రూపాయి క్షీణ‌త మీపై ఎలా ప్ర‌భావం చూపుతుంది?

రూపాయి విలువ త‌గ్గితే రోజువారి ఖ‌ర్చులు పెరుగుతాయి. మీ నిత్యావ‌స‌ర బ‌డ్జెట్‌ను మ‌రింత పెంచుకోవాల్సి ఉంటుంది.

రూపాయి క్షీణ‌త మీపై ఎలా ప్ర‌భావం చూపుతుంది?

రూపాయి క్షీణ‌త కార‌ణంగా ప‌రోక్షంగా మీ జేబుకు చిల్లు ప‌డుతుంద‌న్న విష‌యంపై మీకు అవ‌గాహన ఉందా? రూపాయి బ‌ల‌హీనప‌డితే కేవ‌లం విదేశీ ప్ర‌యాణాలు, విద్య‌పై కాకుండా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెరుగుతాయి. దీంతో మీ నిత్యావ‌స‌ర బ‌డ్జెట్ మ‌రింత పెంచుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గుతాయి. విదేశీ విద్య‌, ప్ర‌యాణాలు మ‌రింత ప్రియం అవుతాయి. విదేశీ విద్య కోసం ప్రణాళిక వేసేటప్పుడు అంద‌రు చేసే త‌ప్పు ద్ర‌వ్యోల్మ‌ణాన్ని విస్మరించ‌డం.

సౌదీ అరేబియా లో చ‌మురు ప్లాంట్ల‌ ఫై జరిగిన డ్రోన్ దాడి, భారత్ లో మందగించిన ఆర్ధిక పెరుగుదల, మరికొన్ని కారణాలవలన రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే పడిపోయింది. గురువారం నాటికి ఇది రూ 71. 15కి చేరింది. దీని ప్రభావం వలన దిగుమతులు ఖరీదవుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఒక‌ ఆగస్టు నెల‌లోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 3.65% క్షీణించింది. దీని ప్రభావం వలన ఈ కింది నాలుగు అంశాలపై ప్రభావం చూపుతుంది. దాని నుంచి ఎలా బయట పడాలో తెలుసుకుందాం:

విదేశీ విద్య:
చాలా మంది విద్యార్థులు ముందుగానే ప్రణాళిక వేసుకున్న‌ప్ప‌టికీ రూపాయి విలువ త‌గ్గ‌డంతో ఖ‌ర్చు మ‌రింత పెరుగుతుంది. రూపాయి విలువ త‌గ్గ‌డం అంటే ఒక డాల‌ర్ కోసం ఎక్కువ రూపాయ‌లు ఖ‌ర్చుపెట్ట‌డం. 2017 లో ఒక డాలర్ కు రూ. 65 ఉంటే , ప్రస్తుత రేట్ ప్రకారం ఇది ఒక డాలర్ కు రూ 71.15 గా ఉంది. దీని వలన అమెరికాలో చదివే దాదాపు 2,10,000 ల భారతీయ విద్యార్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ట్యూషన్ ఫీజు కాకుండా , నివసించే ప్రదేశాన్ని బట్టి జీవన వ్యయం నెలకు 600-800 డాలర్ల వరకు ఉంటుంది.

విదేశీ మారకద్రవ్యం లోని ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకుండా, రాబోయే సంవత్సరాలలో పెరుగుతున్న డాలర్ విలువకు తగిన రూపాయలను ఏర్పాటు చేసుకోలేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురైనట్లు విశ్లేష‌కులు చెప్తున్నారు. దీంతో చ‌దువును కూడా మ‌ద్య‌లో ఆపేసిన సంద‌ర్భాలు లేక‌పోలేదు.

జులై-సెప్టెంబర్ త్రైమాసికంలోనే ఫారెన్ ఎక్స్చేంజి రేట్ ఎక్కువ ఒడిదుడుకులకు లోనవటానికి ఒక కారణం విద్యార్థులు ఈ కాలంలోనే విదేశీ మారక ద్రవ్యం కొంటారు. అయితే విద్యా సంవత్సరానికి కావలసిన విదేశీ మారక ద్రవ్యాన్ని ఒకసారే కాకుండా, మిగిలిన నెలలలో కొంటే ఈ స‌మ‌స్య ఇంత‌గా ఉండ‌ద‌నేది నిపుణుల అభిప్రాయం.

ఆర్ధిక ప్రణాళిక నిపుణుల ప్రకారం విదేశీ విద్య కోసం వెళ్లే వారు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
తల్లిదండ్రులు తమ పిల్లల ఖర్చుల కోసం పంపే విదేశీ మారక ద్రవ్యాన్ని ఒకసారే కాకుండా ప్రతి త్రైమాసికం పంపడం ద్వారా తక్కువ ధరకు విదేశీ మారక ద్రవ్యాన్ని కొనవచ్చు. భ‌విష్య‌త్తులో ఖ‌ర్చుల గురించి ముందుగానే తెలిస్తే మీ అవ‌స‌రానికి త‌గిన‌ట్లుగా రూపాయి-యూఎస్ డాల‌ర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొనుగోలు చేసి గ‌డువు ముగిసేలోపు ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. డ‌బ్బు ఎప్పుడు అవ‌స‌ర‌మ‌వుతుందో ఆ కాలానుగుణంగా ఈక్విటీ స్కీముల్లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు లేదా స‌రళీకృత చెల్లింపుల విధాన (ఎల్ఆర్ఎస్) ఖాతానుప్రారంభించి పొదుపు చేయ‌వ‌చ్చు. డ‌బ్బు అవ‌స‌ర‌మైనప్పుడు ఫారిన్ క‌రెన్సీ రూపంలో బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఫ్యూచ‌ర్లు, ఎల్ఆర్ఎస్ గురించి అవ‌గాహ‌న లేక‌పోతే ఆర్థిక‌నిపుణుల స‌ల‌హా తీసుకోవాలి.

విదేశీ ప్ర‌యాణం:
సెల‌వుల్లో విదేశీ ప్ర‌యాణాలు చేయాల‌నుకుంటే రెస్టారెంట్లు, రైలు ప్ర‌యాణాలు, షాపింగ్ వంటి వాటికి డ‌బ్బులు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు డాల‌ర్ల రూపంలో వెచ్చించాలి కాబ‌ట్టి రూపాయి విలువ త‌గ్గిపోతుంది. అయితే బ‌డ్జెట్‌లో ప్ర‌యాణం పూర్తి చేయాల‌నుకుంటే కొన్ని ప్రాంతాలు చూడటాన్ని ర‌ద్దు చేసుకోవ‌డం లేదా త‌క్కువ షాపింగ్ చేసుకోవ‌డం ద్వారా స‌మ‌తుల్యం చేసుకోవాల్సి ఉంటుంది లేదా రూపాయి విలువ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌కు ప్ర‌యాణాలను ఎంచుకోవ‌డం మంచిది.

విదేశీ ప్ర‌యాణాల్లో పేమెంట్ ఆప్ష‌న్ కూడా జాగ్ర‌త్త‌గా ఎంచుకోవాలి. ఎందుకంటే మనీ ఎక్స్ఛేంజర్ల నుంచి నగదును తీసుకొని, బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించడం వల్ల 3-4% అద‌న‌పు ఛార్జీలు ఉంటాయి. మీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులు రూపాయ‌ల్లో జ‌రుగుతుంది కాబ‌ట్టి చెల్లించే స‌మ‌యానికి రూపాయి విలువ మ‌రింత త‌గ్గిపోతే ఖ‌ర్చు చేసిన‌దానికంటే చెల్లించే మొత్తం ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకే విదేశీయ ప్ర‌యాణాలో ఖ‌ర్చును అదుపులో పెట్టుకోవ‌డం కంటే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డుల‌ను తీసుకుంటే మంచిది. ఈ కార్డుల‌తో ఫారిన్ క‌రెన్సీని విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అవి ప్రీపెయిడ్ డెబిట్ కార్డుల వంటివి. ముందుగానే అందులో డ‌బ్బును లోడ్ చేస్తారు కాబ‌ట్టి ఎంత అవ‌స‌ర‌మ‌వుతుందో అంత చేసుకోవ‌చ్చు. విదేశాల్లో ఈ కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు. ఏటీఎంల నుంచి ఫారెన్స్ క‌రెన్సీని తీసుకోవ‌చ్చు. డాల‌ర్ విలువ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు మీ తిరిగి చెల్లింపుల స‌మ‌యంలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోకుండా ఉండేందుకు ఈ కార్డు ఉప‌యోగ‌ప‌డుతుంది.

చ‌మురు ధ‌ర‌లు:
రూపాయి బ‌ల‌హీన‌త సాధార‌ణంగానే చ‌మురు ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. ముడిచ‌మురు దిగుమ‌తుల ఖ‌ర్చు పెరుగుతుంది. దీంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతాయి. అంత‌ర్జాతీయ చ‌మురు ధ‌ర‌లు కూడా దేశీయ ధ‌ర‌ల‌ను ప్రభావితం చేస్తాయి. సౌదీ చ‌మురు ప్లాంట్ల‌పై డ్రోన్ల దాడి త‌ర్వాత చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. రూపాయి విలువ త‌గ్గిన కొద్దీ చ‌మురు ధ‌ర‌లు పెర‌గుతాయి. దీంతో మీ రోజువారి ఖ‌ర్చుల్లో భాగంగా పెట్రోల్, డీజిలో కోసం పెట్టుకున్న బ‌డ్జెట్ పెంచుకోవాల్సి ఉంటుంది.

ద్ర‌వ్యోల్బ‌ణం, ధ‌ర‌లు
రూపాయి క్షీణ‌త వ‌ల‌న పెరిగే ఇంధ‌న ధ‌ర‌లు నేరుగా నిత్యాస‌ర ఖ‌ర్చుల‌పై ప్ర‌భావం చూపుతాయి. త‌యారీ వ‌స్తువులు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెరుగుతాయి. పాలు, గుడ్లు, పండ్లు, కూర‌గాయాల‌పై ఈ ప్ర‌భావం ప‌డుతుంది.

అయితే ఇటీవ‌ల ప్ర‌భుత్వం మొద‌టి త్రైమాసికంలో ద్ర‌వ్యోల్బ‌ణం 3.21 శాతంగా న‌మోదైన‌ప్ప‌టికి ఆర్‌బీఐ మ‌ధ్య‌కాలిక ల‌క్ష్యం 4 శాతం కంటే త‌క్కువ‌గానే ఉండ‌టంతో ద్ర‌వ్యోల్బ‌ణం అదుపులోనే ఉన్న‌ట్లు పేర్కొంది. దీంతో ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల నిర్ణ‌యంపై ఈ ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉంటుంది.

అంటే రూపాయి విలువ బ‌ల‌హీన‌ప‌డ‌టం విదేశీ లావాదేవీల‌పైనే కాకుండా, ఇదే విధంగా కొన‌సాగితే స్థానికంగా కూడా వ్య‌యాలు పెరుగుతాయి. అందుకే ద్ర‌వ్యోల్బ‌ణానికి మించి రాబ‌డినిచ్చే పెట్టుబ‌డుల‌పై దృష్టి సారించాల‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly