అన్ని ప‌త్రాలు ఇస్తేనే, టీడీఎస్ త‌గ్గుతుంది..

టీడీఎస్ భారం ప‌డ‌కుండా పెట్టుబ‌డుల వివ‌రాల‌ను, స‌రైన స‌మ‌యంలో సంబంధిత ప‌త్రాల‌తో పాటు స‌మ‌ర్పించ‌డం మంచిది

అన్ని ప‌త్రాలు ఇస్తేనే, టీడీఎస్ త‌గ్గుతుంది..

ప్ర‌తీ సంవ‌త్స‌రం రెండు సార్లు ప‌న్ను సంబంధిత డిక్ల‌రేష‌న్ల‌ను ఉద్యోగులు వారు ప‌నిచేసే సంస్థ‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక సంవ‌త్స‌ర ప్రారంభం(ఏప్రిల్‌-మే)లో ఒక‌సారి, డిసెంబ‌రు-జ‌న‌వ‌రి లో మ‌రోసారి ఇవ్వాలి. మొద‌టి సారి డిక్ల‌రేష‌న్‌తో పాటు పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఆధారాలు స‌మ‌ర్పించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. మీ ప్ర‌ణాళిక‌ల గురించి స‌మాచారం ఇస్తే స‌రిపోతుంది. అయితే రెండోసారి ఇచ్చే డిక్ల‌రేష‌న్‌లో మీ పెట్టుబ‌డులు, ఖ‌ర్చుల‌కు సంబంధించిన ఆధారాలు కూడా సంస్థ‌కు ఇవ్వాలి. ఉద్యోగులు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం, టీడీఎస్ ఆదాయాన్ని సంస్థ‌ మిన‌హాయిస్తుంది.

ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు బీమా(యులిప్స్‌, జీవిత బీమా, ఆరోగ్య బీమా), ఈఎల్ఎస్ఎస్ మ్యూచువ‌ల్ ఫండ్లు, పీపీఎఫ్ డిపాజిట్లు, ఇంటి రుణం, విద్యా రుణం, ట్యూష‌న్ ఫీజులు, లీవ్ ట్రావెల్ అలెవెన్స్, హౌస్ రెంట్ ఎల‌వెన్స్‌(హెచ్ఆర్ఏ) వంటివి సాధార‌ణ పెట్టుబ‌డులు. వీటికి సంబంధించిన ప‌త్రాల‌ను రుజువులుగా అందించాలి.

సెక్ష‌న్ 80సీ కిందికి వ‌చ్చే పెట్టుబ‌డులు:
ఈ చ‌ట్ట ప్ర‌కారం పెట్టుబ‌డుల‌పై గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

  1. జీవిత బీమా పాల‌సీ ప్రీమియం చెల్లింపుల ర‌శీదు
  2. మీ, మీపై ఆధార‌ప‌డిన వారి పేరుపై తీసుకున్న‌ యూనిట్ లింక్ ఇన్సురెన్స్ ప్లాన్‌(యులిప్‌) ప్రీమియం చెల్లింపుల ర‌శీదులు
  3. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువ‌ల్ ఫండ్లు పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఆధారాలు
  4. ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌) పెట్టుబ‌డులు
  5. ఎన్ఎస్‌సీ(జాతీయ పొదుపు ప‌త్రాలు) పెట్టుబ‌డులు
  6. ఇంటి రుణం అస‌లు చెల్లింపులు
  7. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు చెల్లించే ట్యూష‌న్ ఫీజులు
  8. ఐదు సంవత్స‌రాల ప‌న్ను-ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ).
  9. ఎన్‌పీఎస్‌- ఫించ‌ను నిధికి అందించే స‌హకారం
  10. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థకానికి అందించే స‌హ‌కారం

ఇత‌ర మిన‌హాయింపు మార్గాలు:

ఆరోగ్య బీమా ప్రీమియం:
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80డీ ప్ర‌కారం మీతో పాటు మీ జీవిత‌భాగ‌స్వామి, పిల్ల‌ల కోసం చెల్లించే ఆరోగ్య బీమా వార్షిక ప్రీమియంపై రూ.25 వేల వ‌ర‌కు డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ ప‌రిమితి రూ.50 వేల వ‌ర‌కు ఉంటుంది.

విద్య రుణం తిరిగి చెల్లింపులు(వ‌డ్డీపై మాత్ర‌మే):
ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌డం కోసం తీసుకున్న రుణంపై కూడా ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో విద్యా రుణంపై చెల్లించే వ‌డ్డీ(అసలుపై వ‌ర్తించ‌దు)కి కూడా మిన‌హాంపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

నివారణ కోసం ఆరోగ్య పరీక్షలు:
మీకోసం నిర్వ‌హించే ఆరోగ్య ప‌రీక్ష‌ల ఖ‌ర్చుల‌పై రూ.5 వేలు, త‌ల్లిదండ్రుల ఆరోగ్య ప‌రీక్షా ఖ‌ర్చుల‌పై రూ.5 వేలు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌)కు అందించే స్వ‌యం స‌హ‌కారం:
సెక్ష‌న్ 80 సీతో పాటు ఎస్‌పీఎస్‌కు అందించే స్వ‌యం స‌హ‌కారంపై సబ్‌సెక్ష‌న్ 80సీసీడీ(1బీ) కింద అద‌నంగా రూ.50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు.

ఇంటి రుణం:
ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇంటి రుణంపై చెల్లించే వ‌డ్డీకి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను త‌గ్గింపు పొంద‌వ‌చ్చు.

హెచ్ఆర్ఏ:
మీరు అద్దె ఇంటిలో నివ‌సిస్తున్న‌ట్ల‌యితే మీ బేసిక్ శాల‌రీ, హెచ్ఆర్ఏ అలెవెన్స్‌ల ఆధారంగా చెల్లించే అద్దెపై మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

ఎల్‌టీఏ:
లీవ్ ట్రావెల్ అలెవెన్స్‌(ఎల్‌టీఏ)ను లీవ్ ట్రావెల్ క‌న్సెష‌న్‌(ఎల్‌టీసీ) అని కూడా అంటారు. నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో రెండు సార్లు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. ఇందుకు ప్ర‌యాణ‌పు బిల్స్‌ను ఇవ్వాలి.

మీ కార్యాలయం హెచ్ఆర్ లేదా అకౌంట్స్ విభాగానికి సంబంధిత పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒక‌వేళ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌డంలో విఫ‌ల‌మైతే, ఎక్కువ టీడీఎస్‌ను చెల్లించాల్సి వ‌స్తుంది. అయితే ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు(ఐటీఆర్‌) దాఖ‌లు చేసి రీఫండ్ పొంద‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly