షేర్ల‌లో మ‌దుపు చేసేముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు

నేరుగా షేర్ల‌లో మ‌దుపు చేయాల‌నుకునే వారు ముందుగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

షేర్ల‌లో మ‌దుపు చేసేముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు

నేరుగా షేర్ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా రాబ‌డి పొందాల‌నుకునే మ‌దుప‌ర్లు ముందుగా వీటిలో న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంద‌ని తెలుసుకోవాలి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యాన్ని అంచ‌నా వేసుకుని దానికి త‌గ్గినట్లు పెట్టుబ‌డి కేటాయింపు చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్ల ద్వారా రాబ‌డి పొందాల‌నుకునే వారు ముందుగా మ్యూచువ‌ల్ ఫండ్ల మార్గాన్ని ఎంచుకోవాలి. నేరుగా షేర్ల‌లో మ‌దుపు చేసే కంటే కూడా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప్యాసివ్ కేట‌గిరీకి చెందిన నిర్వ‌హించే ఈటీఎఫ్‌, ఇండెక్స్ ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఆధారంగా ఈక్విటీ లో ఎంత వ‌ర‌కూ పెట్టుబ‌డి చేయాల‌నుకుంటున్నారో ముందుగా అంచ‌నా వేసుకోవాలి. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం పెట్టుబ‌డి చేస్తే మంచి రాబ‌డిని పొందే అవ‌కాశం ఉంటుంది. మ‌దుప‌ర్లు త‌మ‌ ఆర్థిక ప్ర‌ణాళికలో భాగంగా ఏర్ప‌రుచుకున్న దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను సాధించేందుకు పెట్టుబ‌డులు క్ర‌మంగా పెడుతుండాలి. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కాల‌ప‌రిమితి 10-15 ఏళ్ల పాటు ఉండేలా చూసుకోవాలి. దీర్ఘ‌కాలంలో మార్కెట్లో ఏర్ప‌డే ఒడుదొడుకుల స‌ర్దుమ‌ణిగి మీ ఆర్థిక‌ ల‌క్ష్యం చేరుకోవ‌డం సాధ్యం అవుతుంది.

ట్రేడింగ్ టిప్స్ ను ఫాలో అవ‌డం ద్వారా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే అంచ‌నాలు దీర్ఘ‌కాలానికి, స్వ‌ల్ప‌కాలానికి వివిధ ర‌కాల కాల‌ప‌రిమితుల‌కు ఇస్తుంటారు. వాటిని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు దీర్ఘ‌కాలానికి బాగా రాణిస్తుంద‌ని అంచ‌నా వేసిన వాటిలో స్వ‌ల్ప‌కాలానికి పెట్టుబ‌డి చేయ‌డం మంచిది కాదు. ఈక్విటీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్లు కొన్ని నియ‌మాల‌ను పెట్టుకుని మ‌దుపుచేయ‌డం చాలా మంచిది. ఉదాహ‌ర‌ణ‌కు నిఫ్టీ సూచీ పీఈ నిష్ప‌త్తి 23 దాటితే, ఈక్విటీ పెట్టుబ‌డులు ఆటోమేటిక్‌గా త‌గ్గి డెట్ (స్థిరాదాయ) పెట్టుబ‌డుల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. ఒక వేళ వ‌డ్డీ రేట్లు ప‌దేళ్ల క‌నిష్టానికి చేరాయ‌నుకోండి, ఆటోమేటిక్ డెట్ లో పెట్టుబ‌డి ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాలైన ఈక్విటీ, చ‌ర‌వ‌డ్డీరేటు అందించే సాధ‌నాల్లోకి వెళ్లేలా ఏర్పాటుచేయండి. దీంతో మార్కెట్ ఏ విధంగా ఉండ‌బోతుంద‌నే అంచ‌నాలు వేయ‌న‌క్క‌ర్లేదు. మీరు పెట్టుకున్న నియ‌మాల ప్ర‌కారం పెట్టుబ‌డి స‌ర్దుబాటు అవుతుంది. వ్య‌క్తులు త‌మ‌ న‌ష్ట‌భ‌యం ఆధారంగా ఈక్విటీలో ఎంత డెట్ లో ఎంత కేటాయించాలనేది అంచ‌నా వేసుకోవాలి. నేరుగా షేర్ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు ప్ర‌ధానంగా చూడాల్సిన అంశం కంపెనీ రుణాలెంతున్నాయి? ఈక్విటీ ఎంత? మొద‌లైన విష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఐటీ కంపెనీలు త‌క్కువ రుణాలు క‌లిగి ఉండ‌టం మూలంగా ఎక్కువ సంప‌దను క‌లిగిఉంటాయి. ఈక్విటీ క్యాపిట‌ల్ త‌క్కువ ఉంటే కంపెనీకి వ‌చ్చే లాభాల పంప‌కం త‌క్కువ మందికి ఉంటుంది. దీని ద్వారా షేర్ల విలువ మ‌రింత పెరుగుతుంది.

మార్కెట్లు ప్ర‌తికూలంగా ఉన్న‌పుడు పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకోవాల‌నే ఆలోచ‌న వ‌ద్దు. షేర్ల ధ‌ర‌ల్లో వ‌చ్చే మార్పుల‌తో నిమిత్తం లేకుండా క్రమంగా పెట్టుబ‌డి చేస్తే మంచి లాభాల‌ను ఆర్జించేందుకు వీలుంటుంది. కొన్ని సంద‌ర్బాల్లో మ‌నం కొన్న షేర్లు మూడు నెల‌ల్లోనే రెట్టింపు లాభం అందించ‌వ‌చ్చు. అయితే ఇది అన్ని వేళ‌లా కాద‌ని గ్ర‌హించాలి. సాధార‌ణంగా స్టాక్ మార్కెట్లో చేసే పెట్టుబ‌డి క‌నీసం 3-5 సంవత్స‌రాల త‌రువాత‌ మంచి రాబ‌డిని అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబ‌డులు బ్యాలెన్స్ చేసుకోవ‌డం, పెట్టుబ‌డి వ‌ర్గాల శాతంలో మార్పులు, క్ర‌మంగా పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా మ‌దుప‌ర్ల త‌మ పెట్టుబ‌డుల‌కు స్థిర‌త్వం క‌లిగించ‌వ‌చ్చు. 10-15 ఏళ్ల పాటు పెట్టుబ‌డి చేస్తే ఈక్విటీపై మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే దీర్ఘ‌కాలంలో మార్కెట్లో ఏర్ప‌డే హెచ్చుత‌గ్గులు క్ర‌మంగా స్థిర‌ప‌డ‌తాయి. కేవ‌లం షేరు ధ‌ర‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇవ్వద్దు. కొన్ని కంపెనీలు ఒక‌ అంకెతో ట్రేడ‌వుతుంటే, మ‌రి కొన్ని ఐదెంక‌ల‌తో సంఖ్య ధ‌ర‌తో ట్రేడ‌వుతుంటాయి. ఏదైనా షేరు ధ‌ర త‌క్కువగా ఉండేందుకు వివిధ కార‌ణాలు ఉంటాయి. అదే విధంగా పీఈ విలువ ఆధారంగా మాత్ర‌మే షేర్ల‌ను ఎంపిక‌చేసుకోకుండా కంపెనీకి చెందిన ఇత‌ర విష‌యాల‌ను ప‌రిశీలించాలి. షేర్ల ఎంపికలో అవ‌గాహ‌న లేక‌పోతే మ‌దుప‌ర్లు ఆర్థిక స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly