డౌన్ పేమెంట్ కోసం పీపీఎఫ్ ఖాతా తెరుద్దామా?

పీపీఎఫ్ ఖాతా నియమ నిబంధనల ప్రకారం నిల్వలో నుంచి 50 శాతం మాత్రమే తీసుకునే అవకాశం ఉంది

డౌన్ పేమెంట్ కోసం పీపీఎఫ్ ఖాతా తెరుద్దామా?

ఇల్లు కొనుగోలు అనేది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. ప్రస్తుత రోజులలో బ్యాంకులు ఇంటి విలువలో 80-85 శాతం వరకు రుణం మంజూరు చేస్తున్నాయి. అయితే, ఇళ్ల ధరలు కూడా పెరగడంతో కనీసం చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీర్ఘ కాలం మదుపు చేయడం వలన చక్రవడ్డీ ప్రభావంతో అధిక రాబడి పొందవచ్చు. దీని కోసం ముందు నుంచే మదుపు ప్రారంభించాలి. ఇంటి కొనుగోలుకు కావలసిన డౌన్ పేమెంట్ కొరకు ఏ పధకాలను ఎంచుకోవచ్చో చూద్దాం.

ఉదా: 30 ఏళ్ళ రామ్, పది సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాడు. దీని ప్రస్తుత విలువ రూ 40 లక్షలు. దీనిపై ద్రవ్యోల్బణ ప్రభావం 7 శాతం అనుకుంటే, పది సంవత్సరాల తరువాత దీని విలువ రూ 80 లక్షల వరకు ఉంటుంది. అందులో 20శాతం డౌన్ పేమెంట్ గా రూ 15 లక్షలు , మిగిలిన మొత్తాన్ని గృహ రుణం ద్వారా పొందవచ్చు. ఇప్పటినుంచి నెల నెలా మదుపు మొదలుపెట్టి డౌన్ పేమెంట్ కు ఏర్పాటు చేసుకోవాలి.
ఇందు కోసం ఈ కింది వాటిని పరిశీలించవచ్చు: పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.

పీపీఎఫ్:

రామ్, డిసెంబర్2018 లో పీపీఎఫ్ ఖాతా తెరిచాడు. 2019-20 సంవత్సరం నుండి మొదటి ఐదు సంవత్సరాలకు ప్రతి నెలా రూ.12,500 ( ఏడాదికి రూ.1.50 లక్షలు) , తరువాతి ఐదు సంవత్సరాలకు నెలకు రూ 16,670 ( ఏడాదికి రూ 2 లక్షలు), ఆ తరువాతి ఐదు సంవత్సరాలకు నెలలు రూ 20,830 (ఏడాదికి రూ 2.50 లక్షలు) జమచేస్తూ వస్తే, పది సంవత్సరాలకు8శాతం అంచనా వడ్డీతో 2028-29 నాటికి రూ. 26.1 లక్షలు జమ అవుతాయి . అయితే పీపీఎఫ్ ఖాతా నియమ నిబంధనల ప్రకారం నాలుగు సంవత్సరాల ముందు ఉన్న నిల్వ లేదా క్రితం సంవత్సరం మార్చి నాటికి ఉన్న నిల్వలో ఏది తక్కువైతే, దాని నుంచి50 శాతం మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అందువలన, రామ్ 2025-26 చివరి నాటికి ఉన్న రూ 15 లక్షలలో 50 శాతం అనగా రూ 7.5 లక్షలు మాత్రమే పొందగలడు. మిగిలిన రూ 7. 5 లక్షలను జమ చేయటానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవవచ్చు.

PPF.jpg

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్:

వీటిలో అనేక పధకాలు ఉంటాయి. స్వల్ప కాలంలో ఈక్విటీలు ఒడుదుడుకులకి లోనైనా, దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. ముందుగా యుటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లాంటి ఒక ఇండెక్స్ ఫండ్ లో మొదలుపెట్టి, ప్రతి సంవత్సరం మదుపు పెంచుకుంటూ ఉండాలి. ఉదా: నెలకు రూ 2,500 లతో (ఏడాదికి రూ 30 వేలు) మొదలుపెట్టి, ప్రతి సంవత్సరం పది శాతం పెంచుకుంటూ మదుపు చేస్తే, దీర్ఘకాలంలో 12 శాతం రాబడి అంచనాతో పది సంవత్సరాల తరువాత రూ 7.5 లక్షలను పొందవచ్చు. రిస్క్ తీసుకోలేని వారు మ్యూచువల్ ఫండ్ల బదులు పీపీఎఫ్ ని ఎంచుకోవచ్చు

ముగింపు:
క్రిందటి కధనంలో పీపీఎఫ్ ఖాతా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లను ఉపయోగించి హోమ్ లోన్ ఈఎంఐ ని ఎలా చెల్లించవచ్చో తెలుసుకున్నాం. ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు లను పెంచుతుందని అంచనా వేయడమైంది.

ప్రతి ఒక్కరూ వారి ఆర్ధిక లక్ష్యాలను గుర్తించి, తగిన మదుపు పధకాలను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు. మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly