ఎస్‌బీఐ త‌గ్గిన వ‌డ్డీ రేట్ల ప్ర‌భావం మీ గృహ రుణాల‌పై ఉంటుందా?

మార్కెట్లో అందుబాటులో ఉన్న మొత్తం గృహ, వాహ‌న‌ రుణాలలో వరుసగా 35 శాతం,36 శాతం వాటా ఉందని ఎస్‌బీఐ పేర్కొంది

ఎస్‌బీఐ త‌గ్గిన వ‌డ్డీ రేట్ల ప్ర‌భావం మీ గృహ రుణాల‌పై ఉంటుందా?

ప్ర‌భుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మ‌రోసారి రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. అన్ని కాల‌ప‌రిమితుల రుణాల‌పై ఎమ్‌సీఎల్ఆర్‌(ఉపాంత వ్య‌య రుణ రేటును) 10 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించింది. ఈ సవ‌రించిన వ‌డ్డీ రేట్లు సెప్టెంబ‌ర్ 10 నుంచి వ‌ర్తిస్తాయి. ఈ కొత్త రేట్ల ప్ర‌కారం ఏడాది కాల‌ప‌రిమితి గ‌ల ఎమ్‌సీఎల్ఆర్ ఆధారిత వ‌డ్డీ రేట్లు వార్షికంగా 8.15 శాతం ఉండ‌నుంది. 2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఎస్‌బీఐ ఎమ్‌సీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్ల‌ను త‌గ్గించ‌డం వ‌రుస‌గా ఇది ఐదోసారి.

మార్కెట్లో అందుబాటులో ఉన్న మొత్తం గృహ, వాహ‌న‌ రుణాలలో వరుసగా 35 శాతం,36 శాతం వాటా ఉందని ఎస్‌బీఐ పేర్కొంది. ఎమ్‌సీఎల్ఆర్ రేట్లు బ్యాంకు నిధుల‌ విలువ‌పై ఆధార‌ప‌డి ఉంటాయి. మీరు ఇప్ప‌టికే ఎస్‌బీఐలో రుణం తీసుకుని ఉంటే తాజాగా త‌గ్గించిన 10 బేసిస్ పాయింట్లు మీ గృహ రుణ వ‌డ్డీ రేటును గానీ, ఈఎమ్ఐని గానీ త‌క్ష‌ణ‌మే త‌గ్గించ‌లేక‌పోవ‌చ్చు.

ఎస్‌బీఐ ఫ్లోటింగ్ రేటు రుణాలు సాధార‌ణంగా దాని ఒక సంవ‌త్స‌ర ఎమ్‌సీఎల్ఆర్‌తో అనుసంధాన‌మై ఉంటాయి.
రుణాల‌కు సంబంధించి రీసెట్ క్లాజ్ ఉంటుంది. రీసెట్ అంటే గృహ‌రుణాల‌పై వ‌డ్డీరేటు మ‌ధ్య‌లో మార్పులు లేకుండా ఒక
నిర్దిష్ట‌మైన తేదీకి తిరిగి రీసెట్ చేసుకునే అవ‌కాశం ఉండ‌టం. ఉదాహ‌ర‌ణ‌కు గృహ‌రుణంలో మీ రీసెట్ క్లాజ్ ఆగ‌స్టులో ఉంటే, బ్యాంకు ఎమ్‌సీఎల్ఆర్‌ను సెప్టెంబ‌ర్‌లో త‌గ్గిస్తే దాని ప్ర‌భావం వ‌చ్చే సంవ‌త్స‌రం ఆగస్టులో మాత్ర‌మే ఉంటుంది.

గృహ‌, వాహ‌న మొద‌లైన రిటైల్ లేదా వ్య‌క్తిగ‌త రుణాల‌ను కొత్త ఫ్లోటింగ్ రుణాల‌కు అనుసంధానించాల‌ని, సూక్ష్మ‌,చిన్న, మధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల రుణాల‌ను అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి ఎక్స్ట్ర్‌న‌ల్‌ బెంచ్‌మార్క్‌తో అనిసంధానించాల‌ని ఆర్‌బీఐ ఇటీవ‌ల బ్యాంకుల‌ను ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్‌బీఐ 110 బేసిస్ పాయింట్లు మేర త‌గ్గించింది. ఈ కొత్త విధానం వినియోగ‌దారులు త‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాలు పొందుతున్న‌ప్ప‌టికీ, రేట్లు పెరిగిన‌ప్పుడు వారిపై భారం ప‌డుతుంది.

ఎస్‌బీఐ ఇప్ప‌టికే గృహ రుణాల‌ను ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానించింది. ఆర్‌బీఐ రెపో రేటుకు అనుగుణంగా ఎస్‌బీఐ గృహ రుణ వ‌డ్డీ రేట్లు త‌గ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. ఈ రుణాలు ఆర్‌బీఐ రెపోరేటు కంటే 225 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండే ఎస్‌బీఐ స్వంత రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధాన‌మ‌వుతాయి. రెపో లింక్డ్ లెండింగ్ రేటుపై స్ప్రెడ్ చార్జీల‌ను కూడా బ్యాంకులు వ‌సూలు చేస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly