మ‌రింత చౌక‌గా ఎస్‌బీఐ గృహ రుణాలు

తాజా త‌గ్గింపుతో వార్షికంగా 8 శాతం ఉన్న‌ ఎస్‌బీఐ ఒక సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్, వార్షికంగా 7.90 శాతానికి త‌గ్గింది.

మ‌రింత చౌక‌గా ఎస్‌బీఐ గృహ రుణాలు

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)…మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేసెడ్‌ లెండింగ్ రేటు (ఎమ్‌సీఎల్ఆర్‌)ను 10బేసిస్ పాయింట్ల మేర అన్ని కాల‌ప‌రిమితుల‌కు త‌గ్గిస్తున్న‌ట్లు నేడు ప్ర‌క‌టించింది. స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు డిసెంబ‌రు 10 తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి. ఈ త‌గ్గింపుతో ఎమ్‌సీఎల్ఆర్‌తో అనుసంధాన‌మైన ఎస్‌బీఐ గృహ‌, కారు, ఇత‌ర రిటైల్ రుణాలు మ‌రింత‌గా త‌గ్గ‌నున్నాయి. తాజా త‌గ్గింపుతో వార్షికంగా 8 శాతం ఉన్న‌ ఎస్‌బీఐ ఒక సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్, వార్షికంగా 7.90 శాతానికి త‌గ్గింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎస్‌బీఐ ఎమ్‌సీఎల్ఆర్‌ను త‌గ్గించ‌డం వ‌రుస‌గా ఇది ఎనిమిద‌వ సారి.

దేశంలో చౌకైన రుణ ప్ర‌దాత‌గా ఎస్‌బీఐ కొన‌సాగుతుంద‌ని, తాజా త‌గ్గింపుతో నిధుల వ్య‌యాన్ని త‌గ్గించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాన్ని నేరుగా వినియోగ‌దారుల‌కు అందిస్తున్నామ‌ని ఎస్‌బీఐ తెలిపింది. గృహ, వాహ‌న రుణాల మార్కెట్లో ఎస్‌బీఐ 25 శాతం వాటా క‌లిగి ఉన్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది.

ఎమ్‌సీఎల్ఆర్‌ రేట్లు బ్యాంకు సొంత నిధుల ఖర్చుపై ఆధారపడి ఉంటాయి. మీ గృహ రుణం ఎస్‌బీఐ ఎమ్‌సీఎల్ఆర్ రేటుతో అనుసంధానిత‌మైన‌ప్ప‌టికీ, తాజా కోత మీ ఈఎమ్ఐపై వెంట‌నే ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌చ్చు. కారణం ఎమ్‌సీఎల్ఆర్‌- ఆధారిత రుణాలు సాధారణంగా ఒక సంవత్సరం రీసెట్ నిబంధనను కలిగి ఉంటాయి.

కొత్త రుణగ్రహీతల కోసం, ఎస్‌బీఐ రెపో-రేట్ అనుసంధానింత‌ గృహ రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ పథకం కింద, రిజర్వ్ బ్యాంక్ తన బెంచ్ మార్క్ రెపో రేటును సవరించిన ప్ర‌తీసారి, ఎస్‌బీఐ కూడా రుణ రేటును సర్దుబాటు చేస్తుంది.

ఈ నెల ప్రారంభంలో జ‌రిగిన ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష స‌మావేశంలో ఆర్‌బీఐ రెపోరేటును 5.15 శాతం వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం మొత్తం మీద కేంద్ర‌బ్యాంక్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 135 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించింది.

ఆస్తులు, డిపాజిట్లు, ఖాతాదారులు, ఉద్యోగుల ప‌రంగా ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్‌. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద రుణ‌దాత కూడా ఎస్‌బీఐనే. సెప్టెంబ‌రు 30,2019 నాటికి ఎస్‌బీఐ రూ.30 ల‌క్ష‌ల కోట్ల డిపాజిట్ల‌ను క‌లిగి ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly