ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గ‌నున్న గృహ‌రుణ ఈఎమ్ఐ..

సవ‌రించిన ఎక్స్‌ట్ర‌న‌ల్‌ బెంచ్‌మార్క్ ఆధారిత గృహ‌రుణ వ‌డ్డీ రేట్లు జ‌న‌వ‌రి 1,2020 నుంచి అమ‌లులోకి రానున్నాయి

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గ‌నున్న గృహ‌రుణ ఈఎమ్ఐ..

దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్ మార్క్ ఆధారిత రేటు(ఈబీఆర్‌) ను 25 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించిన‌ట్లు నేడు ప్ర‌క‌టించింది. దీంతో వార్షికంగా 8.05 శాతం ఉన్న ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు 7.80 శాతానికి త‌గ్గింది. సవ‌రించిన వ‌డ్డీ రేట్లు జ‌న‌వ‌రి 1,2020 నుంచి అమ‌లులోకి రానున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది. తాజా త‌గ్గింపుతో ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేట్ల ఆధారంగా గృహ రుణం తీసుకున్న ఖాతాదారులు, ఎమ్ఎస్ఎమ్ఈ రుణ గ్ర‌హీత‌లకు 25 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటు త‌గ్గ‌నుంది.

కొత్త‌గా గృహ రుణం తీసుకునే వారికి వార్షికంగా 7.90 శాతానికే గృహ రుణం మంజూరు చేయ‌నున్న‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది. ప్ర‌స్తుతం 8.15 శాతానికి మంజూరు చేస్తున్నారు.

ఎస్‌బీఐ ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ మార్క్ ఆధారిత రుణ రేటును రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపోరేటును అనుసంధానం చేసింది. ప్ర‌స్తుతం ఆర్‌బీఐ రెపోరేటు 5.15 శాతంగా ఉంది. ఆర్‌బీఐ రెపోరేటుకి 265 బేసిస్ పాయింట్ల‌ను క‌లిపి ఎస్‌బీఐ ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును నిర్ణ‌యిస్తుంది. దీంతో పాటు 10 నుంచి 75 బేసిస్ పాయింట్ల వ‌ర‌కు చార్జీల‌ను జ‌తచేసి గృహ రుణ వ‌డ్డీరేట్ల‌ను వినియోగ‌దారుల‌కు విధిస్తుంది.

గ‌త అక్టోబ‌రులో ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించి 5.15 శాతం వ‌ద్ద స్థిర ప‌రిచింది. మార్చి 2010 త‌రువాత ఇదే త‌క్కువ రెపోరేటు. అయితే ఈ నెల ప్రారంభంలో జ‌రిగిన‌ ద్ర‌వ్య ప‌రిప‌తి విధాన స‌మీక్షా స‌మావేశంలో వ‌డ్డీ రేట్ల‌లో ఎలాంటి మార్పు చేయ‌లేదు.

ఈ నెల ప్రారంభంలో ఎస్‌బీఐ, దాని ఒక సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్‌(మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌-బేసెడ్ లెండింగ్ రేటు)ను 10 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. కొత్త‌ రుణ రేట్లు డిసెంబ‌రు 10వ తేదీ నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. ఈ త‌గ్గింపుతో ఎస్‌బీఐ ఒక సంవ‌త్స‌ర ఎమ్‌సీఎల్ఆర్ వార్షికంగా 8 శాతం నుంచి 7.90 శాతానికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎస్‌బీఐ ఎమ్‌సీఎల్ఆర్ త‌గ్గించ‌డం వ‌రుస‌గా ఇది ఎనిమిద‌వ సారి.

ఆస్తులు, డిపాజిట్లు, ఖాతాదారులు, ఉద్యోగుల ప‌రంగా ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్‌. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద రుణ‌దాత కూడా ఎస్‌బీఐనే. సెప్టెంబ‌రు 30,2019 నాటికి ఎస్‌బీఐ రూ.30 ల‌క్ష‌ల కోట్ల డిపాజిట్ల‌ను క‌లిగి ఉంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly