సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ..వివ‌రాలు

ఇత‌ర చిన్న పొదుపు ప‌థ‌కాల‌తో పోలిస్తే సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్‌పై అధిక వ‌డ్డీ పొంద‌వ‌చ్చు

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ..వివ‌రాలు

కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా పెద్దల (సీనియర్‌ సిటిజన్స్‌) కోసం ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించింది. పదవీ విరమణ చేసినవారికి ఈ పథకం ఎంతో అనుకూలమైంది. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక అవసరాలను ఈ పథకం తీరుస్తుంది.

అర్హత:

 • 60ఏళ్లు పైబడిన భారతీయులు ఈ పథకానికి అర్హులు.
 • స్వచ్ఛంద పదవీ విరమణ చేసినవారైతే 55ఏళ్లకే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు.
 • 50 ఏళ్లు పైబడిన రక్షణ సిబ్బంది కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
 • సింగిల్‌ లేదా ఉమ్మడి ఖాతాను తెరవచ్చు. కేవలం జీవితభాగస్వామితో కలిసి మాత్రమే ఉమ్మడి ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది.

కనిష్ఠ, గరిష్ఠ పెట్టుబడి పరిమితులు:

 • కనీస రూ.1000 పెట్టుబడితో ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది.
 • గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.

కాలపరిమితి:
ఈ ప‌థ‌కాన్ని 5ఏళ్లు కొన‌సాగించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత కావాల‌నుకుంటే మ‌రో 3ఏళ్లు పొడిగించుకునే వీలుంది.

రాబడి:
అక్టోబ‌ర్-డిసెంబ‌ర్ త్రైమాసికానికి 8.6 శాతం వ‌డ్డీ ప్ర‌క‌టించింది

నామినీ సదుపాయం:

 • ఖాతా ప్రారంభ సమయంలో లేదా తర్వాత ఎప్పుడైనా నామినీని ప్రతిపాదించవచ్చు.
 • నామినీగా ఎవరినైనా ఎప్పుడైనా మార్చుకునే సౌలభ్యం ఉంది.

ఖాతా ప్రారంభించే విధానం:

 • ఏదైనా పోస్టాఫీసు బ్రాంచీలో లేదా గుర్తింపు పొందిన బ్యాంకు ద్వారా ఖాతా తెరవవచ్చు.
 • ఖాతాను ప్రారంభించేందుకు పూర్తి వివరాలతో నింపిన ఫారం−ఏ, గుర్తింపు, చిరునామా పత్రాలు, రెండు ఫొటోలు అందించాలి.
 • రూ.లక్ష లోపు డిపాజిట్‌ చేసేటట్టయితే నగదు రూపంలో చెల్లించవచ్చు.
 • రూ.లక్షకు మించితే చెక్కు లేదా డీడీ రూపంలో అందించాలి.
 • ఒకరి పేరుపై ఎన్ని ఖాతాలైనా ప్రారంభించవచ్చు. అయితే అన్ని ఖాతాల మొత్తం సొమ్ము రూ.15 లక్షలకు మించరాదు.

ఖాతా బదిలీ:

 • పెద్దల ఖాతాను ఓ పోస్టాఫీసు నుంచి మరోదానికి బదిలీ చేసుకోవచ్చు.
 • ఓ పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు లేదా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు ఖాతాను బదిలీ చేసుకునే సదుపాయం ఉంది.

నగదు ఉపసంహరణ:
అయిదేళ్ల కాలపరిమితి ముగిసేవరకూ ఎలాంటి నగదు ఉపసంహరణలకు అనుమతించరు.

ముందుగా ఖాతాను నిలిపివేయాల‌నుకుంటే…

 • ఖాతా ప్రారంభించి ఒక ఏడాది గడిచాక ఖాతాను మూసివేయాలని భావిస్తే డిపాజిట్‌పై 1.5శాతం కోత విధించి మిగతా సొమ్ము అందిస్తారు.
 • అదే రెండేళ్లు ముగిశాక డిపాజిట్‌పై 1శాతం కోత విధిస్తారు.

ఖాతాదారుడికి ఏదైనా జరిగితే…
వ్యక్తిగత ఖాతా :
కాలపరిమితి తీరకముందే ఖాతాదారుడు చనిపోతే పెట్టుబడి సొమ్ము మొత్తాన్ని వడ్డీతో కలిపి నామినీకి లేదా వారసులకు అందజేస్తారు.

ఉమ్మడి ఖాతా:

 • జీవితభాగస్వామిలో ఒకరు చనిపోతే మరొకరి పేరు మీద వ్యక్తిగత ఖాతాగా కొనసాగుతుంది.
 • జీవితభాగస్వామికి ఉమ్మడి ఖాతాతో పాటు వ్యక్తిగత ఖాతా ఉంటే… ఇద్దరి ఖాతాలో పెట్టుబడి రూ.15 లక్షలకు మించరాదు. ఈ పరిమితి దాటితే మిగతా సొమ్మును తిరిగి చెల్లిస్తారు.

మెచ్యూరిటీ సమయంలో…

 • అయిదేళ్ల మెచ్యూరిటీ తర్వాత ఖాతాదారు మొత్తం సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు విత్‌డ్రాయల్‌ ఫారంతో పాటు పాస్‌బుక్‌ను సమర్పించాలి (లేదా) మరో మూడేళ్లకూ ఖాతాను పొడిగించుకోవచ్చు.
 • ఖాతాను ఐదేళ్ల తర్వాత మూసివేయకుండా, నగదు ఉపసంహరించుకోకుండా, పొడిగించుకోకుండా ఉంచినట్లయితే ఓ సాధారణ పోస్టాఫీస్‌ పొదుపు ఖాతాలా భావించి వడ్డీ జమచేస్తారు.

పన్ను మినహాయింపు:

 • వార్షిక వడ్డీ విలువ రూ.10వేలు దాటితే టీడీఎస్‌ విధిస్తారు.
 • ఏడాదికి రూ.1.5ల‌క్ష‌ల వరకూ పెట్టే పెట్టుబడికి ఐటీ చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.
  సెక్ష‌న్ 80టీటీబీ ప్ర‌కారం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మ‌రో రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly