మొద‌టిసారి పెట్టుబ‌డులు పెడుతున్నారా?

న‌మ్మ‌కం క‌లిగిన ఆర్థిక స‌ల‌హాదారుడు ఉంటే ఆర్థిక ల‌క్ష్యాల‌ను సాధించ‌డం సుల‌భ‌మ‌వుతుంది

మొద‌టిసారి పెట్టుబ‌డులు పెడుతున్నారా?

చాలా మంది ఇత‌ర విష‌యాల్లో మేధావులు అయిన‌ప్ప‌టికీ పెట్టుబ‌డులు, ఇత‌ర ఆర్థిక విష‌యాల‌పై అంత‌గా అవ‌గాహ‌న ఉండ‌దు. కానీ ఇది అంద‌రూ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్య‌మైన‌ అంశం. ఈ పెట్టుబ‌డులు, మార్కెట్లు గురించి స‌రిగా తెలుసుకోకుండా పెట్టుబ‌డులు పెట్టి చాలా మంది నష్టాలు ఎదుర్కుంటారు. కానీ స‌రైన ప్ర‌ణాళిక‌తో పెట్టుబ‌డులు ప్రారంభిస్తే ఆర్థిక జీవ‌నం సాఫీగా కొన‌సాగుతుంది. మొద‌టిసారి పెట్టుబ‌డులు పెడుతున్న వారికి తెలుసుకోవాల్సిన కొన్ని విష‌యాలు…

ద్ర‌వ్యోల్బ‌ణం, ఆర్థిక ల‌క్ష్యాలు, ప్ర‌ణాళిక‌లు

20 ఏళ్ల క్రితం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి ఒక‌సారి ప‌రిశీలించండి. స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, సిన‌మా టిక్కెట్లు, పాల ధ‌ర‌లు ఇప్పుడు ఉన్న‌ట్లుగానే ఉన్నాయా. రోజురోజుకి ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతుంటే ధ‌ర‌లు కూడా కొండెక్కుతున్నాయి. పెట్టుబ‌డులు పెట్టేందుకు ముఖ్య అవ‌సరం ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించడం. మొద‌టి సారి పెట్టుబ‌డులు చేసేవారు మొట్ట‌మొద‌ట చేయాల్సిన ప‌ని త‌మ ఆర్థిక ల‌క్ష్యాల జాబితాను త‌యారు చేసుకోవ‌డం. స్వ‌ల్ప కాలిక‌, మ‌ధ్య కాలిక, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను వేర్వేరుగా రాసుకోవాలి.

ప‌దవీ విర‌మ‌ణ‌

ఇది చాలా ముఖ్య‌మైన అదేవిదంగా అంత‌గా ప‌ట్టించుకోని ఆర్థిక ల‌క్ష్యంగా చెప్పుకోవ‌చ్చు. జీవితాన్ని మూడు ద‌శ‌లుగా విభ‌జిస్తే మొద‌టి ద‌శ‌లో 25 సంవ‌త్స‌రాలు నేర్చుకునే ద‌శ‌. అప్పుడు ఆర్థికంగా త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డ‌తాం. రెండ‌వ ద‌శ‌లో సంపాదించ‌డం మొద‌లుపెడ‌తారు. 25 నుంచి 60 సంవ‌త్స‌రాల వ‌ర‌కు దాదాపు 35 ఏళ్లు. ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం సంపాదించ‌డం మొద‌లుపెట్టినప్ప‌టినుంచే పొదుపు చేయ‌డం ప్రారంభించాలి.

ఈక్విటీ లేదా క‌చ్చిత‌మైన ఆదాయం

ఒక‌సారి ల‌క్ష్యాల జాబితా త‌యారు చేసుకున్న త‌ర్వాత దాన్ని నెర‌వేర్చుకునే విధంగా కృషి చేయాలి. ఇక్క‌డ రెండు ర‌కాల మార్గాలున్నాయి. అవి ఈక్విటీ, డెట్ (అంటే స్థిర ఆదాయం). మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచి ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు. రిస్క్, రాబ‌డి ఒక నాణేనికి రెండు వైపుల్లాగా ఉంటాయి. ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలానికి అధిక రాబ‌డిని ఇస్తాయి. అయితే మ‌రోకోణం కూడా ఉంది. ఒక్కోసారి అనిశ్చిత ప‌రిస్థితుల్లో హెచ్చుత‌గ్గుల‌కు లోన‌య్యే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. ఈక్విటీ మ్యూచూవ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు క‌నీస 10 సంవత్స‌రాలు పెట్టుబ‌డులు కొన‌సాగించే విధంగా ఉండాలి. స్థిర ఆదాయ ప‌థ‌కాల‌లో రాబ‌డి స్థిరంగా ఉంటుంది. వీటికి భ‌ద్ర‌త ఉంటుంది. న‌ష్ట భ‌యం అక్క‌ర్లేదు.

స‌మ‌యం విలువ‌ను తెలుసుకోవ‌డం అవ‌స‌రం
చ‌క్ర‌వ‌డ్డీ ఫార్ములా - భ‌విష్య‌త్తు విలువ = ప్ర‌స్తుత విలువ (1+ రాబ‌డి శాతం )^ కాలం. భ‌విష్య‌త్తు విలువ అనేది ప్ర‌స్తుత విలువ‌, పెట్టుబ‌డులు, కాలంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఎంత కాలం ఎంత రాబ‌డి వ‌స్తుంది. మ‌న‌లో చాలా మంది కేవ‌లం రాబ‌డిపైనే దృష్టి సారిస్తారు . కానీ ఈ ఫార్ములాపై కూడా దృష్టి సారిస్తే స‌రైన రాబ‌డిని పొంద‌వ‌చ్చు. అదేవిధంగా ఆర్థిక ల‌క్ష్యాల ఆధారంగా ఈక్విటీ, డెట్ ఎందులో ఎంత పెట్టుబ‌డులు పెట్టాలో నిర్ణ‌యించుకోవాలి. సిప్ ద్వారా కూడా క్ర‌మంగా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

భావోద్వేగాల‌ను స‌మ‌తుల్య‌ప‌రుచుకోవాలి
మ‌న చుట్టూ ఉన్న వ్య‌క్తులు, ప‌రిస‌రాల‌తో మ‌న ఆలోచ‌న‌లు మారుతుంటాయి. ఎక్కువ‌గా సంపాదించాల‌న్న కోరిక పెరుగుతుంది. దీంతో మొత్తం అంతా ఈక్విటీల‌కు ప‌రిమితం చేయ‌కూడ‌దు. మార్కెట్ల ప‌రిస్థితులు, ఆర్థిక ల‌క్ష్యాలు, రిస్క్ తీసుకునే అవ‌సరం ఎంత ఉందో చూసుకోవాలి. అదేవిధంగా మార్కెట్ల‌కు న‌ష్టాలు ఎదురైన‌ప్పుడు పెట్టుబ‌డుల‌న ఉప‌సంహరించుకోవ‌డం వంటివి చేస్తుంటారు. ఇది స‌రైన నిర్ణ‌యం కాదు.

ఆర్థిక ప్ర‌ణాళిక పెట్టుబ‌డుల గురించి తెలుసుకునేందుకు ఒక స‌ల‌హాదారుడు అవ‌స‌రం. మంచి న‌మ్మ‌క‌మున్న ఆర్థిక స‌ల‌హాదారుడిని ఎంచుకుంటే ఆర్థిక జీవ‌నంలో ఇబ్బందులు ఉండ‌వు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly