ఏప్రిల్ చివ‌రి నాటికి శ్ర‌మ‌-యోగి ప‌థ‌కంలో కోటి మంది కార్మికులు

ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ‌-యోగి మాన్‌ధ‌న్ యోజ‌న ప‌థ‌కం, అసంఘ‌టిత రంగ కార్మికులకు రూ.3,000 కనీస నెలవారీ పింఛ‌ను హామీ అందిస్తుంది

ఏప్రిల్ చివ‌రి నాటికి శ్ర‌మ‌-యోగి ప‌థ‌కంలో కోటి మంది కార్మికులు

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశపెట్టిన బ‌డ్జెట్‌లో అసంఘ‌టిత రంగ కార్మికుల కోసం ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ‌-యోగి మాన్‌ధ‌న్ యోజ‌న (పీఎమ్ఎస్ఎమ్‌) ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఈ ప‌థ‌కంలో ఎప్రిల్ చివ‌రి నాటికి 1 కోటి మంది కార్మికులు న‌మోదు చేసుకుంటార‌ని భావిస్తున్న‌ట్లు సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు. పీఎమ్ఎస్‌వైఎమ్ ప‌థ‌కం కింద న‌మోదు చేసుకున్న అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు అనంత‌రం ప్ర‌తీనెల రూ.3 వేలు ఫించ‌ను ప్ర‌భుత్వం అందిస్తుంది. ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టికే 25.36 ల‌క్ష‌ల అసంఘ‌టిత కార్మికులు న‌మోదు చేసుకున్నారు. ప్ర‌తీరోజు దేశ‌వ్యాప్తంగా 1ల‌క్ష కార్మికులు ఈ ప‌థ‌కానికి న‌మోదు చేసుకొంటున్నారు. ఏప్రిల్ 2019 చివ‌రి నాటికి ఈ ప‌థ‌కం కింద న‌మోదు చేసుకునే వారి సంఖ్య 1కోటి చేరుకుంటుద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు సీఎస్‌సీ ఈ-గ‌వ‌ర్నెన్స్ స‌ర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌(సీఎస్‌సీ ఎస్‌పీవీ) సీఈఓ దినేష్ త్యాగి తెలిపారు.

సీఎస్‌సీ ఎస్‌పీవీ ఏర్పాటు చేసిన, దేశ‌వ్యాప్తంగా విస్త‌రించి ఉన్న కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ వ‌ద్ద కార్మికులు ఈ ప‌థ‌కానికి న‌మోదు చేసుకోవ‌చ్చు. భారతదేశంలో మొత్తం 3.19 కోట్ల సీఎస్‌సీ కేంద్రాలు ఉండ‌గా, ప్ర‌భుత్వం గ‌త నెల ప్ర‌వేశ‌పెట్టిన ఫించ‌ను ప‌థ‌కం కోసం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2.99 కోట్ల సీఎస్‌సీ కేంద్రాలు న‌మోదు ప‌క్రియకు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం ఫిబ్రవరి 15, 2019 నుంచి అమల్లోకి వచ్చింది.

అసంఘ‌టిత రంగ కార్మికులలో పెరుగుతున్న అవ‌గాహ‌న కార‌ణంగా రోజువారీగా న‌మోద‌వుతున్న కార్మికుల సంఖ్య పెరుగుతుంది. ఈ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ చివ‌రి నాటికి ఈ ప‌థ‌కం కింద న‌మోదు చేసుకునే వారి సంఖ్య 5 కోట్లుకు పెరుగ‌వచ్చ‌ని ఆశిస్తున్న‌ట్లు త్యాగి తెలిపారు. 2019-20 సంవ‌త్స‌రానికి ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో 10 కోట్ల మంది అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు ల‌బ్ధి చేకూర్చాల‌నే లక్ష్యంతో ప్ర‌భుత్వం పీఎమ్ఎస్‌వైఎమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

డ్రైవ‌ర్లు, ప‌నిమ‌షులు, స‌హాయ‌కులు వంటి అసంఘ‌టిత రంగ కార్మికుల కోసం సీఎస్‌సీ ఎస్‌పీవీ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంది. 18 నుంచి 40 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల కార్మికులు ఈ ప‌థ‌కంలో న‌మోదు చేసుకోవ‌చ్చు. వ్య‌క్తి వ‌య‌సు ఆధారంగా చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియం లెక్కిస్తారు. 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల కార్మికులు రూ.55 లు, 40 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల కార్మికులు గ‌రిష్టంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. కార్మికుని వాటాతో స‌మాన‌మైన మొత్తాన్ని ప్ర‌భుత్వం కార్మికుని కోసం ఈ ప‌థ‌కంలో చెల్లిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly