సెప్టెంబ‌రు త్రైమాసికంలో 4.5 శాతానికి ప‌రిమిత‌మైన‌ జీడీపీ వృద్ధి రేటు

ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో, త‌యారీ రంగంలో స్థూల విలువ జోడింపు(జీవీఏ) వృద్ధి 1 శాతం క్షీణించింది

సెప్టెంబ‌రు త్రైమాసికంలో 4.5 శాతానికి ప‌రిమిత‌మైన‌ జీడీపీ వృద్ధి రేటు

భార‌త వార్షిక వృద్ధి రేటు మంద‌గ‌మ‌నం దిశ‌గా సాగుతుంది. సెప్టెంబ‌రు 30 తో ముగిసిన త్రైమాసికంలో స్థూల జాతీయోత్త‌త్తి(జీడీపీ) వృద్ధి రేటు 4.5 శాతానికి చేరింది. అంత‌కు ముందు త్రైమాసికంలో ఇది 5 శాతంగా ఉంది. 2018 సంవ‌త్స‌రం ఇదే స‌మ‌యంలో వృద్ధి రేటు 7 శాతంగా ఉంది. రెండ‌వ త్రైమాసికంలో 4.7 శాతం వృద్ధి రేటును ఆర్థిక వృద్ధిని ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేశారు. అయితే వృద్ధి రేటు 4.5 శాతానికి ప‌రిమితం అయ్యింది. పెట్టుబ‌డుల‌ను, ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం సెప్టెంబ‌రులో కార్పొరేట్ ప‌న్నును భారీగా త‌గ్గించ‌డంతో స‌హా ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది.

  • నేష‌న‌ల్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస్‌(ఎన్ఎస్ఓ) విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో, త‌యారీ రంగంలో స్థూల విలువ జోడింపు(జీవీఏ) వృద్ధి 1 శాతం క్షీణించింది. అంత క్రితం ఆర్థిక సంవ‌త్స‌రం ఇదే త్రైమాసికంలో 6.9 శాతం వృద్ధి న‌మోదు చేసింది.

  • అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని ప‌రిశీలిస్తే, జీవీఏ 2.1 వృద్ధి శాతానికి వృద్ధి చెందిన్న‌ప్ప‌టికీ, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో న‌మోదైన 4.9 శాతం వృద్ధితో పోలిస్తే ఇది త‌క్కువే.

  • నిర్మాణ రంగ జివీఏ వృద్ధి కూడా 8.5 శాతం నుంచి 3.3 శాతానికి మందగించింది. గ‌నుల‌ రంగ వృద్ధి ఏడాది క్రితం 2.2 శాతం క్షీణించ‌గా… ఈసారి 0.1 శాతం మేర వృద్ధి చెందింది.

  • విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర యుటిలిటీ సేవల వృద్ధి కూడా ఏడాది క్రితం 8.7 శాతం న‌మోదు కాగా…ఈ సారి 3.6 శాతానికి మందగించింది. అదేవిధంగా, వాణిజ్యం, హోటళ్ళు, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌క్యాస్టింగ్ సేవ‌లు వృద్ధి కూడా 6.9 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గింది.

  • ఆర్థిక, రియల్ ఎస్టేట్‌, వృత్తి పరమైన సేవల వృద్ధి 2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసికంలో 5.8శాతానికి తగ్గింది. అంత‌కు ముందు ఆర్థిక సంవ‌త్స‌రం ఇదే మూడు నెల‌ల కానికి ఇది 7 శాతంగా న‌మోదయ్యింది.

  • మరోవైపు ప్రజా పాలన, రక్షణ, ఇతర సేవల్లో వృద్ధి 8.6 శాతం నుంచి 11.6 శాతానికి మెరుగుప‌డింది.

  • ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి ఆరు నెల‌ల కాలానికి( ఏప్రిల్‌-సెప్టెంబ‌రు2019), జీడీపీ వృద్ధి 4.8 శాతానికి ప‌రిమిత‌మైంది. అంత‌కుముందు సంవ‌త్స‌రం ఇదే స‌మ‌యంలో 7.5 శాతం వృద్ధి న‌మోదైంది.

  • 2011-12 స్థిర ధ‌ర‌ల ఆధారంగా 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసిక జీడీపీని రూ.35.99 ల‌క్ష‌ల కోట్లుగా అంచ‌నా వేశారు. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసికంలో న‌మోదైన 34.43 ల‌క్ష‌ల కోట్ల‌ జీడీపీతో పోలిస్తే ఇది 4.5 శాతం వృద్ధి రేటును మాత్ర‌మే చూపిస్తుంద‌ని ఎన్ఎస్ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపింది.

  • ఇక పెట్టుబడులకు సంకేతమైన గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ (జీఎఫ్‌సీఎఫ్‌) 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసికంలో రూ.11.16 లక్షల కోట్లుతో (2011-12 స్థిర ధరల ఆధారంగా) పోలిస్తే, 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసికానికి రూ.10.83 ల‌క్ష‌ల కోట్లుగా అంచనా వేశారు.

  • కీల‌క మౌలిక రంగాల ఉత్ప‌త్తి స‌తైం డీలా ప‌డింది. అక్టోబ‌రు నెల‌లో 5.8 శాతం మేర క్షీణిచింది. ద‌శాబ్ద కాలంలోనే ఇది క‌నిష్ట స్థాయి. కీల‌క‌మైన ఎనిమిది రంగాల్లో ఆరు రంగాలు ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేశాయి. అక్టోబ‌రు 2018లో కీల‌క రంగాలు 4.8 శాతం మేర వృద్ధి చెందాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly