ‌దారుల‌ను జియో మార్ట్‌కి రిజిస్ట‌ర్ చేసుకోవాల్సిందిగా స‌మాచారం పంపుతోంది

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా  జియోమార్ట్

బిలియ‌నీయ‌ర్ ముకేశ్ అంబానీ ప్ర‌పంచ దిగ్గ‌జ‌ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు అమెజాన్, వాల్ మార్ట్ వంటి వాటికి స‌వాల్ విసురతూ కొత్త‌గా న్యూ కామ‌ర్స్‌కు తెర‌తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

రిల‌య‌న్స్ ఇండ‌స్ర్టీస్ అనుబంధ సంస్థ రిల‌య‌న్స్ రిటైల్ లిమిటెడ్, జియో టెలికాం వినియోగ‌దారుల‌ను జియో మార్ట్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాల్సిందిగా కోరుతోంది. ప్ర‌స్తుతం ‘దేశ్ కి న‌యా దుకాన్’ పేరిట ఆన్‌లైన్‌లో ముంబ‌యి ప్రాంతంలో సేవ‌ల‌ను అందిస్తుంది. రిల‌య‌న్స్ రిటైల్ దీనిని అధికారికంగా వెల్ల‌డించింది. జియో వినియోగదారులందరికీ ప్రాథమిక డిస్కౌంట్ పొందటానికి నమోదు చేసుకునేందుకు ఆహ్వానాలు పంపిస్తాము. ఇది ప్రస్తుతం మూడు ప్రాంతాలలో మాత్రమే ఉన్నప్పటికీ, మరింత విస్త‌రించ‌నున్నాయి. జియోమార్ట్ యాప్ కూడా త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతుంద‌ని కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి. రూ.50 వేల‌కు పైగా గ్రాస‌రీ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తే ఉచిత హోమ్ డెలివ‌రీ, వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించ‌నుంది.

రిల‌య‌న్స్ రిటైల్ ఆఫ్‌లైన్ టు ఆన్‌లైన్ స్టోర్‌ను న్యూ కామ‌ర్స్ పేరుతో ప్రారంబించ‌నుంది. ఇందులో పెట్టుబ‌డుదారులు, ట్రేడ‌ర్లు, చిన్న వ‌ర్త‌కులు, బ్రాండ్లు, వినియోగ‌దారుల‌ను సాంకేతిక‌త‌ సాయంతో ఒకేతాటిపైకి తీసుకురానున్నారు. దీనిపై కంపెనీ దాదాపుగా రెండేళ్ల నుంచి ప‌నిచేస్తుంది. ప్ర‌స్తుతం రిల‌య‌న్స్ రిటైల్ సూప‌ర్ మార్కెట్లు, హైప‌ర్ మార్కెట్లు, హోల్ సేల్‌, స్పెషాలిటీ, ఆన్‌లైన్ స్టోర్లు న‌డుపుతుంది. ముఖ్యంగా ఇప్పుడు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై దృష్టి సారించింది. చైనా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఆలీబాబా మాదిరిగా ఆఫ్‌లైన్ -టు-ఆన్‌లైన్ వ్యాపారాన్ని కొన‌సాగించ‌నుంది. దీని ప్ర‌కారం, వినియోగ‌దారుడు అవ‌స‌ర‌మైన వ‌స్తువును ఆన్‌లైన్లో ప‌రిశీలించి ఆఫ్‌లైన్‌లో స్టోర్‌కి వెళ్లి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇది స్థానిక డిమాండ్‌ను తీర్చే వ్యాపారులను ఏకీకృతం చేయడంతో పాటు రిలయన్స్ రిటైల్ ఖర్చులను ఆదా చేయడానికి, ఆన్‌లైన్ రిటైలర్ల పరిధికి వెలుపల ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. ఈ వెంచ‌ర్ ద్వారా 30 మిలియ‌న్ల స్థానిక దుకాణాల‌ను క‌లుపుకోనున్న‌ట్లు ఆగ‌స్ట్ 12 న‌జ‌రిగిన కంపెనీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ముకేశ్ అంబానీ వెల్ల‌డించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly