రామ‌కృష్ణా! మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో మార్పులివే!

దంప‌తులిద్ద‌రూ ఉద్యోగులై ఉండి వారికి ఇద్ద‌రు పిల్ల‌లున్న‌వారి ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా ఉందో, నిపుణుల సూచ‌న‌లేమిటో చూద్దాం

రామ‌కృష్ణా! మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో మార్పులివే!

రామకృష్ణ(35) ఒక ప్రైవేటు బీమా కంపెనీలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య విమల(31) ఒక ప్రైవేటు కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు అర్జున్‌(7), కూతురు(3). వారు సొంత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. పిల్లల చదువు, వివాహం, పదవీ విరమణ నిధి ఏర్పాటు చేసుకోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్న వీరి ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలో చూద్దాం.

ఆర్థిక వివరాలు

రాబడి, ఖర్చులు

రామకృష్ణ నెలవారీ జీతం 42 వేలు. విమల జీతం నెలకు రూ. 25 వేలు. ఇద్దరూ కలిసి ఉద్యోగ భవిష్య నిధికి రూ. 6500 కేటాయిస్తున్నారు.

కుటుంబ నెలవారీ ఖర్చులు రూ. 25 వేలు. కారు కోసం తీసుకున్న రుణంలో ఇంకా రూ. 1.2 లక్షలు చెల్లించాల్సి ఉంది. కారు ఈఎమ్‌ఐలకు నెలకు రూ. 5000 చెల్లిస్తున్నారు. రామకృష్ణకు కంపెనీ అందించే రూ. 5 లక్షల బృంద జీవిత బీమా పాలసీ ఉంది. దీనికి అదనంగా రూ. 50 లక్షల టర్మ్‌ పాలసీ కోసం సంవత్సరానికి రూ. 7600 ప్రీమియం చెల్లిస్తున్నారు. రూ. 3 లక్షల విలువ చేసే ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా కోసం సంవత్సరానికి ప్రీమియం రూ. 9300 అవుతోంది.

ఆస్తుల వివరాలు:

ఇంటి విలువ - రూ. 40 లక్షలు
బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న నగదు- రూ. 50 వేలు
ఉద్యోగ భవిష్య నిధి మొత్తం- రూ. 5.6 లక్షలు
ఈక్విటీ షేర్ల విలువ- రూ. 1.45 లక్షలు
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు - రూ. 3 లక్షలు

కుటుంబ ఆర్థిక లక్ష్యాలు:

  • వచ్చే సంవత్సరం కుటుంబం అంతా కలిసి విహార యాత్రకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకోసం రూ. 1.5లక్షలు ఖర్చవుతుంది.
  • పిల్లల ఉన్నత విద్యకు అవసరమైన డబ్బును సమకూర్చుకోవాలి.
  • శ్రీజకు 23ఏళ్లు వచ్చే సరికి ఆమె వివాహం కోసం రూ. 15 లక్షలు జమ చేయాలి.
  • ఉద్యోగ విరమణ తర్వాత మంచి జీవితం గడిపేందుకు పదవీవిరమణ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేస్తారనుకుంటే 7శాతం ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే అప్పటికి వారికి నెలకు రూ.50 వేలు అవసరమవుతుంది.

నిపుణుల సూచనలు:

రామకృష్ణ, విమల ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కొన్ని ఆర్థిక విషయాల్లో సరైన ప్రణాళిక కోసం ఆర్థిక ప్రణాళిక నిపుణులను సంప్రదించారు. సుదీర్ఘ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుటుంబ ఆదాయం, పొదుపు, పదవీ విరమణ వంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచించిన ప్రణాళిక చూద్దాం.

అత్యవసర నిధి:

అత్యవసరాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. అందుకోసం 3 నుంచి 6 నెలల ఖర్చులను తట్టుకునే విధంగా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఇందుకోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉన్న రూ. 3 లక్షల్లోంచి రూ. 2 లక్షలను అత్య‌వ‌స‌ర నిధి కింద కేటాయించుకుంటే మంచిది.

బీమాలో మార్పుచేర్పులు:

రామకృష్ణకు ఇప్పటికే టర్మ్‌ పాలసీ ఉంది. అతని ఆదాయం, కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంకా రూ. 12 లక్షల టర్మ్‌ పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. విమల కూడా సంపాదిస్తూ కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా ఉన్నందువల్ల ఆమె సైతం రూ. 26 లక్షల టర్మ్‌ పాలసీని తీసుకోవాల్సిందిగా సూచించడమైనది. అదనంగా తీసుకోవాల్సిన ఈ రెండు బీమా పాలసీల ప్రీమియం కోసం సంవత్సరానికి రూ. 7600 అవసరం అవుతుంది.

రామకృష్ణ కుటుంబానికి రూ.3 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా ఉంది. దీనికి మరో రూ. 2 లక్షలు జతచేసి రూ. 5 లక్షలకు ఆరోగ్యబీమాను పెంచుకుంటే మంచిది. ఇందుకోసం ప్రీమియం రూపంలో సంవత్సరానికి రూ. 3600 వరకూ ఖర్చవుతుంది.
వివిధ అవసరాల దృష్ట్యా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కనుక వ్యక్తిగత ప్రమాద బీమా లేకపోవడం మంచిది కాదు. రామకృష్ణ రూ. 50 లక్షలకు, విమల రూ. 25 లక్షలకు వ్యక్తిగత ప్రమాద బీమాను కలిగి ఉండాల్సిందిగా సూచించడమైంది. వీటి ప్రీమియం సంవత్సరానికి రూ. 11 వేల వరకూ అవుతుంది.

పిల్లల విద్యా, వివాహ నిధి:

ప్రస్తుత విద్యా వ్యవస్థను విశ్లేషిస్తే ఏటా 8% చొప్పున చదువుల ఖర్చులు పెరుగుతున్నాయి. శ్రీజ, అర్జున్‌ విద్య కోసం రూ. 1,01,72,407 అవసరం అవుతుంది. శ్రీజ వివాహ సమయానికి రూ. 55,50,027 అవసరం అవుతుంది. ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు 12 శాతం రాబడి ఆర్జించే బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో ప్రతినెలా రూ. 24,331 పెట్టుబడులు పెట్టాల్సిందిగా సూచించడమైనది. ఈ పెట్టుబడులను ఏటా 10శాతం పెంచుకుంటూ పోవాలి.

పదవీ విరమణ నిధి:

ఏ ఉద్యోగి అయినా పదవీ విరమణ సమయానికి అత్యున్నత జీవిత ప్రమాణాలతో ఉంటారు. ఆ విధంగా చూస్తే రామకృష్ణ కుటుంబానికి పదవీ విరమణ తర్వాత ప్రస్తుతం నెలకు రూ. 50వేలు అవసరం అవుతుంది.
ద్రవ్యోల్బణాన్ని 7 శాతంగా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ. 4,18,12,226 పదవీ విరమణ నిధి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మ్యూచువల్‌ ఫండ్లు, షేర్ల పెట్టుబడులు రూ. 39,70,509 ఆదాయం సమకూరుస్తాయి. పీఎఫ్‌ ఖాతా ద్వారా రూ. 1,17,00,252 జమ అవుతుంది. ఇవి పోనూ ఇద్దరూ ఇంకా రూ. 2,61,41,465 జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 12 శాతం రాబడి వచ్చే బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సూచించడమైనది. ప్రతి నెలా రూ. 10,583 ఫండ్లలో పెట్టుబడి పెడుతూ, ఈ మొత్తాన్ని ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ పోవాలి.

విహార యాత్ర :

ప్రస్తుతం ఉన్న ఆదాయం, ఆర్థిక స్థితి ఆధారంగా విహార యాత్రను ఒక సంవత్సరం వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించడమైంది. ఇందుకోసం అయ్యే ఖర్చుల కోసం బ్యాంకు పొదుపు ఖాతాలో నుంచి రూ. 50 వేలను, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి రూ. 1 లక్షను వాడుకోవాల్సిందిగా సూచించడమైనది.

Comments

1
Narasimharao:

Hi I want to meet a good financial analyst in Hyderabad please suggest who are best for this.

Thanks,
Narasimha
(rao.mynampati@gmail.com)

ప్రత్యుత్తరం Narasimharao

Thank you for submitting your comment. We will review it, and make it public shortly

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly