మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మార్పులు జ‌రిగితే

మ‌దుప‌ర్ల భ‌ద్ర‌త‌ను ప్ర‌భావితం చేసే ఏ విధ‌మైన మార్పు చేయాల‌న్నాఫండ్ నిర్వాహ‌కులు ముంద‌స్తుగా సెబీ అనుమ‌తి తీసుకోవాలి. అనుమ‌తి పొందిన త‌రువాత ఆ విష‌యాన్ని మ‌దుప‌ర్ల‌కు తెలియ‌జేయాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మార్పులు జ‌రిగితే

సెబీ నిబంధ‌న ప్ర‌కారం మ్యూచువ‌ల్ ఫండ్ ప్రాథ‌మిక ల‌క్ష‌ణాల్లో ఏవైనా మార్పులు జ‌రిగిన‌పుడు యూనిట్ల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు మ‌దుప‌ర్లకు అవ‌కాశం ఇవ్వాలి. ఫండ్ నుంచి వైదొల‌గ‌డం లేదా ఆ యూనిట్ల‌ను వేరొక ఫండ్ లోకి మార్చుకునే వారికి అవ‌కాశం క‌ల్పించాలి. మ్యూచువ‌ల్ ఫండ్ ప్రాథ‌మిక ల‌క్ష‌ణం అంటే ఫండ్ పెట్టుబ‌డి కేటాయింపులు, ప‌థ‌కం నిబంధ‌న‌లు. వీటిలో ఏమైనా మార్పు చేస్తే ఫండ్ నిర్వాహ‌కులు సెబీ నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకోవాలి.

ఆఫ‌ర్ డాక్యుమెంటులో మార్పులు

సాధార‌ణంగా మ్యూచువ‌ల్ ఫండ్లు రెండేళ్లకోసారి ఆఫ‌ర్ డాక్యుమెంట్ల‌ను పునః ముద్ర‌ణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఏమైనా మార్పులు జ‌రిగిఉంటే వాటిని వాటాదార్ల‌కు తెలియ‌జేసేందుకు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుంటారు. దీంతో పాటు ఫండ్ సంస్థ‌కు సంబంధించిన‌ ప్ర‌ధాన నిర్వాహకుల మార్పు, పెట్టుబ‌డి నియంత్ర‌ణ , అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ మార్పు, స్పాన్స‌ర్ మార్పు, నిర్వ‌హాణ రుసుముకు సంబంధించిన మార్పులు చేసేందుకు ఫండ్ నిర్వాహ‌కులు ఆ విష‌యాన్ని ముందుగా సెబీకి నివేదించాలి. అనంత‌రం అదే విష‌యం మ‌దుప‌ర్ల‌కు తెలియజేయాలి. ఈ విష‌యాన్ని మ‌దుప‌ర్ల‌కు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌, వ్య‌క్తిగ‌తంగా స‌మాచారం అందించాలి. అన్నింటికంటే ప్ర‌ధానంగా ఫండ్ చేసే పెట్టుబ‌డుల కేటాయింపుల్లో మార్పులు జ‌రిగిన‌పుడు మ‌దుప‌ర్ల‌కు యూనిట్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం ఇవ్వాలి.

కేటాయింపుల్లో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు

  • డెట్ లో ఎక్కువ పెట్టుబ‌డి చేసే ఫండ్ ఈక్విటీలో పెట్టుబ‌డి చేసే విధంగా మారొచ్చు
  • ఈక్విటీలో ఎక్కువ పెట్టుబ‌డి చేసే ఫండ్ డెట్ లో పెట్టుబ‌డి చేసే విధంగామారొచ్చు
  • డెట్,ఈక్విటీ రెండింటిలోనూ చేసేది డెట్ ఫండ్ గామారొచ్చు
  • డెట్, ఈక్విటీ రెండింటిలోనూ చేసేది ఈక్విటీ ఫండ్ గామారొచ్చు
    పైన చెప్పిన విధంగా మార్పులు జ‌రిగిన‌పుడు న‌ష్ట‌భ‌యం లో మార్పులు ఏర్ప‌డ‌తాయి. కాబ‌ట్టి మ‌దుప‌ర్ల న‌ష్ట‌భ‌యం బ‌ట్టి ఆ ఫండ్ లో కొన‌సాగాలో లేదో నిర్ణ‌యించుకోవాలి.

మార్పులు ఎలా తెలుస్తాయి…

ఫండ్ సంస్థ‌లు స‌వ‌ర‌ణకు సంబంధించిన ప్ర‌క‌ట‌న (ఏడెండ‌మ్) ను విడుద‌ల చేస్తారు. ఆ ఫండ్ సంబంధిత వెబ్‌సైటులో ఉంచుతారు. వ్య‌క్తిగ‌తంగా వాటాదార్ల‌కు స‌మాచారం అందుతుంది.

మ‌దుప‌ర్లు తీసుకోవాల్సిన జాగ్రత్త‌లు

పెట్టుబ‌డి కేటాయింపుల్లో మార్పుజరిగిందంటే ముందుగా ఏయే మార్పులు చేశారో చూసుకోవాలి. సాధార‌ణంగా త‌మ న‌ష్టాన్ని భ‌రించే శ‌క్తిని బ‌ట్టి ఫండ్ల‌లో మ‌దుపుచేస్తుంటారు. మార్పు అనంత‌రం ఫండ్ న‌ష్ట‌తీవ్ర‌త ఎక్కువ లేదా త‌క్కువ‌గా మారే అవ‌కాశం ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
ఉదాహ‌ర‌ణ‌కు అధిక‌ రాబ‌డి కోసం కాస్త న‌ష్ట‌భ‌యం ఉన్న ఈక్విటీ ఫండ్ల‌లో మ‌దుపుచేసిన వారు త‌ర్వాత కాలంలో ఆ ఫండ్ డెట్ ఫండ్ గా మారిందంటే అనుకున్నల‌క్ష్యాన్ని చేరుకోలేరు.
ఉదాహ‌ర‌ణ‌కు ఒక మ‌దుప‌రి డెట్ ఫండ్ లో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌ని మ‌దుపు చేశార‌నుకుందాం. త‌ర్వాత కాలంలో ఆ ఫండ్ ఈక్విటీ ఫండ్ గా మారిందంటే న‌ష్ట‌భ‌యం పెరుగుతుంది. కొన్ని ప‌రిస్థితుల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశం కూడా ఉండొచ్చు.
ఒక సారి ఈ ఫండ్ నుంచి వైదొల‌గిన మ‌దుప‌ర్ల‌కు సంబంధించిన సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్ష‌న్లు తొల‌గిపోతాయి.

ఫండ్ నిర్వాహ‌కులు చేయాల్సిన‌వి

  • న‌ష్ట‌భ‌యం రీత్యా కొన‌సాగేందుకు ఇష్టం లేని మ‌దుప‌ర్ల‌కు పెట్టుబ‌డి ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించాలి.
  • ఫ‌లానా తేదీ నుంచి ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవాల్సిందిగా తెలియ‌జేయాలి.క‌నీసం 15 రోజుల గ‌డువు ఇవ్వాలి. మార్పులు అమ‌లుప‌రిచే తేదీ (ఎఫెక్టివ్ డేట్)ని తెలియ‌జేయాలి.
  • ఎటువంటి లోడ్ ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌దు.ఒక వేళ సెక్యురిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్ ఫండ్ సంస్థ‌లు చెల్లించాలి.
  • ఏవిధంగా మ‌దుప‌ర్లు యూనిట్ల‌ను ఉప‌సంహ‌రించుకునే విధానాన్ని అందుకు సంబంధించిన స‌మాచారాన్ని తెలియ‌జేయాలి.

(Source: LiveMint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly