ఎమ్‌సీఎల్ఆర్‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

స‌వ‌రించిన గృహ రుణ వ‌డ్డీ రేట్లు అక్టోబ‌రు 10 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ఎమ్‌సీఎల్ఆర్‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

రిజ‌ర్వు బ్యాంక్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును త‌గ్గించిన కొన్ని రోజుల‌కే భార‌త‌దేశ అతిపెద్ద బ్యాంక్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నేడు ఉపాంత నిధుల వ్య‌య ఆధారిత రుణ రేటు(ఎమ్‌సీఎల్ఆర్‌)ను అన్ని కాల‌ప‌రిమితుల‌కు 10 బేసిస్ పాయింట్ల మేర‌ త‌గ్గించింది. దీంతో ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితికి ఎమ్‌సీఎల్ఆర్ వార్షికంగా 8.05 శాతానికి చేరుకుంది. ఇంత‌కు ముందు ఇది వార్షికంగా 8.15 శాతంగా ఉండేది. ఫ‌లితంగా ఎమ్‌సీఎల్ఆర్‌కు అనుసంధానం అయిన రుణాల వ‌డ్డీ రేట్లు 0.10 శాతం త‌గ్గ‌నున్నాయి. ఈ మారిన వ‌డ్డీరేటు అక్టోబ‌రు 10 నుంచి అమ‌లులోకి రానున్నాయి. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎస్‌బీఐ ఆరో సారి రుణాల వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది.

పండుగ సీజ‌న్ సందర్భంగా అన్ని విభాగాల‌లోని వినియోగ‌దారుల‌కు ప్ర‌యోజ‌నాల‌ను అందించాల‌నే ఉద్దేశ్యంతో అన్ని కాల‌ప‌రిమితుల‌కు 10 బేసిస్ పాయింట్ల మేర ఎమ్‌సీఎల్ఆర్‌ను త‌గ్గించిన‌ట్లు ఎస్‌బీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల విషయంలో ఎస్‌బీఐ భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. రుణాల మార్కెట్లో బ్యాంకు అధిక‌శాతం వాటాను క‌లిగి ఉంది.

ఎమ్‌సీఎల్ఆర్‌ రేట్లు బ్యాంకు సొంత నిధుల విలువ‌పై ఆధారపడి ఉంటాయి. మీ గృహ రుణం ఎమ్‌సీఎల్ఆర్ రేటుతో అనుసంధాన‌మైతే, తాజా కోత మీ ఈఎమ్ఐపై వెంటనే ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చు. ఎమ్‌సీఎల్ఆర్‌- ఆధారిత రుణాలు సాధారణంగా ఒక సంవత్సరం రీసెట్ నిబంధనను కలిగి ఉంటాయి.

కొత్త‌గా రుణం తీసుకునే వారికి ఎస్‌బీఐ రెపో రేటు అనుసంధానిత గృహ రుణ ప‌థ‌కాన్ని కూడా అందిస్తుంది. ఈ ప‌థ‌కం కింద ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ రేటును స‌వ‌రించిన ప్ర‌తీసారి వ‌డ్డీ రేట్లు స‌వ‌రిస్తారు. ఆర్‌బీఐ రెపోరేటుకు(ప్ర‌స్తుత రెపో రేటు 5.15 శాతం) 265 బేసిస్ పాయింట్ల మేర స్ప్రెడ్‌ను జ‌త చేసి ఎస్‌బీఐ ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటును లెక్కిస్తుంది. స‌మ‌ర్థ‌వంత‌మైన గృహ‌రుణ వ‌డ్డీ రేటుకు కోసం ప్రీమియంను కూడా ఎస్‌బీఐ ఛార్జ్ చేస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly