వ‌య‌సుకి త‌గిన ప‌న్ను ఆదా ప్ర‌ణాళిక‌ అవ‌సరం

పెట్టుబ‌డుల కోసం ఒక ప‌థ‌కాన్ని ఎంచుకునే ముందు అది మీ ఆర్థిక అవ‌స‌రాల‌కు, ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఉందా లేదా చూసుకోవాలి.

వ‌య‌సుకి త‌గిన ప‌న్ను ఆదా ప్ర‌ణాళిక‌ అవ‌సరం

జీవితంలో మార్పు అనేది సహ‌జం ఇది ఆర్థిక విష‌యాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఆదాయం, ఖ‌ర్చులు, పొదుపు అనేది వ‌య‌సును బ‌ట్టి మారుతుంటాయి. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు పెట్టుబ‌డులు, ప‌న్ను ఆదా ప‌థ‌కాల‌ను స‌మీక్షించుకోవాలి. వ‌య‌సును బ‌ట్టి పెట్టుబ‌డుల‌ను మార్చుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు, ఒక వ్య‌క్తి లేదా కొత్త‌గా పెళ్ల‌యిన దంప‌తులు లేదా ప‌ద‌వీ విర‌మ‌ణ అయిన‌వారికి సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే ట్యూష‌న్ ఫీజు ఖ‌ర్చులు ఉండ‌వు. అందుకే ప‌న్ను ఆదా కోసం వేరే ప‌థ‌కాల‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈపీఎఫ్‌, గృహ రుణం చెల్లిస్తున్న‌వారికి అప్ప‌టికే ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది కాబ‌ట్టి దాని కోసం పెట్టుబ‌డుల‌ను ఎంచుకునే అవ‌సరం ఉండ‌దు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఈ సెక్షన్‌ కింద గరిష్ఠంగా రూ.1,50,000 మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. వీటిలో పెట్టుబడి పథకాలను ఎంచుకునేప్పుడే కాస్త జాగ్రత్తగా… ఏ వయసులో ఎలాంటివి ఎంచుకోవాలి? అవి నిజంగా మనకు ఎంత మేరకు ఉపయోగపడతాయి అని నిర్ధారించుకోవాలి. నష్టభయం సామర్థ్యమూ పరిగణనలోనికి తీసుకోవాలి. అప్పుడే ఈక్విటీలకూ, డెట్‌ పథకాలకూ ఎంత కేటాయించాలనేది అవగాహన వస్తుంది. కేవలం ప‌న్ను ఆదానే పరిగణనలోనికి తీసుకొని మదుపు చేయడమూ సరికాదు.

సంపాద‌న‌ మొదలైన కొత్తలో…

సాధార‌ణంగా ఈ వ‌య‌సులో రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం ఎక్కువ‌గా ఉంటుంది. 25-35 ఏళ్ల వ‌య‌సువారు ఈక్విటీల‌కు 65-70 శాతం వ‌ర‌కు కేటాయించవ‌చ్చు అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం పూర్తిగా ఈక్విటీ పెట్టుబ‌డులైన ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీల‌కు, డెట్‌కి కూడా అవ‌కాశ‌ముంటే ఎన్‌పీఎస్‌వంటివి ఎంచుకోవాలి. ఈఎల్ఎస్ఎస్‌పై రూ.1.5 ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపు కూడా ల‌భిస్తుంది. క‌నీసం ఏడు సంవ‌త్స‌రాలు ఇందులో పెట్టుబడులు కొన‌సాగించాల‌ని చెప్తున్నారు. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)తోపాటు, కొంత భాగం డెట్ పెట్టుబ‌డులు ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, పీపీఎఫ్‌లాంటివి ఎంచుకోవడం మంచిది. తమపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన మొత్తానికి జీవిత బీమా తీసుకోవడమూ మంచిది. క‌నీస హామీ రూ.5 ల‌క్ష‌లు క‌లిగిన ఆరోగ్య బీమా పాలసీని కూడా తీసుకోవాలి. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని వేర్వేరు స‌క్ష‌న్‌ల ప్ర‌కారం వీటిపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

బాధ్యతలు పెరిగినప్పుడు…

ఆదాయంతోపాటు, బాధ్యతల బరువులూ పెరుగుతాయి. ఈ దశలో ఉన్నవారు ముందుగా బాధ్యతలకు అనుగుణంగా జీవిత బీమా మొత్తాన్ని పెంచుకోవడంతో పాటు పింఛన్‌ పాలసీలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవిత బీమా, ఆరోగ్య బీమా క‌వ‌రేజ్ పెంచుకోవాలి. ఈ ద‌శ‌లో డెట్ పెట్టుబ‌డులు పెంచుకొని ఈక్విటీలు త‌గ్గించుకుంటూ ఉండాలి. అంటే పీపీఎఫ్‌లో పెట్టుబ‌డుల‌ను పెంచుతూ ఈఎల్ఎస్ఎస్‌లో త‌గ్గించుకోవాలి. పిల్లల ఫీజులు, పీఎఫ్‌లాంటివే సాధారణంగా సెక్షన్‌ 80సీకి సరిపోయేలాగా ఉంటాయి. ఒక‌వేళ లేక‌పోతే గృహ రుణం ఎక్కువ మొత్తంలో చెల్లిస్తూ ప‌న్ను మిన‌హాయింపు పొందేవిదంగా ప్ర‌ణాళిక చేసుకోవాలి.

ప‌ద‌వి వీర‌మ‌ణ:

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత సంస్థ నుంచి పొందే పెన్ష‌న్ లేదా ఇత‌ర ఆదాయంపై కూడా ప‌న్ను ఉంటుంది. అందుకే ఆ ద‌శ‌లో కూడా ప‌న్ను ఆదా చేసే పెట్టుబ‌డుల గురించి ఆలోచించాలి. అయితే రిస్క్ త‌క్కువ‌గా ఉంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు డెట్ కేట‌గిరీల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కువ కాల‌ప‌రిమితి ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోకూడ‌దు. లిక్విడిటీ ఉండాలి. ముఖ్యంగా ఈ ద‌శ‌లో క్ర‌మంగా ఆదాయం పొందే ప‌థ‌కాలను ప‌రిశీలించాలి. పీపీఎఫ్ వంటి దీర్ఘ‌కాలిక ప‌థ‌కాల నుంచి త్రైమాసికానికి ఒక‌సారి వ‌డ్డీని అందించే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియ‌ర్ సిటిజిన్ ప‌థ‌కాలు వంటి వాటిపై దృష్టి సారించాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవిత బీమా అవ‌స‌రం లేదు, ఆరోగ్య బీమాను కొన‌సాగించాలని చెప్తున్నారు.

ప‌ద‌వీ విర‌మ‌ణకు ముందు గానీ లేదా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత గానీ కొంత మేర‌కు పెట్టుబ‌డుల‌ను ఈక్విటీల‌కు కేటాయించాలి. జీవితంలోని ప్ర‌తి ద‌శ‌లో ఈక్విటీ పెట్టుబ‌డులు ఉండ‌టం అన్న‌ది సూచించ‌ద‌గ‌న‌ది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఈక్విటీల్లో 15-30 శాతం ఉండ‌టం మంచిద‌ని వారి అభిప్రాయం. అంటే వారి ఆర్థిక ప‌రిస్థితి రిస్క్ తీసుకునే అవ‌స‌రంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

పెట్టుబడిని సురక్షితంగా ఉంచుకోవడమే ఈ వయసులో ప్రధాన లక్ష్యం కావాలి. సాధ్యమైనంత వరకూ ఈక్విటీలకు దూరంగా ఉంటూ, డెట్‌ పథకాల్లోనే మదుపు చేయాలి. పదవీ విరమణ చేసిన వారికి నెలవారీ, మూడు నెలలకోసారి రాబడి వచ్చేలా ఉంటే బాగుంటుంది. అందుకే, పెద్దల పొదుపు పథకం (సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం)లాంటి వాటిని పరిశీలించవచ్చు. దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి, పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రాబడి హామీ కూడా ఉంటుంది.
పన్ను మినహాయింపు పథకాల్లో మదుపు చేసేప్పుడు వయసే కాకుండా, ఆదాయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly