ఈపీఎఫ్ వాటా త‌గ్గి.. వేత‌నం పెర‌గ‌నుందా?

రంగాలను బట్టి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూష‌న్‌లో ఉద్యోగుల వాటా 9-12% మధ్య మారవచ్చు. దీంతో ఉద్యోగుల‌కు ల‌భించే జీతం పెరిగే అవ‌కాశం ఉంటుంది

ఈపీఎఫ్ వాటా త‌గ్గి.. వేత‌నం పెర‌గ‌నుందా?

సంఘ‌టిత రంగాల్లో ప‌నిచేసే వేత‌న జీవుల‌కు చేతికి వ‌చ్చే జీతం పెర‌గ‌నుంది. ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని ఎంపిక చేసిన రంగాల్లో ఈపీఎప్ ఖాతా కోసం నెల‌వారి చ‌ట్ట‌బ‌ద్ద‌మైన త‌గ్గింపులను కుదించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ దీనివ‌ల‌న ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో దీనిపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న 12 శాతం కంటే త‌క్కువ‌గా మిన‌హాయించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. అయితే సంస్థ వాటా 12 శాతం మాత్రం అలాగే కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ఉద్యోగులు, సంస్థ కూడా స‌మానంగా ప్ర‌తి నెల 12 శాతం చొప్పున ఈపీఎప్ ఖాతాలో జ‌మ‌చేస్తారు. ఈ నిబంధ‌నలు ఎంఎస్ఎంఈ, టెక్స్‌టైల్, అంకుర సంస్థ‌ల‌కు వ‌ర్తింప‌జేసే అవ‌కాశ‌ముంద‌ని సంబంధిత వ‌ర్గాలు చెప్తున్నాయి. ఉద్యోగుల వాటా 9 శాతం నుంచి 12 శాతం మ‌ధ్య రంగాన్ని బ‌ట్టి ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా. దీంతో ఉద్యోగులు పొందే జీతం ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

కానీ ఈ మార్పు మందగించే ఆర్థిక పరిస్థితుల్లో దేశీయ వినియోగాన్ని పెంచే చర్యగా చూడలేము. ఉద్యోగి, యజమాని చేసే ఈపీఎఫ్ఓ ఖాతాకు చేసే కాంట్రిబ్యూష‌న్‌తో వార్షిక వసూళ్లు రూ. 1.3 ట్రిలియన్లుగా ఉన్నాయి. ఇప్పుడ కొన్ని రంగాలలో ఉద్యోగుల వాటాను రెండు లేదా మూడు శాతం తగ్గించడం వల్ల సంవత్సరానికి దాదాపు రూ. 3,000 కోట్ల వినియోగం పెర‌గ‌వ‌చ్చు. జిడిపి ఆరు సంవత్సరాల కనిష్టానికి మందగించిన సమయంలో ఇది చాలా తక్కువ అని విశ్లేష‌కుల భావ‌న‌.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly