డిపాజిట్లు, రుణాలు కాకుండా బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌లు

బ్యాంకు అనగానే డబ్బు డిపాజిట్ చెయ్యడమో, లోను పొందడమో గుర్తుకు వస్తాయి. కాని బ్యాంకులు మరెన్నో సేవలు అందిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

డిపాజిట్లు, రుణాలు కాకుండా బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌లు

బ్యాంకులు డబ్బు లావాదేవీలు, రుణ సౌకర్యం వంటివి కల్పించడమే కాకుండా, ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి వివిధ ఇతర సేవలను సైతం అందిస్తున్నాయి. ఆ సేవలు వాటి వివరాలు…

వస్తువులను జాగ్రత్త పరచడం:

 • వజ్రాలు, బంగారు ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలు వంటి విలువైన వాటిని బ్యాంకు లాకర్లలో జాగ్రత్తపరుచుకోవచ్చు. ఒక్కో సేవకు కొంత మొత్తం రుసుము చెల్లించి ఈ సేవలను వాడుకోవచ్చు.
 • లాకర్లను వాడుకున్నందుకు బ్యాంకులు వార్షిక రుసుములను వసూలు చేస్తాయి.
 • బ్యాంకులో ఖాతాదారుడు ఏవైనా వస్తువులు ఉంచేటప్పుడు, బ్యాంకు నుంచి తిరిగి తీసుకునేటప్పుడు వివరాలను రాసి ఉంచేందుకు రెండు పత్రాలను ఆర్‌బీఐ సూచించింది. ఖాతాదారుడు, బ్యాంకు జాగ్రత్త కోసం ఈ పత్రాలు చాలా ముఖ్యమైనవి.

నోట్ల మార్పిడి:

ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఏ బ్యాంకు శాఖలోనైనా చిరిగిపోయిన లేదా పాత నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. ఖాతాదారుడైనా కాకపోయినా ఈ సేవను పొందవచ్చు.

విదేశీ మారక సేవలు, విదేశాల్లో జరిపే చెల్లింపులు:

 • ఎంపిక చేసిన బ్యాంకు శాఖల్లో విదేశీ మారకపు రేట్లు, రుసుములు ప్రదర్శిస్తారు. ఇలాంటి చోట్ల విదేశీ కరెన్సీ మార్పిడి సేవలను పొందవచ్చు.
 • విదేశీ మారకపు చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఇతర దేశాలకు ఈ శాఖల్లో నగదు బదిలీ జరిపే వీలుంది.
 • విదేశాల్లో ఉన్నవారు మన దేశంలోకి ఖాతాలకు నగదు పంపేందుకు ఎన్‌ఈఎఫ్‌టీ(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానం ఉంది. ఈ విధమైన లావాదేవీ 24 గంటల నుంచి 96 గంటల సమయం తీసుకుంటుంది.
 • డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా, చెక్కుల ద్వారా సైతం నగదు పంపే వీలుంది.
  మనం నగదు పంపే బ్యాంకులు ఏ ఏ కరెన్సీలను అనుమతిస్తున్నాయో ముందే తెలుసుకుంటే మంచిది.
  విదేశాల నుంచి నగదు స్వీకరించేందుకు బ్యాంకులు కొంత సేవా రుసుమును విధిస్తాయి.

బీమా మధ్యవర్తిత్వ సేవలు:

కొంత రుసుములు విధించి బీమా కంపెనీల పాలసీలను ప్రజలకు అందించడంలో బ్యాంకులు పాల్గొనేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. తద్వారా బీమా పాలసీలను ఏజెంటు తరహాలో బ్యాంకు శాఖల్లో అమ్మకం జరపడానికి వీలు కలుగుతుంది. పాలసీల విషయంలో బ్యాంకులు సూచనలు, సలహాలు ఇస్తూ మధ్యవర్తిత్వం వహిస్తాయి.

పెట్టుబడి సంబంధిత సేవలు:

బ్యాంకులు ఖాతాదారులకు షేర్లు, డిబెంచర్ల లావాదేవీలు జరిపేందుకు వీలు కల్పిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో షేర్ల కొనుగోలు/అమ్మకాల కొనుగోలుకు మేజర్‌ బ్యాంకులన్నీ పెట్టుబడిదారులకు కొన్ని ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేశాయి. ప్రతి సేవకు ఆయా సంస్థలు కొంత రుసుమును విధిస్తాయి.

లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌:

వర్కింగ్‌ క్యాపిటల్‌ పెట్టుబడులను వివిధ వ్యాపారాల్లో వినియోగించేందుకు కంపెనీలకు మేజర్‌ బ్యాంకులు పరిమితితో కూడిన స్వేచ్ఛను అందిస్తున్నాయి. పరిమితి మేరకు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని గరిష్ట ఉత్పాదకతను సాధించేందుకు ఇది దోహదపడగలదు.

రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌:

వృద్ధాప్యంలో ఆదాయం వచ్చేందుకు వీలుగా వివిధ పెన్షన్‌, రిటైర్‌మెంట్‌ పథకాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వేతన ఉద్యోగులకు, స్వయం ఉపాధి ఉన్న వారికి ప్రత్యేకంగా రిటైర్‌మెంట్‌ పథకాలను బ్యాంకులు రూపొందిస్తున్నాయి. నామమాత్రపు రుసుములతో బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు:

బ్యాంకులు ప్రజల ద్వారా సేకరించిన పెట్టుబడులను లాభాల దిశగా మళ్లించేందుకు మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లను నియమించుకుంటాయి. షేర్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు, కంపెనీ లాభనష్టాలను వీరు నిత్యం గమనిస్తూ ఉంటారు. వివిధ అంశాలను దృష్టిలోపెట్టుకుని కంపెనీ సామర్థ్యాన్ని అంచనా వేసి వీరు సలహాలు అందిస్తారు. ఈ తరహా సేవలను అందించేందుకు బ్యాంకులు సెబీ వద్ద అనుమతి పొంది ఉండాలి.

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌:

భారతదేశంలో బ్యాంకుల్లో డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు తెరవడం ద్వారా ఎన్‌ఆర్‌ఐలకు ట్రేడింగ్‌ను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా ఎన్‌ఆర్‌ఐలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో ట్రేడింగ్‌ చేసేందుకు వీలవుతుంది. నేరుగా స్టాక్‌ బ్రోకింగ్‌కు అనుమతి లేని బ్యాంకులు బ్రోకింగ్‌ కంపెనీలతో ఒప్పందం మేరకు ట్రేడింగ్‌ ఖాతాలను తెరిచేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఈక్విటీల లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఈక్విటీ ట్రేడింగ్‌ ఖాతాను, పొదుపు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి.

డెట్‌ మార్కెట్‌ సాధనాల్లో పెట్టుబడులు:

సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపోజిట్లు, ప్రభుత్వ బాండ్లు, **కార్పొరేట్‌ డిపోజిట్లు, వాణిజ్య పత్రాలు తదితరాల్లో పెట్టుబడులు బ్యాంకుల ద్వారా పెట్టే వీలు కల్పిస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly