కొత్త నిబంధనల ప్రకారం అపార్టుమెంట్ల‌పై ఎంత జీఎస్‌టీ చెల్లించాలి?

ఏప్రిల్1 త‌రువాత ప్రారంభించిన ప్రాజెక్టుల‌కు త‌ప్ప‌నిస‌రిగా కొత్త రేట్ల ప్ర‌కార‌మే ప‌న్ను చెల్లించాలి

కొత్త నిబంధనల ప్రకారం అపార్టుమెంట్ల‌పై ఎంత జీఎస్‌టీ చెల్లించాలి?

అంద‌రికీ ఇళ్ళు అనే నినాదంతో కేంద్ర ప్ర‌భుత్వం పీఎమ్ఏవై(ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌) కింద క్రెడిట్ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది . నిర్మాణంలో ఉన్న గృహాలపై వ‌డ్డీ రేటులో స‌బ్సిడి, జీఎస్‌టీ త‌గ్గింపు వంటివి అందిస్తుంది. సిద్దంగా ఉన్న ఇళ్ళ‌పై జీఎస్‌టీ చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.

ప్ర‌భుత్వం ఏప్రిల్ 1,2019 నుంచి, జీఎస్‌టీ త‌గ్గింపు రేట్ల‌ను అమ‌లు చేసేందుకు బిల్డ‌ర్ల‌ను అనుమ‌తించింది. అయితే దీనిపై వ‌చ్చే ప‌లు సందేహాలు వాటికి స‌మాధానాలు ఇప్పుడు చూద్దాం.

  1. నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియ‌ల్ అపార్ట‌మెంటుపై జీఎస్‌టీ రేట్లు ఏవిధంగా వ‌ర్తిస్తాయి?

నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియ‌ల్ అపార్టెమెంట్ల‌పై , రియ‌ల్ ఎస్టేట్ ప్రమోట‌ర్లు ఏప్రిల్ 1,2019 నుంచి వ‌ర్తింపజేసే జీఎస్‌టీ రేట్లు వివ‌రాలు
gst.jpg

పైన పేర్కొన్న‌ రేట్లు ఏప్రిల్ 1, 2019, ఆత‌రువాత ప్రారంభ‌మైన ప్రాజెక్టుల‌కు, ఏప్రిల్ 1కి ముందు ప్రారంభ‌మై, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టుల‌కు వ‌ర్తిస్తాయి. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల‌కు బిల్డ‌ర్ పాత రేట్ల ప్ర‌కారం జీసీటీ ప‌న్ను చెల్లించే అవ‌కాశం కూడా ఉంది. అంటే స‌ర‌స‌మైన నివాస‌యోగ్య‌మైన అపార్ట్‌మెంట్ల‌కు 8 శాతం, మిగిలిన నివాస‌యోగ‌మైన అపార్టుమెంట్ల‌కు 12 శాతం జీఎస్‌టీ చెల్లించ‌వ‌చ్చు.

  1. స‌ర‌స‌మైన నివాస‌యోగ‌మైన(అఫ‌ర్డ‌బుల్ రెసిడెన్షియ‌ల్‌) అపార్టుమెంట్ అంటే ఏమిటి?

మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల‌లో కార్పట్ ఏరియా 60 చ‌ద‌ర‌పు మీట‌ర్లు ఉన్న అపార్టుమెంట్ల‌ను, న‌గ‌రాలు, టౌన్‌ల‌లో 90 చ‌ద‌ర‌పు మీట‌ర్ల కార్ప‌ట్ ఏరియా ఉండి, రూ. 45 ల‌క్ష‌ల కంటే త‌క్కువ విలువ ఉన్న గృహాల‌ను అఫ‌ర్డ‌బుల్ అపార్టుమెంట్లుగా ప‌రిగ‌ణిస్తారు. (మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల‌లో త‌ప్ప మిగిలిన సిటీలు లేదా టౌన్‌లు, గ్రామ‌ల‌తో స‌హా అన్ని ప్ర‌దేశాల‌కు ఇది వ‌ర్తిస్తుంది.)

బెంగుళూరు, చెన్నై, ధిల్లీ ఎన్‌సీఆర్ లో(ధిల్లీ, నొయిడా, గ్రేట‌ర్ నొయిడా, ఘ‌జియాబాద్‌, గూర్గాన్‌, ఫ‌రీదాబాద్ ల‌కు మాత్ర‌మే), హైద‌రాబాద్‌, కోల్‌క‌త్తా, ముంబాయ్‌(ఎమ్ఎమ్ఆర్ మొత్తం) వంటి న‌గ‌రాలు ప్ర‌భుత్వం సూచించిన ప‌రుధుల మేర‌కు మెట్రోపాలిట‌న్ సిటి కింద‌కు వ‌స్తాయి.

  1. ప్రామోట‌ర్ లేదా బిల్డ‌ర్ ఐటీసీతో క‌లిపి 8 శాతం, 12శాతం పాత రేట్ల ప్ర‌కారం ప‌న్ను చెల్లించే అవ‌కాశం ఉంటుందా?

అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ అవ‌కాశం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న(ఆన్ గోయింగ్‌) ప్రాజెక్టుల‌కు మాత్ర‌మే ఉంటుంది. ప్రాజెక్ట్‌ను గ‌తంలో ప్రారంభించి ప్ర‌స్తుతం ప్రాసెస్‌లో ఉంటే ప్రామెట‌ర్ లేదా బిల్డ‌ర్ ఐటీసీ క‌లిపి 8 శాతం, 12శాతం పాత రేట్ల ప్ర‌కారం ప‌న్ను చెల్లించ‌వ‌చ్చు.

పాత రేట్ల ప్ర‌కారం కొన‌సాగాలంటే బిల్డ‌ర్‌/ ప‌్ర‌మోట‌ర్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకుని సూచించిన ప్ర‌కారం మే10, 2019 లోపు జ్యూరిస్డిక్షనల్ క‌మీష‌న‌ర్‌కు మాన్యువ‌ల్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవ‌కాశం ఒక్క‌సారి మాత్ర‌మే ఉంటుంది.

ఒక‌వేళ ప్రామోట‌ర్ లేదా బిల్డ‌ర్ సూచించిన ప్ర‌కారం ఫార‌మ్ నింపి ఇవ్వ‌క‌పోతే నిర్మాణం జ‌రుగుతున్న ప్రాజెక్టుల‌కు కూడా 5 శాతం/1 శాతం చొప్పున కొత్త రేట్లు అమ‌ల‌వుతాయి. ప‌రివ‌ర్త‌న నిబంధ‌న‌ల‌తో స‌హా అన్ని కొత్త నియ‌మాలు అమ‌ల‌వుతాయి.

అయితే ఏప్రిల్1,2019కి త‌రువాత ప్రారంభించిన కొత్త ప్రాజెక్టుల‌కు మాత్రం ఈ అవ‌కాశం లేదు. వారు త‌ప్ప‌నిస‌రిగా కొత్త రేట్ల ప్ర‌కార‌మే అంటే 1 శాతం లేదా 5 శాతం (ఐటీసీ లేకుండా) ప‌న్ను చెల్లించాలి.

  1. నేను జూన్ 2018లో డ‌వ‌ల‌ప‌ర్ వ‌ద్ద ప్లాట్ బుక్ చేసుకున్నాను. మార్చి 31,2019కి ముందు ప్లాటు విలువ‌లో 40 శాతం మొత్తాన్ని బిల్డ‌ర్‌కు చెల్లించాను, మిగిలిన 60 శాతంపై ఏ జీఎస్‌టీ రేటు వ‌ర్తిస్తుంది?

బిల్డ‌ర్‌కు, కొనుగోలు దారున‌కు మ‌ధ్య ఉన్న ఎగ్రిమెంట్ ప్ర‌కారం ప్లాట్ విలువ‌లో కొంత భాగాన్ని ఏప్రిల్ 1, 2019 ముందు చెల్లించి, మిగిలిన భాగాన్ని అదే తేదీన లేదా ఆ త‌రువాత చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తే, కొత్త రేట్ల ప్ర‌కారం అంటే 1 శాతం, 5 శాతం చొప్పున జీఎస్‌టీ చెల్లించ‌వ్చు. ఒక‌వేళ బిల్డ‌ర్ పాత రేట్ల ప్ర‌కారం ప‌న్ను చెల్లించే ఆప్ష‌న్ ఎంచుకుంటే పాత రేట్లు 8 శాతం, 12 శాతం ప్ర‌కార‌మే చెల్లించాల్సి ఉంటుంది. బిల్డ‌ర్ పాత రేట్ల ప్ర‌కారం ప‌న్ను చెల్లించాలి అంటే మే10,2019 కంటే ముందుగానే ఈ ఆప్ష‌న్‌ను ఎంచుకుని ఉండాలి. ఒక‌వేళ ఈ తేది లోపుగా అత‌ను ఆప్ష‌న్ ఎంచుకుని ఉండ‌క‌పోతే కొత్త రేట్లు వ‌ర్తిస్తాయి.

  1. నేను పీఎమ్ఏవై -సీఎల్ఎస్ఎస్ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిపొందాను. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో ప్లాట్ తీసుకున్నాను. కార్పెట్ ఏరియా 150 చ‌ద‌ర‌పు మీట‌ర్లు, నేను కొత్త రేటు ప్ర‌కారం 1 శాతం ప‌న్ను చెల్లించేందుకు అర్హుడ‌నా… కాదా?

కొత్త జీఎస్‌టీ రేటు ప్ర‌కారం 1 శాతం ప‌న్ను చెల్లించేందుకు మీరు అర్హులే. అయితే మీరు ప్లాట్ బుక్ చేసుకున్న‌ డ‌వ‌ల‌ప‌ర్ లేదా ప్ర‌మోట‌ర్ పాత రేటు ప్ర‌కారం ప‌న్ను చెల్లించే ఆప్ష‌ను ఎంపిక చేసుకుంటే 8 శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

  1. నేను కొత్తగా ప్రారంభించే అపార్టుమెంటులో ప్లాట్ కొనుగోలు చేయాల‌నుకుంటున్నాను. ఈ ప్రాజెక్టును మార్చి31, 2019 త‌రువాత ప్రారంభించారు. కార్పెట్ ఏరియా 80 చ‌ద‌రపు మీట‌ర్లు, ధ‌ర 48 ల‌క్ష‌లు. ఈ అపార్ట్‌మెంటు నిర్మాణంపై ఎంత జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది?

ఏప్రిల్ 1, 2019 తేది, ఆత‌రువాత నిర్మాణం చేప‌ట్టిన అపార్ట్‌మెంటుపై కొత్త రేటు ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తిస్తుంది. మీరు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి వ‌స్తుంది.

  1. ఏప్రిల్ 1,2019 తేదీకి ముందు చెల్లించిన వాయిదాల‌కు 12 శాతం జీఎస్‌టీ ప‌న్ను చెల్లించాను. నేను ఇప్పుడు కొత్త రేట్లు1 శాతం, 5 శాతం(ఐటీసీ లేకుండా) ప్ర‌యోజ‌నాల‌ను పొందాల‌నుకుంటున్నాను. కొత్త లేదా పాత‌ రేట్ల ప్ర‌కారం ప‌న్ను చెల్లించే అవ‌కాశం బిల్డ‌ర్‌, కొనుగోలు దారుల‌లో ఎవ‌రికి ఉంటుంది?

కొత్త లేదా పాత రేట్ల ప్ర‌కారం ప‌న్ను చెల్లించే ఆప్ష‌న్ కొనుగోలు దారునికి ఉండ‌దు. ఈ అవ‌కాశం బిల్డ‌ర్‌కు మాత్ర‌మే ఉంటుంది. ఒక‌వేళ బిల్డ‌ర్ నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటుకు పాత రేటు ప్ర‌కారం ప‌న్ను చెల్లించాల‌నుకుంటే 10 మే, 2019లోప‌లే ఆప్ష‌న్ ఎంచుకుని ఉండాలి. ఒక‌వేళ ఎంచుకోక‌పోతే ఏప్రిల్ 1, 2019 తేది, ఆత‌రువాత చెల్లించే వాయిదాల‌పై కొత్త ప‌న్ను రేటు ప్ర‌కారం అందుబాటులో ఉండే రెసిడెన్షియ‌ల్ అపార్టుమెంట్ లేదా అందుబాటులో లేని రెసిడెన్షియ‌ల్ అపార్టుమెంట్ అనే దానిపై ఆధార‌ప‌డి 1 శాతం లేదా 5 శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

  1. ఏప్రిల్ 1,2019 తేదీన లేదా ఆత‌రువాత మొద‌లుపెట్టిన కొత్త ప్రాజెక్టుల‌కు పాత రేటు(12 శాతం లేదా 8 శాతం, ఐటీసీతో) ప్ర‌కారం ప‌న్ను చెల్లించే అవ‌కాశం ఉంటుందా?

ఏప్రిల్ 1,2019 తేదీన లేదా ఆత‌రువాత నిర్మాణం చేప‌ట్టిన కొత్త రెసిడెన్షియ‌ల్ అపార్టుమెంట్ల‌కు పాత రేటు ప్ర‌కారం ప‌న్నుచెల్లించే అవ‌కాశం లేదు.

  1. కొన్ని ప్రాజెక్టుల‌ను డ‌వ‌ల‌పెర్లు మార్చి 31,2019 కంటే ముందే ప్రారంభించారు. అయితే ఆ ప్రాజెక్టుల‌కు సంబంధించి ప్లాట్ బుకింగ్స్ మొద‌లు కాలేదు. నిర్మాణం ప‌నులు మొద‌లుపెట్టి బుకింగ్స్ చేయ‌ని అపార్ట‌మెంట్ల‌కు జీఎస్‌టీ ఏవిధంగా వ‌ర్తిస్తుంది?

జూన్ 28,2017లో ఇచ్చిన నోటిఫికేష‌న్ నెం.11/2017-సీటీఆర్ ప్ర‌కారం నిర్మాణ‌పు ప‌నులు మొద‌ల‌య్యి, బుకింగ్స్ మొద‌లుకానీ ప్రాజెక్టుల‌ను ఆన్‌గోయింగ్ (ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ) ప్రాజెక్టుల కింద ప‌రిగ‌ణించ‌రు. ఏప్రిల్ 1,2019 వ తేది లేదా ఆ త‌రువాత వ‌చ్చిన కొత్త ప్రాజెక్ట్‌గా ప‌రిగ‌ణించి కొత్త రేట్ల‌(1 శాతం, 5 శాతం, ఐటీసీ లేకుండా) ప్ర‌కారం జీఎస్‌టీ ప‌న్ను విధిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly