వ‌డ్డీరేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో సీనియ‌ర్‌ సిటిజ‌న్లు మంచి రాబ‌డి పొందాలంటే..

నెల‌వారీగా ఆదాయం పొందాల‌నుకునే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ ప‌థ‌కం మంచి పెట్టుబ‌డి మార్గంగా చెప్పుకోవ‌చ్చు

వ‌డ్డీరేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో సీనియ‌ర్‌ సిటిజ‌న్లు మంచి రాబ‌డి పొందాలంటే..

60 ఏళ్ళు పైబ‌డిన వారికి న‌ష్ట‌భ‌యంలేని ఆదాయాన్ని అందించే సాధార‌ణ పెట్టుబ‌డి మార్గం సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్‌). సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు రూపొందించిన ఈ ప‌థ‌కాన్ని 2004లో ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ రంగ బ్యాంకులు, పోస్టాఫీసుల‌లో ఈ ప‌థ‌కం అందుబాటులో ఉంది. జులై-సెప్టెంబ‌రు,2019 త్రైమాసికానిగానూ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ తమ ఖాతాదారులకు 8.6 శాతం వార్షిక‌ వడ్డీని అందిస్తుంది.

అర్హ‌త‌:
60 సంవ‌త్స‌రాలు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న పెద్ద‌లు ఎవ‌రైనా సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరేందుకు అర్హ‌త ఉంటుంది. 55 నుంచి 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న వారు కూడా ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. అయితే వారు స్వ‌చ్ఛంద ప‌ద‌వీవిర‌మ‌ణ చేసి ఉండాలి. రక్షణ సర్వీసుల నుంచి పదవీ విరమణ చేసిన వారు 50 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడానికి అర్హులు.

పెట్టుబ‌డి:
క‌నీసం రూ.1000 పెట్టుబ‌డితో సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ ఖాత‌ను తెరువ‌వ‌చ్చు. గ‌రిష్టంగా రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. రూ.1000 గుణిజాల‌లో న‌గ‌దు ఖాతాలో జ‌మ‌చేసేందుకు వీలుంటుంది. వ్య‌క్తిగ‌తంగానే కాకుండా ఉమ్మ‌డిగా కూడా ఖాతాను తెరిచేందుకు బ్యాంకు అనుమ‌తిస్తుంది. కానీ ఉమ్మడి ఖాతాను కేవలం భార్యతో మాత్రమే అనుమతిస్తారు. ఒక డిపాజిట్ దారుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహించవచ్చు, అయితే అన్ని ఖాతాలలో బ్యాలెన్స్ ను కలిపి గరిష్టంగా రూ. 15 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు.

వ‌డ్డీరేటు:
ఇత‌ర చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌తో పోలిస్తే, సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ అధిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుంది. ప్ర‌స్తుతం జులై-సెప్టెంబ‌రు త్రైమాసికానికి 8.6 శాతం వ‌డ్డీని ఇస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్ర‌తీ త్రైమాసికానికి వ‌డ్డీ రేట్ల‌ను పున‌రుద్ధ‌రిస్తుంది. వ‌డ్డీ రేట్ల‌ను త్రైమాసికంగా చెల్లిస్తారు. ఏప్రిల్‌, జులై, అక్టోబ‌రు,జ‌న‌వ‌రి మాసాల‌లో మొద‌టి ప‌నిదినంలో వ‌డ్డీని జ‌మ‌చేస్తారు.

మెచ్యూరిటీ:
సీనియర్ సిటిజెన్ పొదుపు పథకం మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాలు. అయితే దీనిని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ స‌మ‌యం త‌రువాత మ‌రో మూడు సంవ‌త్స‌రాలు ఖాతాను పొడిగించుకోవ‌చ్చు.

ప్రీమెచ్యూర్ క్లోజ్‌(ముంద‌స్తు మూసివేత‌):

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లో ఈ సౌకర్యం ఖాతా తెరచిన ఒక సంవత్సరం పూరైన త‌రువాత‌ నుంచి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఖాతాను ఒక సంవత్సరం తరువాత మూసివేయాలని అనుకుంటే మొత్తం డిపాజిట్ లో 1.5 శాతం, అదే రెండు సంవత్సరాల తరువాత మూసివేయాలనుకుంటే మొత్తం డిపాజిట్ లో 1 శాతం మొత్తాన్ని పెనాల్టీగా మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ఖాతాదారుడికి అందచేస్తారు. ఒకవేళ మూడు సంవత్సరాల తరువాత మూసివేయాలనుకుంటే ఎలాంటి మినహాయింపులు లేకుండా ఏ సమయంలోనైనా మూసివేయవచ్చు.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు:
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం రూ.40 వేల కంటే ఎక్కువ ఉంటే మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌) వ‌ర్తిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly