వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీతో భారం త‌గ్గించుకోండి

వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీ అంటే రుణం తీసుకున్న బ్యాంకు నుంచి అంత‌కంటే త‌క్కువ వ‌డ్డీకే రుణం ఇస్తున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ‌కు ఆ రుణాన్ని బ‌దిలీ చేయ‌డం.

వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీతో భారం త‌గ్గించుకోండి

వ‌డ్డీ రేట్ల‌ మీద చెల్లించే డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఒక బ్యాంకు నుంచి వ్య‌క్తిగ‌త రుణం తీసుకున్న త‌ర్వాత వేరే బ్యాంకులో దానికంటే త‌క్కువ రేట్ల‌తో రుణం ల‌భిస్తున్న‌ప్పుడు ఈ రుణాన్ని బ‌దిలీ చేసుకోవ‌చ్చు. దీంతో ఈఎమ్ఐ భారం త‌గ్గుతుంది.

బ్యాంకు రుణ మొత్తాన్ని వేరే బ్యాంకుకు బ‌దిలీ చేస్తుంది. ఇది చాలా సుల‌భం. దీనికోసం వినియోగ‌దారుడు ఒక ఫారం పూరించాల్సి ఉంటుంది. దాంతో పాటు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించాలి. అయితే వ‌డ్డీ రేట్ల‌లో పెద్ద‌గా తేడా లేక‌పోతే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌క‌పోవ‌డమే ఉత్త‌మం.

వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీ అంటే ఏంటి
వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీ అంటే రుణం తీసుకున్న బ్యాంకు నుంచి అంత‌కంటే త‌క్కువ వ‌డ్డీకే రుణం ఇస్తున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ‌కు ఆ రుణాన్ని బ‌దిలీ చేయ‌డం. దీనిని స్విచింగ్ అని కూడా అంటారు. దీనికోసం రుణ‌గ్ర‌స్తుడు ఎటువంటి హామీలు, ప‌త్రాలు చూప‌న‌వ‌స‌రం లేదు. అయితే ముందుస్తు రుణ చెల్లింపు ఛార్జీల‌ను చెల్లించాలి. కొత్త బ్యాంక్‌కు ప్రాసెసింగ్ ఫీజుల‌ను చెల్లించాలి. కొన్నిసార్లు రుణ ఒప్పందంపై స్టాంప్ డ్యూటీ కూడా ప‌డుతుంది.

వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీ ఎందుకు ఎంచుకుంటారు
వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీతో చాలా ప్ర‌యోజ‌నాలున్నాయి. అందులో కొన్ని…

 1. త‌క్కువ వ‌డ్డీ రేట్లు
  రుణ బ‌దిలీకి ముఖ్య కార‌ణం వ‌డ్డీని త‌గ్గించుకోవ‌డం. రుణం తీసుకునేముందు అన్ని బ్యాంకుల‌ను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ కొన్నిసార్లు ఎక్కువ వ‌డ్డీ రేట్లు ఉన్న బ్యాంకుల‌ను ఎంచుకోవ‌చ్చు. దీనిని త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఉన్న బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీకి రుణ బ‌దిలీ చేయ‌డం ద్వారా స‌రిచేసుకోవ‌చ్చు. దీంతో రుణం భారం త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.
 2. రుణ కాల‌ప‌రిమితి
  వ్య‌క్తిగ‌త రుణ కాల‌ప‌రిమితి సాధార‌ణంగా ఐదేళ్లు ఉంటుంది. కొన్ని బ్యాంకులు మ‌రింత ఎక్కువ కాల‌ప‌రిమితి క‌లిగిన రుణాల‌ను కూడా ఇస్తాయి. ఈఎమ్ఐ చెల్లించ‌డం భారంగా ఉంటే దీర్ఘ‌కాల‌ప‌రిమితి ఉన్న రుణాల‌ను ఎంచుకుంటే ఈఎమ్ఐ కాస్త త‌గ్గుతుంది. అయితే కాల‌ప‌రిమితి పెరిగితే చెల్లించాల్సిన రుణం కూడా పెరుగుతుంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.
 3. అద‌న‌పు రుణ స‌దుపాయాలు
  కొన్ని బ్యాంకులు ముంద‌స్తు రుణ చెల్లింపుల‌కు ఎటువంటి ఛార్జీలు వ‌సూలు చేయ‌వు, కొన్ని సంద‌ర్భాల‌లో ఈఎమ్ఐ ర‌ద్దు చేస్తాయి, అద‌న‌పు టాప్‌-ఆప్ లోన్, రుణంతో పాటు అద‌నంగా వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమాను అందిస్తాయి. ఇలాంటి ప్ర‌యోజ‌నాలు అందించే బ్యాంకుకు రుణాన్ని బ‌దిలీ చేసుకోవ‌చ్చు.
 4. టాప్ అప్ లోన్‌
  తీసుకున్న రుణం కాకుండా అద‌నంగా మ‌రింత రుణం కావాల‌నుకుంటే మీ బ్యాంకు ఆ స‌దుపాయం క‌ల్పించ‌క‌పోతే వ్య‌క్తిగ‌త రుణాన్ని ఇత‌ర బ్యాంకుకు బ‌దిలీ చేసుకొని పొంద‌వ‌చ్చు. అయితే బ‌దిలీ చేసేముందు అన్ని బ్యాంకుల టాప్‌-అప్ ఆప్ష‌న్ల‌ను ఒక‌సారి పోల్చిచూసుకోవాలి.
 5. వినియోగ‌దారుడికి అనుకూల‌త‌
  బ్యాంకు మీకు త‌గిన సేవ‌లు, స‌మాచారం అందించ‌క‌పోతే, బ్యాంకు సేవ‌ల‌తో తృప్తి చెంద‌క‌పోతే మెరుగైన సేవ‌ల‌న అందించే ఇత‌ర బ్యాంకుకు బ‌దిలీ చేసుకోవ‌డం మేలు.

వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీ ఎలా చేయాలి?

 1. మీ బ్యాంకు కాకుండా ఇత‌ర బ్యాంకుల్లో ఏది మంచి ప్ర‌యోజ‌నాలు కల్పిస్తుందో ఎంచుకోవాలి. ఫీచ‌ర్లు, వ్య‌యాలు వంటి వాటిపై విశ్లేష‌ణ జ‌రిపి స‌రైన బ్యాంకుకు బ‌దిలీ చేయాలి.
 2. ప్ర‌స్తుత బ్యాంకు నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్‌) , ముంద‌స్తు రుణ చెల్లింపు లేఖ‌ను పొందాలి.
 3. రుణాన్ని బ‌దిలీ చేయాల‌నుకునే బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీకి కొత్త రుణం కోసం దాఖ‌లు చేసుకోవాలి. అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను , వ్య‌క్తిగ‌త రుణ ఖాతా స్టేట్‌మెంట్‌ను అందించాలి.
 4. కొత్త బ్యాంకు నుంచి ఆమోద లేఖ ( sanction letter) పొందాలి. మీ ఖాతాలో రుణ డిపాజిట్ చెక్కు లేదా డీడీని వేయాలి ప్ర‌స్తుత బ్యాంకులో వ్య‌క్తిగత రుణాన్ని మూసివేయాలి.
 5. అదేవిధంగా బ్యాంకు నుంచి పూర్తిగా చెల్లించ‌న‌ట్లుగా(No due ) స‌ర్టిఫికెట్ పొందాలి

రుణ బ‌దిలీ అర్హ‌త‌లు ఏంటి?

 • రుణానికి దాఖ‌లు చేసిన‌ప్పుడు బ్యాంకులు మీకు చెల్లించ‌గ‌లిగే స్థోమ‌త ఉందో లేదో చెక్ చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణం త్వర‌గా అందిస్తాయి.

 • ఇంత‌కుముందున్న ఈఎమ్ఐ స‌మ‌యానికి చెల్లించారా లేదా ప‌రిశీలిస్తాయి.

 • ఆదాయ ప‌త్రాలు అంటే వేత‌న స‌ర్టిఫికెట్ లేదా లాభం, న‌ష్టం వ‌చ్చిన‌ట్లు చూపే ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

 • రుణ బ‌దిలీ చేసేందుకు ప్ర‌స్తుతం ఉన్న రుణం రూ. 50 వేల కంటే ఎక్కువ‌గా ఉండాలి.

 • రుణం తీసుకున్న బ్యాంకు నుంచి బ‌దిలీ చేసేందుకు ఆమోదం కావాలితెల‌పాలి

 • మీరు రుణం తీసుకోబోయే బ్యాంకు వినియోగ‌దారుడైతే రుణం త్వ‌ర‌గా పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

  చివ‌ర‌గా
  వ్య‌క్తిగ‌త రుణ బ‌దిలీ ద్వారా వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అయితే కొత్త బ్యాంకును ఎంచుకునేముందు జాగ్ర‌త్త వ‌హించాలి. వెబ్ అగ్రిగేట‌ర్ల ద్వారా స‌రైన స‌మాచారాన్ని సేక‌రించి అప్పుడు రుణ బ‌దిలీకి సిద్ధం కావాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly