ఐపీఓ లిస్టింగ్ ఇక మ‌రింత సులువు

ఐపీఓ లిస్టింగ్‌ స‌మయాన్నిత‌గ్గించేందుకు ఎన్‌పీసీఐతో, సెబీ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

ఐపీఓ లిస్టింగ్ ఇక మ‌రింత సులువు

ప‌బ్లిక్ ఇష్యూ అనంత‌రం కంపెనీల లిస్టింగ్‌లో జ‌రుగుతున్న జాప్యాన్ని త‌గ్గించేందుకు సెబీ చ‌ర్య‌లు తీసుకోనుంది. లిస్టింగ్‌కి ప‌డుతున్న‌ స‌మయాన్ని మ‌రింత‌ త‌గ్గించేందుకు ప్ర‌త్యామ్నాయ చెల్లింపుల యంత్రాంగం ఏర్పాటు కోసం నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)తో సెబీ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. గ‌త శుక్ర‌వారం నాడు ముగిసిన‌ పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఈ వివ‌రాల‌ను తెలిపింది.

దీనిపై పార్ల‌మెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పొన్ రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ స‌మ‌ర్థ‌మైన‌ చెల్లింపుల విధానంతో పబ్లిక్ ఇష్యూ స‌మ‌యం, ఖ‌ర్చు త‌గ్గ‌డ‌మే గాక‌, మ‌దుప‌రుల సొమ్ముకి భ‌ద్ర‌త ల‌భించ‌నుంది. దీని కోసం సెబీ, ఎన్‌పీసీఐతో చ‌ర్చలు జ‌రుపుతోంద‌ని ఆయ‌న లోక్ స‌భ‌కు లిఖిత పూర్వ‌కంగా తెలిపారు.

ఐపీఓ అనంతరం లిస్టింగ్‌కి ప‌డుతున్న స‌మ‌యాన్ని సెబీ ఏడు నుంచి ఆరు రోజుల‌కు త‌గ్గించిన విష‌యం తెలిసిందే. దీన్ని మ‌రింత త‌గ్గించేందుకు సెబీ, ఎన్‌పీసీఐ, ఇత‌ర అనుబంధ సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు చేస్తోంది. అప్లికేష‌న్స్ స‌పోర్టెడ్ బై బ్లాక్‌డ్ అమౌంట్‌(ఏఎస్‌బీఏ) యంత్రాంగంపై ప్ర‌త్యామ్నాయ చెల్లింపులు విధానాన్ని త్వ‌ర‌లో రూపొందించేందుకు క‌స‌ర‌త్తులు జ‌రుపుతోంది. దీని వ‌ల్ల కంపెనీల లిస్టింగ్ స‌మ‌యం మ‌రింత త‌గ్గ‌నుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly