ఈ రుణాలు అవసరమా ...

మనకు అవసరమైన మొత్తం స్వల్ప కాలిక , మధ్య కాలిక , దీర్ఘ కాలిక లక్ష్యం కోసమా చూడాలి.

ఈ రుణాలు అవసరమా ...

రుణం తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది . పాత తరం వాళ్ళు కావలిసిన డబ్బు కూడబెట్టి, ఆ తరువాత ఇల్లు లేదా ఒక వస్తువు కొనడం చేసేవారు. మరీ అవసరం అయి , తొందరగా తీర్చగల అవకాశం ఉంటె తప్ప రుణం తీసుకునే వారు కాదు. మారుతున్న కాలంలో ప్రజల అవసరాలు, జీవన ప్రమాణాలాలతో పాటు జీవన విధానం కూడా మారుతోంది. అందుకు తగినట్లుగా ఉండటానికి కావలసిన సదుపాయాలను త్వరితగతిన ఏర్పరచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే పాత తరం వారిలా వేచిచూసే ధోరణిలో లేరు. అన్నీ త్వరితగతిన కావాలని కోరుకుంటున్నారు. దీనికి ఒక మార్గం రుణం తీసుకుని , వాయిదా పద్దతిలో చెల్లించడం. దీనికి మరో కారణం రుణం ఇచ్చేవారు కూడా ఉండటం. దీనివలన వస్తు సేవల వినియోగం పెరిగి దేశ ఆర్ధిక పురోగతికి దారితీస్తుంది.

ఇందులో రెండు రకాల రుణదాతలు ఉంటారు. బ్యాంకులు వంటివి అన్ని పరిశీలించి అనువైన వారికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం.
రెండవ రకం రుణదాతలు అధిక వడ్డీకి ఇచ్చేవారు. అయితే వ్యక్తిగతంగా రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో చూద్దాం.

మనకు అవసరమైన మొత్తం స్వల్ప కాలిక , మధ్య కాలిక , దీర్ఘ కాలిక లక్ష్యం కోసమా చూడాలి. దీర్ఘ కాలిక అంటే ఇంటి కొనుగోలు, మధ్యకాలిక అంటే పిల్లల పైచదువుల కోసం, కారు కొనుగోలు వంటివి. స్వల్పకాలిక అంటే అత్యవసర అనారోగ్య చికిత్స, విహార యాత్రలు వంటివి. సాధారణంగా ఆర్ధిక సంస్థలు కూడా అవసరాన్ని బట్టి ఇంటి రుణం , కారు కొనుగోలు రుణం, క్రెడిట్ కార్డు లేదా పర్సనల్ లోన్ వంటివి ఇస్తున్నాయి.

ఇంటి రుణం :
ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. చాలా మందికి జీవితంలో ఒకసారే చేసే అవకాశం. అందరికి ఇళ్ళు అనే నినాదంతో ప్రభుత్వాలు రాయితీలను కూడా ఇస్తున్నాయి. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గుతున్నాయి. కొంత సొమ్ము డౌన్ పేమెంట్ చేసి మిగిలిన దీనిని వాయిదాలలో చెల్లించవచ్చు. అవకాశం ఉంది కదాని అధిక మొత్తం లో రుణం తీసుకోకూడదు. ఇంటి మీద ఎంతైనా ఖర్చు చేయవచ్చు. అయినా సంతృప్తి ఉండదు. ఇంకా ఏవో తక్కువ . కొత్త పరికరాలు, సౌకర్యాలు ఉండాలనుకుంటాం. ఖర్చు అదుపు తప్పితే మిగిలిన ఆర్ధిక లక్ష్యాలు కూడా దెబ్బతింటాయి. అసలుకే ఇబ్బంది రావచ్చు. అందుకే మన పెద్దలు చెబుతారు - ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’. అంటే ఈ రెంటి విషయంలో ఖర్చులు అదుపులో ఉండాలి.

చాలామంది ఇంటి రుణాన్ని త్వరగా తీర్చివేయాలని చూస్తుంటారు. ఇది మంచిదే. అయితే దీర్ఘకాలం కొనసాగించినట్లైతే పన్ను మినహాయింపులు పొందటంతోపాటు, ఇతర ఆర్ధిక లక్ష్యాలకు కూడా కొంత సొమ్ము కేటాయించడం వలన అన్ని లక్ష్యాలను సకాలంలో చేరుకోవచ్చు. రుణం తీసుకుని చెల్లించే అసలుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే చెల్లించే వడ్డీ కి సెక్షన్ 24బి కింద వార్షికంగా రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అందువలన దీర్ఘకాలంలో ఇది ఒక మంచి పన్ను మినహాయింపు పధకం. ముందస్తు చెల్లింపు చేయాలనుకుంటున్న సొమ్మును ఇతర పథకాల్లో మదుపు చేసి ఇతర లక్ష్యాలను కూడా సులువుగా చేరుకోవచ్చు.

కారు రుణం :
సౌకర్యవంతమైన జీవితం గడపడానికి కారు మరొక సాధనం. రోజువారీ ఆఫీస్ కి, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విహార యాత్రలకు ఎంతో అనువుగా ఉంటుంది. అధిక ఆదాయం కలవారు మాత్రమే నిర్వహించగల కారును , మధ్య తరగతి వారు కూడా తీసుకుంటున్నారు. అనేక ఆర్ధిక సంస్థలు అనువైన వాయిదా పద్ధతులలో చెల్లించే విధంగా రుణాలు ఇస్తున్నాయి. ఇవి 3- 7 ఏళ్ల కాలానికి ఇస్తున్నాయి.

అయితే వీటిపై వడ్డీ రేట్లు ఇంటి రుణం కంటే అధికంగా ఉంటాయి. ఈ రుణం ఫై చెల్లించే వాయిదాలకు ఎటువంటి పన్ను మినహాయింపులు లభించవు. దీనికి తోడు నిర్వహణ ఖర్చులు పెరిగి మోయలేని భారంగా తయారవుతున్నాయి. దీంతో కొత్త కారు కొన్నా , కొద్ది నెలల లోనే తిరిగి ఇచ్చేస్తున్నారు. అందుకనే మార్కెట్లో చాలా సెకండ్ హ్యాండ్ కార్లు లభ్యమవటానికి ఇదొక కారణం. దీని బదులు ఓలా, ఉబెర్ లాంటి నెట్వర్క్ సర్వీస్ లను వినియోగించుకోవచ్చు. కారు కొనుగోలు, నిర్వహణకు వెచ్చించే సొమ్మును పిల్లల ఉన్నత చదువులకోసం ఉపయోగించుకోవచ్చు.

క్రెడిట్ కార్డు రుణం :
ప్రస్తుత రోజులలో చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డు ను వివిధ సదుపాయాలతోపాటు, డిస్కౌంట్స్, కాష్ బ్యాక్ లాంటి ఆఫర్లను ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డును కలిగి ఉంటే చాలా చోట్ల అధిక నగదును తీసుకువెళ్లవలసిన అవసరం ఉండదు. చేతిలో నగదు లేదే అనే ఇబ్బంది ఉండదు. సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పరిమితికి మించి కూడా ఖర్చుచేయవచ్చు.

వీటిపై వడ్డీ అత్యధికంగా (24-30 శాతం వరకు) ఉంటుంది. కనీస మొత్తం చెల్లించలేని పక్షంలో అధిక రుసుములు వసూలు చేస్తాయి. నగదు ఉంటె అంత వరకే ఖర్చుచేయగలము. అదే క్రెడిట్ కార్డు లో పరిమితికి మించి ఖర్చు చేస్తాము. అవసరం ఉన్నా లేకున్నా కొన్ని వస్తు సేవలను వినియోగించుకుంటాము. ఇవి మోయలేని భారంగా తయారై , మన ఆర్ధిక లక్ష్యాలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి మనకు అవసరమైతేనే కార్డు తీసుకోవడం. ఒకవేళ కార్డు ఉన్నా ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలి. పరిమితికి మించి వాడడం, కనీసపు చెల్లింపులు చేయకపోవడం వంటి వలన మీ క్రెడిట్ స్కోర్ ఫై కూడా ప్రభావం చూపిస్తాయి .

వ్యక్తిగత రుణం :
ఈ మధ్య కాలంలో వ్యక్తిగత రుణం తీసుకునేవారు ఎక్కువ అయ్యారు. కారణం బ్యాంకులు ఎటువంటి హామీ లేకుండా ఈ రుణాన్ని ఇవ్వడం. అవసరం ఉన్న లేకున్నా చాలా మంది ఈ రుణాన్ని తీసుకుంటున్నారు. దీనిఫై వడ్డీ అధికంగా ఉండటం, అవసరానికి మించి తీసుకోవడం, కొన్ని సందర్భాలలో అవసరం లేకున్నా, హామీ లేకుండా ఇస్తున్నారుగా అని తీసుకోవడం జరుగుతోంది. ఒకవేళ తిరిగి చెల్లిద్దామంటే , కనీస వడ్డీ కింద చాలా మొత్తంలో చెల్లించాల్సి రావడం జరుగుతోంది. ఎందుకంటే వీటిలో వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. సాధ్యమైనంతవరకు ఇటువంటి రుణాలకు దూరంగా ఉండటం మంచిది . ఒకవేళ అత్యవసరమై తీసుకోవాల్సి వస్తే, మీ తిరిగి చెల్లించే సామర్ధ్యం, ముందస్తు చెల్లింపులకు వర్తించే రుసుము వంటివి ముందుగానే తెలుసుకోవాలి.

ముగింపు:
మారుతున్న అవసరాలకు రుణం తీసుకోవడంలో తప్పులేదు. అయితే ఈ రుణం ఏ పనికోసం తీసుకున్నమో దానికే ఉపయోగించడం, రుణ నియమ నిబంధలను తెలుసుకోవడం, సకాలంలో వాయిదాలను చెల్లించడం వంటి వాటి ద్వారా లాభపడవచ్చు కూడా. దీనికి వ్యక్తిగత నియంత్రణ, నిబద్దత ఎంతో ముఖ్యం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly