వీలునామా రాస్తున్నారా? ఈ విషయాలు గమనించండి..

భ‌విష్య‌త్‌లో వార‌సుల మ‌ధ్య ఆస్తి త‌గాదాలు రాకుండా వీలునామా ఎంత‌టి పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం.

వీలునామా రాస్తున్నారా? ఈ విషయాలు గమనించండి..

మ‌న దేశంలో వీలునామా రాయడం ముఖ్యమైన విధిగా భావించేవారు తక్కువే అని చెప్పవచ్చు. ఇల్లు, స్థ‌లం, ఆభ‌ర‌ణాల కొనుగోలుపై ఆస‌క్తి చూపించినంత‌గా వీలునామా రాయ‌డంలో చూపించ‌రు. వీలునామా లేని కార‌ణంగా వార‌సుల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు దారి తీసే ప‌రిస్థితులు ఎన్నో ఉంటాయి. బాగా ధ‌న‌వంతులు లేదా ఎక్కువ సంఖ్య‌లో వార‌సులు క‌లిగిన‌వారే వీలునామా రాయాల‌నే దుర‌భిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఆస్తి త‌క్కువ‌గా ఉన్నా… వారసులుగా ఒక‌రో ఇద్ద‌రో ఉన్నా వీలునామా రాస్తేనే అంద‌రికీ మంచిది. ఆస్తి పంప‌కాల్లో భ‌విష్య‌త్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా వీలునామా ప‌రిష్కార‌మార్గం చూపిస్తుంది.

వీలునామా రాసేట‌ప్పుడు ఏయే అంశాల‌పై దృష్టి పెట్టాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకొని ఆచ‌రించే ప్ర‌య‌త్నంచేద్దాం.

వీలునామా రాయ‌కుండా…

 • వీలునామా రాయ‌కుండా గ‌తిస్తే ఆ వ్య‌క్తికి సంబంధించిన ఆస్తి పంప‌కాల్లో చాలా త‌గాదాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. ఆస్తుల‌కు సంబంధించి కేంద్రీకృత రికార్డులు లేక‌పోవ‌డం, చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సుల‌ను ధ్రువీక‌రించడంలో ఇబ్బందులు ఎదురుకావ‌డం, ఆస్తుల పంప‌కానికి స‌రైన మ‌ధ్య‌వ‌ర్తిత్వం లేక‌పోవ‌డం, కోర్టు కేసుల‌కు భారీ ఫీజులు లాంటి ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చి కూర్చుంటాయ‌ని సిరిల్ అమ‌ర్‌చంద్ మంగ‌ళ్‌దాస్ అనే న్యాయ సేవ‌ల సంస్థ భాగ‌స్వామి సందీప్ దావే అన్నారు.

 • వీలునామా రాయ‌కుండా వ్య‌క్తి మృతిచెందితే … న్యాయ‌స్థానం నుంచి తామే చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సులమ‌ని నిరూపించేలా ఆధారాలు పొందాల్సి ఉంటుంది. స్థిర‌, చ‌ర ఆస్తుల‌తో సంబంధం లేకుండా వార‌స‌త్వ స‌ర్టిఫికెట్‌ను కోర్టు నుంచి పొందాల్సి ఉంటుంద‌ని ర‌జ‌నీ అసోసియేట్స్ అనే న్యాయ సేవ‌ల సంస్థ అసోసియేట్ భాగ‌స్వామి అయిన అమిత్ కోలేక‌ర్ త‌న అభిప్రాయం వ్య‌క్తంచేశారు.

 • వీలునామా లేని ప‌క్షంలో ఆయా వ్య‌క్తులు పాటించిన‌ మ‌తాలకు అనుగుణంగా వార‌సుల‌కు ఆస్తి పంప‌కాలు చేయాల్సి ఉంటుంది. లీగ‌ల్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. దీంతో పాటు నిష్ణాతులైన లాయ‌ర్‌ను నియ‌మించేందుకు ఫీజు ఎక్కువే ప‌డుతుంది.

ముఖ్య‌మైన క్లాజులు

 • వీలునామాలోని సారాంశాన్ని పెడ‌దోవ ప‌ట్టించ‌కుండా ప‌టిష్టంగా లిఖించాల్సి ఉంటుంది. ఇందుకుగాను అద‌న‌పు క్లాజుల‌ను జోడించ‌వ‌చ్చు. చాలా మ‌టుకు వీలునామాలు గంద‌ర‌గోళంతో, అస్ప‌ష్టంగా ఉన్న ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు చూసిన‌ట్టు సందీప్ దావే తెలిపారు. సాధార‌ణమైన‌ సందిగ్ధ‌త‌లు తొల‌గేందుకు వీలునామా రాసే వ్య‌క్తి ఇది చివ‌రాఖ‌రి విల్లు అని, గ‌తంలో రాసిన‌వ‌న్నీ చెల్ల‌వన్నీ పేర్కొవ‌డం మంచిద‌ని సందీప్ అన్నారు.

 • చ‌ర‌, స్థిర ఆస్తుల వ‌ర్ణ‌న‌, అవి ఉన్న చోటు, విలువ లాంటి వివ‌రాల‌న్నీ వీలునామాలో పొందుప‌రిస్తే బాగుంటుంద‌ని సందీప్ దావే చెప్పారు. ఎలాంటి ప్ర‌లోభాల‌కు లోనుకాకుండా లిఖిస్తున్నామ‌నే ధ్వ‌ని వీలునామాలో ప్ర‌స్పుటంగా క‌నిపించాల‌ని ఆయ‌న అన్నారు.

 • మ‌త‌ప్రాతిప‌దికన‌ వార‌సుల‌కు ఆస్తి పంప‌కాలు జ‌ర‌ప‌కుండా ఆస్తి సొంత‌దారు అభీష్టం మేర‌కే వాటా విభ‌జ‌న‌ జ‌రిగేలా చూడ‌డంలో వీలునామా ఓ ఆయుధం లాంటిద‌ని సందీప్ దావే అభిప్రాయం.

 • ఇన్ టెర్రోర‌మ్ క్లాజ్: వీలునామాలో పేర్కొన్న విధంగా ఆస్తి పంప‌కాలు స‌జావుగా జ‌రగ‌డంలో మ‌రింత స్ప‌ష్ట‌త‌నిచ్చేందుకు ఈ క్లాజ్‌ను చేర్చాల్సి ఉంటుంది. ఇన్ టెర్రోర‌మ్ అంటే లాటిన్ భాష‌లో భ‌యం అనే అర్థం వ‌స్తుంది. వీలునామా విష‌యంలో ఎలాంటి జోక్యం కూడ‌ద‌ని అది రాసే వ్య‌క్తి త‌న వార‌సుల‌కు హెచ్చ‌రించేందుకు ఈ క్లాజ్ వినియోగించ‌వ‌చ్చు.
  ఉదాహ‌ర‌ణ‌కు వీలునామా రాసే వ్య‌క్తి ఆరు వంతుల‌ ఆస్తుల‌ను ఇద్ద‌రు కొడుకుల మ‌ధ్య పంచాల‌నుకొని…త‌న ఇష్టం మేర‌కు పెద్ద కొడుక్కి అయిదు వంతుల‌ ఆస్తులు, చిన్న‌వాడికి ఒక వంతు ఆస్తిని మాత్ర‌మే పంచితే… అప్పుడు ఇద్ద‌రికీ స‌మాన వాటా కావాల‌ని చిన్న కొడుకు వీలునామాను స‌వాలు చేసే వీలు లేకుండా ఇన్ టెర్రోర‌మ్ క్లాజ్‌ను ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణుడైన అమిత్ కోలేక‌ర్ తెలుపుతున్నారు.

వీలునామా రిజిస్ట్రేష‌న్‌

 • వీలునామా రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని సందీప్‌, అమిత్ ఇద్ద‌రు నిపుణులు ధ్రువీక‌రిస్తున్నారు. భార‌తీయ వార‌సత్వ చ‌ట్టం, 1925లో కానీ భార‌త రిజిస్ట్రేష‌న్ చ‌ట్టం, 1908లో కానీ వీలునామాను రిజిస్ట‌ర్ చేయాల‌ని ఎక్క‌డా పేర్కొన‌లేదు.

 • వీలునామాను రిజిస్ర్టేష‌న్ చేయించ‌డం వ‌ల్ల అటు ఆస్తి పంపకందారుకు, ఇటు ల‌బ్ధిదారుల‌కు ఇద్ద‌రికీ మంచిదని సందీప్ దావే అన్నారు. రిజిస్ర్టేష‌న్ వ‌ల్ల వీలునామా రాసే వ్య‌క్తి, ఆస్తిని వార‌స‌త్వంగా పొందే వ్య‌క్తులిద్ద‌రూ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యానికి వ‌చ్చి త‌గిన ధ్రువీక‌ర‌ణ పొందిన‌ట్టు రుజువవుతుంద‌ని అమిత్ కోలేక‌ర్ అభిప్రాయం తెలిపారు. వీలునామాకు సంబంధించిన కాపీ రిజిస్ట్ర‌ర్ కార్యాల‌యంలో భ‌ద్రంగా ఉంటుంది. దీని వ‌ల్ల వీలునామా చినిగి పోయింది, కాలిపోయింది, గ‌ల్లంతైంది అనే వంక‌లు లేకుండా ఉంటుంద‌ని అమిత్ తెలిపారు.

 • వీలునామా రిజిస్ట‌ర్ చేయించేందుకు నామ‌మాత్ర‌పు ఫీజు ఉంటుంది. ఇది రాష్ట్రాల‌ను బ‌ట్టి ఉంటుంది. స్టాంపు డ్యూటీతో క‌లిపి రూ.200లోపే ఉండ‌వ‌చ్చు.

ఆస్తి విలువ‌, వార‌సుల సంఖ్యతో సంబంధం లేకుండా వీలునామా రాయ‌డం శ్రేయ‌స్క‌రం. కావాల్సిన వారికి స‌రైన రీతిలో ఆస్తి పంప‌కాలు చేసేందుకు వీలునామా ఉప‌యోగ‌ప‌డుతుంది. భ‌విష్య‌త్‌లో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు, వార‌సుల మ‌ధ్య చోటుచేసుకునేందుకు అవ‌కాశ‌మున్న త‌గాదాల‌తో పోలిస్తే వీలునామా రాసేందుకు పెద్ద‌గా ఖ‌ర్చు కాదు. ఎన్ని సార్ల‌యినా వీలునామాను తిర‌గ‌రాయ‌వ‌చ్చు.

(Source: LiveMint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly