ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ అంటే ఏమిటి?

ఒక ఇంటిని కొనుగోలు చేయాల‌న్నా, విక్ర‌యించాలన్నా ఆక్యుపేష‌న్ స‌ర్టిఫికేట్ అవ‌స‌రం

ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ అంటే ఏమిటి?

ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేసేప్పుడు ముందుగా ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్‌ను తీసుకోవాలి. అస‌లు ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ అంటే ఏమిటి? ఎందుకు తీసుకోవాలి? త‌దిత‌ర వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ ను స్థానిక ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ అధికారులు జారీచేస్తారు. ఒక భ‌వ‌నం దానికి నిర్ధేశించిన ప‌రిధిలో, ఆమోదించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం, స్థానిక చ‌ట్టాల‌కు అనుగుణంగా నిర్మిత‌మైందా లేదా అనే అంశాల ద్వారా ఈ స‌ర్టిఫికేట్‌ను జారీ చేస్తారు.

భ‌వ‌న నిర్మాణానికి వ‌ర్తించే బిల్డింగ్ కోడ్‌ల‌ను అనుస‌రించి, సాధార‌ణ నియ‌మాల‌కు, చ‌ట్టాల‌కు అనుగుణంగా భ‌వ‌న నిర్మాణం జ‌రిగింది అని ధ్రువీక‌రించే ప‌త్రం. ఒక‌సారి నిర్మాణం పూర్తైతే ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ (ఓసీ)ను పొంద‌డం క‌ట్ట‌డం నిర్మాణ‌దారుని భాద్య‌త‌. మంచినీరు, శానిటేష‌న్‌, విద్యుత్ క‌న‌క్ష‌న్లు వంటి వాటికి ఇది అవ‌స‌రం అవుతుంది.
ఆస్తిపై చట్టపరమైన హోదాను బలపరిచేందుకు గృహ యజమానులకు ఆక్యుపేష‌న్ స‌ర్టిఫికేట్ అవ‌స‌రం. ఓసీ లేక‌పోతే స్థానిక మున్సిప‌ల్ కార్యాల‌య అధికారులు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు.గృహ రుణం పొందాల‌న్నా ఒసీ అవ‌స‌రం. మీ పాత బిల్డింగ్‌ను కొనాల‌న్నా అమ్మాల‌న్నా కూడా ఓసీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ ను పొంద‌డం ఎలా?

బిల్డింగ్ నిర్మాణం పూర్త‌య్యే 30 రోజుల‌లో భ‌వ‌ణ నిర్మాణదారుడు ఓసీని ద‌ర‌ఖాస్తు చేయాలి. ఆస్తి య‌జ‌మానిగా మీరు కూడా స్థానిక మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఓసీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌మాణాల ప్ర‌కారం నిర్మాణం పూర్తిచేస్తే ద‌ర‌ఖాస్తు చేసిన 30 రోజుల‌లోపు ఓసీని పొందుతారు.

ద‌ర‌ఖాస్తు చేసేందుకు కావ‌ల‌సిన ప‌త్రాలు:
• నిర్మాణ‌ ప్రారంభ ప్రమాణపత్రం
• నిర్మాణ‌ పూర్తి ప్రమాణపత్రం
• అగ్ని, కాలుష్యం కోసం ఎన్ఓసీలు
• తాజా ఆస్తి పన్ను రసీదు
• భవన నిర్మాణం కోసం మంజూరు చేసిన ప్రణాళిక కాపీ

ఆస్తి య‌జ‌మానిగా మీ హ‌క్కు:
భ‌వ‌న నిర్మాణ‌దారుడు (డెవ‌ల‌ప‌ర్‌) ఓసీని ఇచ్చేందుకు నిరాక‌రించిన‌, భ‌వ‌న నిర్మాణం పూర్తైన‌ప్ప‌టికీ ఓసీ పొంద‌క‌పోయినా, డెవ‌ల‌ప‌ర్‌కు వ్య‌క్తిరేకంగా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. చట్టపరమైన నోటీసు జారీ చేయవచ్చు, వినియోగదారుని(కన్స్యూమర్ ) కోర్టులో కేసు ఫైల్ చేయ‌వ‌చ్చు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ -ఆర్ఈఆర్ఏ) వంటి చట్టాల రాక‌తో పార‌ద‌ర్శ‌క‌త పెరిగిన‌ప్ప‌టికీ ఆస్తి యజమానులుగా మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆక్యుపేష‌న్ స‌ర్టిఫికేట్‌ వంటి ముఖ్యమైన పత్రాలు ఆస్తిపై మీ హక్కులను సురక్షితంగా ఉంచుతాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly