సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం మంచిదేనా?

బాలికలకు అభ్యున్నతిని అందించేందుకు ప్రారంభమైన పధకం సుకన్య స‌మృద్ధి

సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం మంచిదేనా?

కేంద్ర ప్ర‌భుత్వం బేటీ బ‌చావో బేటీ ప‌డావోలో భాగంగా సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం బాలిక‌ల చ‌దువు, వివాహ స‌మ‌యంలో ఆర్థిక కార‌ణాల‌తో ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కుండా అవ‌స‌రానికి త‌గిన మొత్తం స‌మ‌కూర్చుకునే వీలు క‌ల్పించ‌డం.

ఖాతా విధివిధానాలు:

 • ఈ ప‌థ‌కం కింద బాలిక త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుడు ఎవ‌రైనా ఖాతా తెర‌వ‌వ‌చ్చు. బాలిక ప‌దేళ్ల వ‌య‌సు నుంచి ఖాతాను స్వ‌యంగా నిర్వ‌హించుకోవ‌చ్చు.
 • ఒక బాలికకు ఒక ఖాతాను మాత్రమే అనుమతిస్తారు.
 • తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతినిస్తారు. ఇందుకోసం వైద్య‌ప‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
 • దత్తత తీసుకున్న బాలిక పేరు పై కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.

ఖాతా ప్రారంభించేందుకు

 • వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం, చిరునామా గుర్తింపు ప‌త్రాల‌తో పాటు జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
 • ఖాతాను మొద‌టిసారి రూ.1000 డిపాజిట్‌తో తెర‌వాల్సి ఉంటుంది.

క‌నిష్ఠ గ‌రిష్ఠ పెట్టుబ‌డులు

 • ఏడాదికి క‌నీసం రూ.1000 డిపాజిట్ చేయాలి.
 • ఏడాదికి గ‌రిష్ఠంగా రూ.1.5లక్ష‌ల వ‌ర‌కూ డిపాజిట్ చేయ‌వచ్చు.
 • ఖాతా తెరిచిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం క‌నీసం రూ.1000 జ‌మ‌చేయాలి.
 • ఏదైనా సంవ‌త్స‌రంలో క‌నీస డిపాజిట్ చేయ‌క‌పోతే రూ.50 అప‌రాధ రుసుం చెల్లించి ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు.

డిపాజిట్ ఇలా చేయ‌వ‌చ్చు…

 • న‌గ‌దు లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో డ‌బ్బును డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

డిపాజిట్‌పై అమ‌ల‌య్యే వ‌డ్డీ

 • ప్రస్తుత వార్షిక వ‌డ్డీ 8.1 శాతంగా నిర్ణయించారు.
 • ఈ ఖాతాల‌కు అమ‌ల‌య్యే వ‌డ్డీ కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించే విధంగా ఉంటుంది.

పెట్టుబ‌డి కాల‌వ్య‌వ‌ధి

 • ఇది 21 సంవత్సరాల గరిష్ట కాల పరిమితి కలిగిన ఖాతా.
 • ఖాతా తెరిచిన సంవ‌త్స‌రం నుంచి 14 సంవ‌త్స‌రాల పాటు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.
 • బాలిక‌కు 21 ఏళ్లు నిండే వ‌ర‌కూ ఖాతా కొన‌సాగుతుంది.

విత్‌డ్రా , ముంద‌స్తు ఖాతా ముగింపు:

 • బాలిక‌కు 18 ఏళ్లు నిండిన త‌ర్వాత మాత్ర‌మే ఒక్క‌సారి విద్య లేదా వివాహ అవ‌స‌రాల నిమిత్తం ఖాతాలోని సొమ్ములో 50శాతం మేర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
 • 21 ఏళ్లు వ‌చ్చాక ఖాతాను పూర్తిగా ముగించ‌వ‌చ్చు.
 • ల‌బ్ధిదారుకు అనుకోకుండా ఏదైనా జ‌రిగితే, మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించిన త‌ర్వాత సంర‌క్షుల‌కు ఖాతాలోని సొమ్మును చెల్లిస్తారు.

బ‌దిలీ:

 • దేశంలోని ఏదైనా పోస్టాఫీసు లేదా అనుమ‌తి పొందిన బ్యాంకు శాఖకు ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

పాస్‌పుస్త‌కం

 • ఖాతా ప్రారంభ స‌మ‌యంలోనే పాస్‌పుస్త‌కం అంద‌జేస్తారు. ఇందులో బాలిక‌ పుట్టిన తేదీ, ఖాతా ఆరంభ తేదీ, డిపాజిట్ సొమ్ము, ఖాతాదారు పేరు, చిరునామా మొద‌లైన వివ‌రాలు ఉంటాయి.
 • ఖాతా తెరిచే స‌మయానికి, డిపాజిట్ చేసేట‌ప్పుడు, డ‌బ్బు విత్ డ్రాయ‌ల్‌, ఖాతా ముగించేప్పుడు పాస్‌పుస్త‌కం ఉండాలి.

చివరగా

ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో పధకాలు అందుబాటులో ఉన్నాయి, ముఖ్యానంగా పిల్లల చదువు కోసం రక రకాల పేర్లతో పధకాలు ప్రవేశ పెడుతున్నారు. వీటితో పోలిస్తే ఆడ పిల్ల కోసం సుకన్య సమృద్ధి పధకం మంచిదనే చెప్పాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly