ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవ‌నానికి మెరుగైన ప్ర‌ణాళిక

తగినంత ఆదాయ వనరు ఏర్పాటుచేసుకోకపోతే , పదవీవిరమణ అనంతర కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవ‌నానికి మెరుగైన ప్ర‌ణాళిక

జీవితంలో పదవీవిరమణ అనంతర కాలం అద్భుత సమయం. పనిచేస్తున్న రోజులలో పని ఒత్తిడిలో చేయలేని అభిరుచులు, హాబీలను పూర్తి చేసుకునేందుకు కావలసినంత సమయం ఉంటుంది . అయితే ఇదే సమయంలో ఆదాయం లేకపోయినా , ఖర్చులు అంతే ఉండొచ్చు లేదా పెరగొచ్చు. తగినంత ఆదాయ వనరు ఏర్పాటుచేసుకోకపోతే , పదవీవిరమణ అనంతర కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి .

చాలా మంది పదవీవిరమణ అనంతర ఆదాయం విషయంలో ఉదాసీనత వహిస్తారు. పదవీవిరమణ పోర్ట్ ఫోలియో నిర్వహణలో సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (SWP ) కన్నా బకెట్ విధానం మెరుగైనదని నిపుణుల అభిప్రాయం. ఇందులో అందరికీ ఒకేవిధానం కాకుండా , మూడు కాల అవధులకు లేదా బకెట్ లకు వైవిధ్యమైన పోర్ట్ ఫోలియో తయారు చేసుకోవచ్చు .

  1. పదవీవిరమణ అనంతర 5-10 ఏళ్ల కాలం
  2. ఆ తరువాతి 5-10 ఏళ్ల కాలం
  3. ఆ తరువాతి మిగిలిన కాలం
    బకెట్ విధానంలో పదవీవిరమణ నిధి అంతా ఒకేసారి అవసరం ఉండదు కాబట్టి, బకెట్ కాలాలను బట్టి పోర్ట్ ఫోలియో లను తయారుచేసుకోవచ్చు. మొదటి 5-10 ఏళ్ల కాలానికి అవసరమైన డబ్బును , అసలు నష్టపోని సంప్రదాయ పెట్టుబడులు చేయొచ్చు. రెండవ బకెట్ కాలంలో డబ్బు అవసరానికి 5-10 ఏళ్ల సమయం వుంటుంది కాబట్టి , అందుకోసం గ్రోత్ , ఇన్‌క‌మ్‌ అసెట్స్ లో పెట్టుబడి చేయొచ్చు. ఇక మూడవ బకెట్ కాలానికి 10-20 ఏళ్ల సమయం ఉంటుంది కాబట్టి, ఈ సమయానికి కావలిసిన డబ్బును అధిక వృద్ధి , రాబడి నిచ్చే పథకాలలో పెట్టుబడి చేయొచ్చు .

మొదటి 5-10 ఏళ్ల కాలానికి అవసరమైన డబ్బును స్వల్పకాలిక డెట్ పెట్టుబడులైన ఫిక్సెడ్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి చేయాలి. అధిక రిస్క్ గల పెట్టుబడులలో పెట్టరాదు. రెండవ బకెట్ కాలానికి పెట్టుబడులను డెట్ , ఈక్విటీ ల కలయికతో చేయొచ్చు. డెట్ కోసం షార్ట్ టర్మ్ లేదా మీడియం టర్మ్ డెట్ ఫండ్స్, అలాగే ఈక్విటీ ల కోసం బ్యాలన్సుడ్ అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. డబ్బు అవసరానికి సమయం ఉంటుంది కాబట్టి, మధ్యలో మార్కెట్ లు పడిపోయినా , పుంజుకోవడానికి సమయం ఉంటుంది. అయితే నేరుగా షేర్లలో పెట్టుబడి చేయకూడదు.

మూడవ బకెట్ లో 10-20 ఏళ్ల అధిక సమయం ఉంటుంది కాబట్టి, మొత్తం కాకపోయినా , ఎక్కువ ఈక్విటీలలో పెట్టుబడి చేయొచ్చు. దీనికోసం లార్జ్ కాప్, మల్టీ కాప్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. పేరున్న మ్యూచువల్ ఫండ్స్ నుంచి 3-4 స్కీం లలో పెట్టుబడి చేయొచ్చు. దీనివలన పెట్టుబడులలో వైవిధ్యం వుంటుంది . అయితే ఈ విధానంలో ఇబ్బందులు కూడా ఉంటాయి . వయసు పెరిగే కొద్దీ అనుకోని ఖర్చులు పెరగవచ్చు, మీ రిస్క్ తీసుకునే సామర్ధ్యం తగ్గడం వంటివి జరగొచ్చు. వీటి ఆధారంగా మీ ఆర్ధిక స్థితిని , మార్కెట్ లో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని , మీ పోర్ట్ ఫోలియో బకెట్ లను 5-10 ఏళ్లకు మార్పులు చేసుకోవాలి .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly