మ‌దుపుతో ఆర్థిక స్వేచ్ఛ‌ను పొందండి

వయసు పెరిగే కొద్దీ ఆర్థిక ల‌క్ష్యాల‌పై స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తే , మదుపు చేసే సమయం తగ్గి , చక్రవడ్డీ ప్రభావంతో పొందే లాభాన్ని పొందలేము.

మ‌దుపుతో ఆర్థిక స్వేచ్ఛ‌ను పొందండి

ప్రతి వ్యక్తి జీవితంలో విలువైనవి, ముఖ్యమైనవి - ఆరోగ్యం, డబ్బు రెండూ. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆనందంగా ఉంటూ, హాయిగా నిద్రపోవాలంటే డబ్బు ఉండాలి. డబ్బు సంపాదించాలంటే ఆరోగ్యంతో పనిచేసి , సంపాదించనదానిని చక్కగా మదుపు చేయాలి. ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం. సరైన మదుపు చేయకపోతే మానసిక ఆందోళన. తద్వారా అనారోగ్యం.

జీవితాన్ని మూడు దశలుగా పేర్కొనవచ్చు.

  1. తల్లిదండ్రులపై ఆధారపడటం 2. స్వతంత్రంగా ఉండటం 3. ఒకరిపై ఒకరు ఆధారపడటం.

1.తల్లిదండ్రులపై ఆధారపడటం : సాధారణంగా 20-22 సంవత్సరాల వరకు తల్లిదండ్రులపై ఆధారపడటం సహజం. ఇక్కడే మీ భవిష్యత్తు జీవితానికి పునాది మీరు ఎంచుకున్న చదువు ద్వారా ఏర్పడుతుంది.

2.సంపాదిస్తూ స్వతంత్రంగా 60 ఏళ్ళ వయసు వరకు ఉండటం:
20-22 ఏళ్ళ వయసు నించే సంపాదన మొదలుపెట్టి, సొంత‌ నిర్ణయాలు తీసుకుని కుటుంబ బాధ్యతలతో పాటు నిర్దేశించుకున్న ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవటానికి పొదుపు/మదుపు చేస్తుంటారు. ఈ దశలో తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వాటిద్వారా మీ శారీరక, ఆర్ధిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలాగే మీ పిల్లల చదువుల కోసం చేసే ఖర్చు వారి భవిష్యత్తును, వారి నుంచి మీకు అందే సహాయం ఆధారపడి ఉంటాయి.

యుక్త వయసులోనే అనేకమంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు . తద్వారా ఆర్ధికంగా కూడా నష్టపోతుంటారు. అందుకనే ప్రతి విషయంలో అనుభవజ్ఞలైన పెద్దల సలహా తీసుకోవాలి.
ముందుగా మీరు మీ ఆర్ధిక లక్ష్యాలను గుర్తించి, ఉదా : పిల్లల చదువులు, వారి వివాహాలు, ఇంటి కొనుగోలు, కారు కొనుగోలు, పదవీ విరమణ అనంతర ఆదాయం, విహార యాత్రలు వంటివి. ఇందుకోసం ప్రతి ఆర్ధిక లక్ష్యం ప్రస్తుత విలువ, ఆ ఖర్చుకు వర్తించే ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుని భవిష్యత్తులో ఉండబోయే ధరను తెలుసుకోవాలి.

సంపాదించే దాంట్లో ఈ లక్ష్యాలకు ఎంత మదుపు చేస్తున్నామో చూసుకోవాలి. అన్ని లక్ష్యాలు చిన్న వయసులో తెలియకపోవచ్చు. వయసు పెరిగే కొద్దీ స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తే , మదుపు చేసే సమయం తగ్గి , చక్రవడ్డీ ప్రభావంతో పొందే లాభాన్ని పొందలేము. ఒక్కొక్కసారి అధిక మొత్తంలో మదుపు చేయాల్సి రావచ్చు. దీనికి ఉత్తమమైన మార్గం , చిన్న వయసు నుంచే మదుపు చేయడం.

3.ఒకరిపై ఒకరు ఆధారపడటం:
వయసు పెరుగుతున్న కొద్దీ శారీరక శక్తి తో పాటు సంపాదించే శక్తి తగ్గుతుంది. అనారోగ్య సమయంలో, ఇతర పనుల కోసం పిల్లల సహాయం తప్పనిసరి అవుతుంది. సంపాదిస్తున్న రోజులలో దాచుకున్న దాంట్లొనుంచే జీవితాన్ని గడపాలి . ఆర్ధికంగా పిల్లలపై ఆధారపడటం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే, వారికీ వచ్చే ఆదాయంలో వారి పిల్లల పెంపకం, చదువులు, భవిష్యత్తు ఆదాయం గురించి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అయితే, వైద్య అవసరాలు, మరికొన్ని విషయాలకు పిల్లల సహాయం కోరవచ్చు. ఏది ఏమైనా , మనం ఆర్ధికంగా వేరొకరిపై ఆధారపడకుండా ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. దీనిలో ముఖ్యమైనది మదుపు. సంపాదించే రోజులలో మదుపు చేసి కూడబెట్టామో , పదవీవిరమణ అనంతర జీవితంలో కూడా అత్యాశకు పోకుండా మదుపు చేస్తూ , ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి పొందే పధకాలను ఎంచుకోవాలి.

ముగింపు:
ప్రతి మదుపు సాధనానికి కొన్ని లక్షణాలు ఉన్నట్లే , నియమ నిబంధనలు కూడా ఉంటాయి. వాటిని తెలుసుకుని దీర్ఘకాలం మదుపు చేసినట్లయితే లాభపడతారు. తరచూ పధకాలను మార్చడం వలన నష్టపోయే అవకాశం ఉంటుంది.
మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

ఈ ప్రపంచంలో ఎవరినీ ఎవరూ ఉద్ధరించరు . ఎవరికి వారు తమ బరువు బాధ్యతలను తెలుసుకుని జీవించటమే జీవిత సత్యం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly