ధ‌ర తక్కువ ఉంద‌ని బంగారం కొనేస్తున్నారా?

ప్ర‌భుత్వం అందించే ప‌సిడి బాండ్లు, ఈటీఎఫ్‌, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబ‌డులు సురక్షితంగా ఉంటాయి.

ధ‌ర తక్కువ ఉంద‌ని బంగారం కొనేస్తున్నారా?

గ‌త కొన్ని నెల‌లుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఫిబ్ర‌వ‌రి 1 న‌ ప‌దిగ్రాముల బంగారం ధ‌ర రూ.33,262 గా ఉంటే మార్చి 28 నాటికి అది రూ.31,854 కి చేరింది. ఈ మ‌ధ్య కాలంలో 4 శాతం వ‌ర‌కు బంగారం ధ‌ర దిగొచ్చింది. అదే స‌మ‌యంలో అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర మాత్రం స్వ‌ల్పంగా 1 శాతం మాత్ర‌మే త‌గ్గింది. బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డంతో ఎక్కువ మంది బంగారం కొనేందుకు మొగ్గుచూపుతారు. అయితే ధ‌ర త‌గ్గింది క‌దా అని వెంట‌నే కొనుగోలు చేయ‌డం మంచిది కాదంటున్నారు ఆర్థిక నిపుణ‌లు. ముందుగా ధ‌ర త‌గ్గ‌డానికి కార‌ణాలేంటో తెలుసుకోవాలి.

రూపాయి విలువ‌:

దేశంలో బంగారాన్ని ఎక్కువ‌గా దిగుమ‌తి చేసుకుంటారు. అంటే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు డాల‌ర్ల రూపంలో చెల్లిస్తున్నాం. ఎప్పుడైదే డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ బ‌ల‌హీన‌ప‌డుతుందో దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయి. రూపాయి బ‌ల‌ప‌డితే ధ‌ర‌లు తగ్గుతాయి. దేశీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ధ‌ర‌ల్లో మార్పు వ‌చ్చింది అది కూడా రూపాయి బ‌ల‌ప‌డ‌టం వ‌ల‌నే అని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ విశ్లేష‌కులు చెప్పారు. గ‌త కొన్ని వారాల్లో దేశీయ మార్కెట్ల‌లోకి పెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. దీంతో రూపాయి బ‌ల‌ప‌డుతోంది. అంత‌ర్జాతీయంగా ప‌సిడి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొన‌సాగుతున్నాయి.

గ‌తేడాది సెప్టెంబ‌ర్-అక్టోబ‌ర్ కాలంలో రూపాయి విలువ భారీగా క్షీణించి రూ.74.38 కి చేరింది. దీంతో బంగారం ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఆరేళ్ల గ‌రిష్ఠ స్థాయికి చేరాయి. మార్చి 28 న రూపాయి విలువ తిరిగి రూ.69.03 కి చేరింది. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి రూపాయి విలువ 3.85 శాతం పెరిగింది. అదే స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు 4.23 శాతం త‌గ్గాయి.

అయితే ప్ర‌స్తుతం రూపాయి మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. దీంతో బంగారం ధ‌ర‌లు కూడా స్థిరంగా ఉండొచ్చ‌ని చెప్తున్నారు. ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం కూడా త‌క్కువే. మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు బంగారం ధ‌ర ప‌దిగ్రాముల‌కు రూ.33,000 నుంచి రూ.33,500 కంటే ఎక్కువ‌గా పెర‌గ‌క‌పోవ‌చ్చు. అయితే దీర్ఘ‌కాలంలో ఎలా ఉంటాయ‌న్న‌ది అంత‌ర్జాతీయ పరిస్థితుల‌ను బ‌ట్టి ఉంటుంది కాబ‌ట్టి క‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేమ‌ని చెప్తున్నారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ప‌రిస్థితులు, బ్రెగ్జిట్ వంటి అంశాలు ప్ర‌భావం చూపిస్తాయి.

మీరు కొంటున్నారా?

బంగారం ధ‌ర‌పై ఆధార‌ప‌డి కొనుగోలు చేయాల‌నుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. పెట్టుబ‌డులను రీబ్యాలెన్స్ చేసుకున్న‌ట్లుగా బంగారం విష‌యంలో కూడా పెట్టుబ‌డుల‌ను బ్యాలెన్స్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబ‌డుల్లో బంగారంపై 5-10 శాతం కంటే ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు.

పోర్ట్‌ఫోలియోలో ప‌సిడి పెట్టుబడులు కూడా భాగం కావాలి. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా రెగ్యుల‌ర్‌గా కొనుగోలు చేస్తుండాలి. ఆర్‌బీఐ ప్ర‌వేశ‌పెట్టిన సార్వభౌమ ప‌సిడి బాండ్ల ద్వారా పెట్టుబ‌డులు పెట్ట‌డం స‌రైన నిర్ణ‌యమ‌ని సూచిస్తున్నారు. దీంతో గోల్డ్‌ను బాండ్ల‌ రూపంలో కొనుగోలు చేయ‌వ‌చ్చు . వార్షికంగా వ‌డ్డీ 2.5 శాతం అందిస్తారు. ఇత‌ర ప‌ద్ద‌తుల్లో అంటే ఈటీఎఫ్ లేదా డిజిట‌ల్ గోల్డ్ రూపంలో కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. దీంతో భ‌ద్ర‌త ఉంటుంది. అయితే స్వ‌ల్ప కాలిక మార్పుల‌తో పోర్ట్ఫోలియోలో స‌వ‌ర‌ణ‌లు చేయ‌డం మంచిది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly