అద్దె ర‌శీదులు ఒక్క‌టే చూపించి హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోలేరు!

హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకునేందుకుగాను ప‌న్ను చెల్లింపుదార్లు ర‌శీదుల‌తో పాటు ఇత‌ర ఆధారాల‌ను ఇవ్వాల్సి రావ‌చ్చు.

అద్దె ర‌శీదులు ఒక్క‌టే చూపించి హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోలేరు!

న‌కిలీ ర‌శీదుల‌తో ఇంటి అద్దె అల‌వెన్సు(హెచ్ఆర్ఏ)పై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవాలనుకోవ‌డం ఇప్పుడంత సుల‌భం కాదు. ప‌న్ను చెల్లించేవారు త‌మ త‌ల్లి, తండ్రి, భార్య లేదా స‌మీప బంధువుకు అద్దె చెల్లిస్తున్న‌ట్టుగా న‌కిలీ ర‌శీదుల‌ను సృషిస్తే మాత్రం వారికి ఆశాభంగ‌మే ఎదుర‌వుతుంది. ముంబ‌యి ఇన్‌క‌మ్ ట్యాక్స్ అప్పీలెట్ ట్రిబ్యున‌ల్ ఇటీవ‌ల ఇచ్చిన తీర్పు ప్ర‌కారం ఇలా చేయ‌డం కుద‌రదు. హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకునేందుకుగాను ప‌న్ను చెల్లింపుదార్లు ర‌శీదుల‌తో పాటు ఇత‌ర ఆధారాల‌ను ఇవ్వాల్సి రావ‌చ్చు.

ఇలా న‌కిలీ ర‌శీదులతో హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకునేవారి ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఆదాయ‌పు ప‌న్ను అధికారుల‌కు స‌రైన మార్గ‌ద‌ర్శ‌కాలు లేవు. అయితే ముంబ‌యి అప్పీలేట్ ట్రిబ్యున‌ల్ ఇచ్చిన తీర్పుతో వారికి ఇలాంటి కేసుల‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలో బోధ‌ప‌డింది. ప‌న్ను చెల్లింపుదారులు ప‌న్ను ఆదా చేసుకునేందుకే ఇలా న‌కిలీ ర‌శీదుల‌ను సృష్టించుకుంటూ ఉంటారు. ఇది చాలా సంద‌ర్భాల్లో బ‌య‌ట ప‌డింది కూడా. ముంబ‌యిలో జ‌రిగిన య‌థార్థ‌ సంఘ‌ట‌న‌…ఒక కేసులో సీనియ‌ర్ ఫైనాన్స్‌, అకౌంట్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేస్తున్న మ‌హిళ దాదాపు రూ.7.3ల‌క్ష‌ల హెచ్ఆర్ఏను క్లెయిం చేసుకున్నారు. ఇది 2009-10 నుంచి 2011-12 అసెస్‌మెంట్ సంవ‌త్స‌రాల‌కుగాను ఆమె క్లెయిం పెట్టుకున్నారు. ఆమెకు త‌న భ‌ర్త‌తో క‌లిసి ఒక డ‌బుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఉంది. ఆమె త‌ల్లిగారికి సంబంధించిన‌ సొంత ఇంట్లో తాను, త‌న భ‌ర్త నివాస‌ముంటూ త‌ల్లిగారికి నెల‌నెలా అద్దె చెల్లిస్తున్నామ‌ని అందుకు సంబంధించిన అద్దె ర‌శీదుల‌ను కూడా ప‌న్ను అధికారుల‌కు స‌మ‌ర్పించింది. ఆమె క్లెయిమ్‌ను అసెసింగ్ అధికారి తిర‌స్కించారు. కేసు ముంబ‌యి ట్రిబ్యున‌ల్‌కు వెళ్లింది. అద్దె ర‌శీదు త‌ప్ప చెల్లింపు చేసిన‌ట్టుగా ఆమె ఎటువంటి ఆధారాల‌ను చూపించ‌లేకపోయారు. దీంతో ముంబ‌యి కోర్టు ఆమెకు వ్య‌తిరేకంగా తీర్పు వెలువ‌రించింది. లైసెన్స్ అగ్రిమెంట్ కానీ, ఇంట్లో అద్దెకుంటున్న‌ట్టు సొసైటీ వారికి లేఖ కానీ, బ్యాంకులో చెల్లించిన‌ట్టుగా ఆధారాలు కానీ, క‌రెంటు, నీటి బిల్లుల చెల్లింపులు లాంటివేవీ ఆమె కోర్టుకు స‌మ‌ర్పించ‌లేక‌పోయారు. ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి సొంత ఫ్లాట్‌లోనే ఉంటోంది. పైగా ఇదే చిరునామాతో రేష‌న్‌కార్డు, బ్యాంక్ ఖాతా, ఆదాయ‌పు ప‌న్ను అన్నీ ఈ ఇంటి చిరునామాతోనే ఉన్నాయి. ఇంటి అద్దె తీసుకున్న‌ట్టుగా చెబుతున్న ఆమె త‌ల్లిగారు కూడా 6ఏళ్లుగా ఎటువంటి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌లేదు. వాస్త‌వానికి రిట‌ర్నులు ఫైల్‌ చేయాలి. ఇలా చేయ‌వ‌చ్చు - మీరు మీ త‌ల్లి, తండ్రి, భార్య లేదా స‌మీప బంధువు ఇంట్లో అద్దెకు ఉంటున్న‌ట్టుగా ఆధారం ఉండాలి. ఇందుకోసం ఇరు వ‌ర్గాలు అద్దె ఒప్పందాన్ని కుదుర్చుకోవ‌చ్చు. ఇంటిని సొంతం చేసుకున్న‌వారు మీకు అద్దెకు ఇచ్చిన‌ట్టుగా ఇ-మెయిల్ లో ఏదైనా సంభాష‌ణ లాంటిది పెట్టుకోవ‌డం మంచిది. న‌గ‌దు రూపంలో అద్దె చెల్లిస్తే దాన్ని నిరూపించ‌డం క‌ష్టం. కాబ‌ట్టి మీ ఇంటి యాజ‌మాని అంటే ఇక్క‌డ స‌మీప బంధువుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో అద్దె జ‌మ‌చేయండి. అద్దెను అందుకునేవారు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసుకునేలా చూడండి. రిట‌ర్నుల్లో భాగంగా అద్దె ర‌శీదుల‌ను కూడా చూపించ‌మ‌ని చెప్పండి.

వివాహిత మ‌హిళ‌లైతే…

వివాహిత మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌, కూతురుతోనే నివాస‌ముంటూ ఆమె త‌ల్లికి అద్దె చెల్లించి హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకుంటామంటే కుద‌రదు.

చిరునామాల‌న్నీ ఒక‌టే అవ్వాలి…

రేష‌న్‌కార్డు, బ్యాంకు స్టేట్‌మెంట్‌, ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల్లో అన్ని చిరునామాలన్నీ మీరు అద్దెకుంటున్న ఇంటితో స‌రిపోలాలి. అలా లేక‌పోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆదాయ‌పు ప‌న్నుశాఖ అధికారులు ఇలాంటి కేసుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తారు.

సొంతిల్లు ఉన్నా అద్దెకుంటున్నారా…

మీరు ఉంటున్న న‌గ‌రంలోనే మీకంటూ సొంత ఇల్లు ఉండి మ‌రొక ఇంట్లో అద్దెకుంటే అలాంటి అద్దెపై హెచ్ఆర్ఏను క్లెయిం చేసుకోలేరు. సొంత ఇల్లు ఉండ‌గా అద్దె ఇంట్లో ఉండాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని అడిగితే స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

న‌గ‌రం వెలుప‌ల సొంతిల్లు ఉంటే…

  • సొంతిల్లు ఉన్న‌వారికి ఒక మిన‌హాయింపు ఉంది. వారు ప‌నిచేసే చోటు న‌గ‌రం బ‌య‌ట ఉండి, అద్దెకు నివ‌సించే ఇల్లు కూడా న‌గ‌రం వెలుప‌ల ఉంటే మాత్రం హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవ‌చ్చు.
  • ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి బంజారా హిల్స్‌లో ప‌నిచేస్తూ స‌మీపంలోనే అద్దెకుంటున్నాడ‌నుకుందాం. ఆ వ్య‌క్తికి శంషాబాద్‌లో సొంతిల్లు ఉంది. అప్పుడు స‌ద‌రు వ్య‌క్తి తాను చెల్లించే అద్దెపై హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

గృహరుణ వాయిదాలు క‌డుతుంటే…
గృహ‌రుణం వాయిదాల‌పై ప‌న్ను ఆదా కోసం క్లెయిం చేసుకుంటున్న‌ట్ట‌యితే హెచ్ఆర్ఏను క్లెయిం చేసుకోలేరు. అయితే రెండు సంద‌ర్భాల‌కు క్లెయిం చేసుకోవ‌డం ఎప్పుడు సాధ్య‌మ‌వుతుందంటే మీ సొంతిల్లు …మీరు అద్దెకు నివ‌సిస్తున్న గృహం రెండు వేరు వేరు న‌గ‌రాల్లో లేదా ప‌ట్ట‌ణాల్లో ఉండాలి.

మార్కెట్ విలువ‌కు మించ‌కూడ‌దు…

  • చెల్లించే అద్దె అక్క‌డి మార్కెట్ విలువ‌కు మించ‌కూడ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు సోమాజిగూడ‌లో ఉంటూ ఒక సింగిల్‌ బెడ్‌రూమ్ ఇంటికి రూ.35వేలు అద్దె చెల్లిస్తున్నార‌నుకుందాం.
  • అంత అద్దె ఆ ప్రాంతంలో ఉండ‌ద‌ని ప‌న్ను అధికారికి ఇట్టే తెలిసిపోతుంది. కాబ‌ట్టి మీ హెచ్ఆర్ఏ క్లెయిమ్‌ను తిర‌స్క‌రించ‌వ‌చ్చు.

మీరు ఏదైనా సొసైటీలో ఉన్న ఫ్లాట్‌లో ఉంటున్న‌ట్ట‌యితే… అది మీ స‌మీప బంధువుకు చెందిన ఫ్లాట్ అయి ఉంటే త‌ప్ప‌కుండా ఆ సొసైటీ కార్య‌ద‌ర్శికి మీరు అద్దెకున్న విష‌యాన్ని సూచ‌న‌ప్రాయంగా తెలియ‌జేయ‌డం మంచిది. భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly