ఎస్‌బీఐ అందిస్తున్న‌ 5 జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు

ఎస్‌బీఐ ఐదు ర‌కాల జీరో బ్యాలెన్స్ ఖాతాలు నిర్వ‌హిస్తుంది. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఈ ఖాతాల‌ను ఉప‌యోగించుకోవచ్చు

ఎస్‌బీఐ అందిస్తున్న‌ 5 జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎలాంటి క‌నీస నిల్వ‌లు లేకుండా నిర్వ‌హించే కొన్ని ఖాతాల‌ను ఆఫ‌ర్ చేస్తోంది. అవి ఏంటో తెలుసుకుందాం…

 1. ఎస్‌బీఐ వేత‌న ఖాతాలు (శాల‌రీ అకౌంట్స్)

ఎస్‌బీఐ త‌మ వినియోగ‌దారుల‌కోసం ప్ర‌త్యేకంగా వేత‌న ప్యాకేజ్ ఖాతాను నిర్వ‌హిస్తోంది. వివిధ రంగాల‌కు చెందిన కేంద్ర, రాష్ర్ట‌ ప్ర‌భుత్వ, ర‌క్ష‌ణ‌, పార్ల‌మెంట‌రీ, పోలీస్‌, కార్పొరేట్స్ లేదా సంస్థల‌కు సంబంధించిన ఉద్యోగులు ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. శాల‌రీ ప్యాకేజ్ అకౌంట్‌లో క‌నీస నిల్వ ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఉచిత ఏటీఎం-డెబిట్ కార్డ్‌, ఉమ్మ‌డి ఖాతా క‌లిగిన‌ వారికి అద‌నంగా మ‌రో ఏటీఎం కార్డును అందిస్తుంది. ఆన్‌లైన్ లావాదేవీల‌కు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, ఫ్రీ కోర్ ప‌వ‌ర్‌(ఇందులో SBI వారి ఏ బ్రాంచీ లో అయినా లావాదేవీలు జరపచ్చు), ఉచిత మ‌ల్టిసిటీ చెక్స్, సేవింగ్‌స్ ప్ల‌స్(ఆటో స్వీప్ సౌకర్యం తో) అందిస్తోంది. వీటికి ఎస్‌బీఐ పొదుపు ఖాతాల‌కు వ‌ర్తించే ఛార్జీలు, వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి.

 1. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ)

కేవైసీ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ఎవ‌రైనా ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. బేసిక్ సేవింగ్స్ ఖాతా మొద‌ట ఆర్థికంగా వెనుక‌బ‌డిన‌వారిని బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు ప్రోత్స‌హించ‌డం కోసం ప్రారంభించారు. ఈ ఖాతాపై రూపే ఏటీఎం కార్డ్ ఇస్తారు. ఖాతాలో క‌నీస నిల్వ‌లు లేక‌పోతే ఎలాంటి ఛార్జీలు వ‌ర్తించ‌వు. ఆన్‌లైన్ లావాదేవీల‌కు కూడా ఎలాంటి రుస‌ములు వ‌ర్తించ‌వు. డిపాజిట్లు, చెక్కులు ఉచితం. ఖాతా మూసివేసిన‌ప్పుడు కానీ, తిరిగి ఆక్టివేట్ చేసుకోవ‌డం కానీ ఉచితం. ఈ ఖాతా ప్రారంభించేందుకు ఇత‌ర పొదుపు ఖాతాలు ఉండ‌కూడ‌దు, ఒకవేళ ఉంటే బేసిక్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించిన 30 రోజుల్లోగా మూసివేయాలి. ఈ ఖాతా నుంచి నెల‌కు గ‌రిష్ఠంగా నాలుగు సార్లు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు, త‌ర్వాత అవ‌కాశ‌ముండ‌దు.

 1. చిన్న‌మొత్తాల పొదుపు ఖాతాలు

18 సంవ‌త్స‌రాలు పైబడిన‌వారు ఎవ‌రైనా ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. కేవైసీ డాక్యుమెంట్లు ఉండ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. కేవైసీ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి కావు. అయితే కేవైసి నిబంధ‌న‌లు లేనందున చాలా ర‌కాల ప‌రిమితులు ఈ ఖాతాకు ఉంటాయి. కేవైసి ప‌త్రాల‌ను అంద‌జేస్తే ఇవి సాధార‌ణ ఖాతాలుగా మార్చుకోవ‌చ్చు. ఇవి కూడా మొద‌ట ఆర్థికంగా వెనుక‌బ‌డినివారిని ప్రోత్స‌హించేందుకు ఉద్దేశించి ప్రారంభించిందే.

ఖాతా మూసివేతకు కూడా ఎలాంటి ఛార్జీలు లేవు. ఇందులో గ‌రిష్ఠంగా రూ.50 వేల వ‌ర‌కు పొదుపు చేయ‌వ‌చ్చు. రూపే-ఏటీఎం కార్డును ఉచితంగా అందిస్తారు. క‌నీస నిల్వ‌లు లేక‌పోతే ఎలాంటి రుసుములు విధించ‌రు. లావ‌దేవీల‌కు ఎలాంటి ఛార్జాలు లేవు. కేవైసీ వివ‌రాలు మొత్తం అందిస్తే ఖాతాదారుని ఇష్టానుసారం చిన్న పొదుపు ఖాతాలు, బీఎస్‌బీడీ ఖాతాలు సాధార‌ణ ఖాతాలుగా మార్చుకోవ‌చ్చు. దీనికి ఖాతా ఉన్న‌ బ్యాంకు శాఖ‌కు వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. పొదుపు ఖాతాలపై ఉన్న వ‌డ్డీ రేట్ల‌ను వీటికి వ‌ర్తింప‌జేస్తారు.

 1. డిజిట‌ల్ సేవింగ్స్ (జీరో బ్యాలెన్స్ అకౌంట్స్) ఖాతాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గ‌తేడాది యోనో (యు నీడ్ ఒన్లీ వ‌న్‌) యాప్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ యాప్ ద్వారా ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను ప్రారంభించే అవ‌కాశాన్ని క‌ల్పించింది. మార్చి 31, 2019 వ‌ర‌కు ఎలాంటి క‌నీస నిల్వ అవ‌స‌రం లేదు. దీనికి డెబిట్ కార్డును అందిస్తారు. వినియోగ‌దారులు త‌మ‌ స్మార్ట్‌ఫోన్‌లో యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ డిజిట‌ల్ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు.

18 ఏళ్లు పైబ‌డిన భార‌తీయ పౌరులు ఎవ‌రైనా ఈ డిజిటల్ ఖాతాను ప్రారంభించేందుకు అర్హులు. వినియోగ‌దారుడు క‌చ్చితంగా ఆదార్ నంబ‌ర్ లేదా పాన్ నంబ‌ర్ క‌లిగి ఉండాలి. ఒక‌వేళ పాన్, ఆధార్‌లో వివ‌రాలు వేరేగా ఉంటే ఆధార్‌లో ఉన్న వివ‌రాలు ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాయి. వినియోగ‌దారులు త‌ము ఉప‌యోగిస్తున్న మొబైల్ నంబ‌ర్‌ను, ఇ-మెయిల్‌ను న‌మోదు చేసుకోవాలి. బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఇ-కేవైసీ నిబంధ‌న‌ల‌ను, ఇంకా ఖాతా ప్రారంభించేందుకు అవ‌స‌ర‌మైన విధానాల‌ను పూర్తి చేయాలి. ఒక మొబైల్ నంబ‌ర్ నుంచి ఒక ఖాతాను మాత్ర‌మే ప్రారంభించే అవ‌కాశం ఉంటుంది. ఒక్కొక్క‌రు ఒక‌టే ఎస్‌బీఐ డిజిటల్ ఖాతాను క‌లిగి ఉండాలి.

 1. ఇన్‌స్టా సేవింగ్స్ (జీరో బ్యాలెన్స్‌) ఖాతా

కనీస న‌గ‌దు నిల్వ లేకుండా ఖాతాను ప్రారంభించే స‌దుపాయాన్ని దేశంలో అతి పెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ ప్రారంభించింది. ఇన్‌స్టా సేవింగ్స్ పేరిట పిలిచే ఈ ఖాతాలో జీరో బ్యాలెన్స్‌తో మార్చి 31, 2019 వ‌ర‌కు ప్రారంభించుకోవ‌చ్చ‌ని బ్యాంక్ తెలిపింది. ఈ ఖాతా ప్రారంభానికి వినియోగ‌దారులు త‌మ శాఖల‌ను సంద‌ర్శించాల్సిన ప‌ని లేద‌నీ, వినియోగ‌దారులు త‌మ ఇంటి నుంచే సులువుగా తెర‌వ‌వ‌చ్చ‌ని ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. క‌నీస న‌గ‌దు నిల్వ లేకుండా ఈ ఆఫ‌ర్ ప‌రిమిత కాలం మాత్ర‌మే ఉంటుంద‌ని బ్యాంక్ స్ప‌ష్టం చేసింది. బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణ‌యం అసంఖ్యాక వినియోగ‌దారుల‌కు మేలు చేకూర్చ‌నుంది.

ఇన్‌స్టా సేవింగ్స్ ఖాతా గురించి ప‌ది ముఖ్య‌మైన విష‌యాలు…

 • ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఇన్‌స్టా పొదుపు ఖాతాను ప్రారంభించవ‌చ్చు.
 • ఈ ఖాతా ప్రారంభానికి వినియోగ‌దారులు ఎలాంటి డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేదు. పూర్తి కాగిత ర‌హితంగా ఖాతా ప్రారంభించ‌డానికే ఈ ఏర్పాట‌ని బ్యాంక్ తెలిపింది.
 • ఖాతా త‌క్ష‌ణ‌మే యాక్టివేట్ అవుతుంద‌ని యోనో యాప్ అధీకృత వెబ్‌సైట్ sbiyono.sbi. తెలిపింది.
 • ఇన్‌స్టా సేవింగ్స్ ఖాతా ప్రారంభించిన వారికి రూపే డెబిట్ కార్డు ఇస్తారు.
 • ఎస్‌బీఐ ఇన్‌స్టా పొదుపు ఖాతాను ప్రారంభించిన వారు రూ.1 ల‌క్ష వ‌ర‌కు న‌గ‌దు నిల్వ‌ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు.
 • వినియోగ‌దారులు ఏటా రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు లావాదేవీలను జ‌రుపుకోవ‌చ్చు.
 • ఇన్‌స్టా సేవింగ్స్ ఖాతా నుంచి రెగ్యుల‌ర్ సేవింగ్స్ ఖాతాకు ఏడాది లోపు మార‌వ‌చ్చు. అయితే దీనికి ఎస్‌బీఐ శాఖ‌ల‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.
 • మార్చి 31, 2019 వ‌ర‌కు వినియోగ‌దారులు ఖాతాల‌లో ఎలాంటి న‌గదు నిల్వ‌ల‌ను నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేదు.
 • 18 ఏళ్లు దాటిన భార‌తీయ పౌరులెవరైనా ఈ ఖాతా తెర‌వ‌వ‌చ్చు.
 • యోనో మొబైల్ యాప్ ద్వారా ఇన్‌స్టా ఖాతా ప్రారంభించాల‌నుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా త‌మ ఆధార్‌, పాన్ వివ‌రాలు ఇవ్వాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly